ఈజిప్ట్ రాణి క్లియోపాత్రాగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్
ఈజిప్ట్ రాణి క్లియోపాత్రాగా ఏంజెలినా జోలి నటించబోతున్నారు. ఈ పాత్ర పోషించే అవకాశం రావడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉన్నారు. క్లియోపాత్ర జీవితం తెరకెక్కడం ఇది తొలిసారి కాదు. 1963లో ఆమె జీవితాన్ని ఆధారం చేసుకుని 'క్లియోపాత్రా" చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో ఎలిజబెత్ టేలర్ క్లియోపాత్రాగా నటించారు. ఆమె నటనకు అప్పట్లో అద్భుతమైన మార్కులు పడ్డాయి. తాజాగా జోలీ ఆమెను మరపించే రీతిలో నటిస్తారా? అనే చర్చలు హాలీవుడ్‌లో సాగుతున్నాయి.
ఇక ఈ చిత్రం గురించి జోలీ చెబుతూ - ''ఎలిజబెత్ టేలర్ నటనతో నన్ను పోల్చడం సరి కాదు. ఈ చిత్రంలో క్లియోపాత్రని 'సెక్స్ సింబల్"గా చూపించబోవడంలేదు. ఆమెలోని మరో కోణాన్ని చూపించే చిత్రం ఇది. ఈ చిత్రం కోసం చాలా హోమ్‌వర్క్ చేస్తున్నాను. క్లియోపాత్ర గురించి ఎవరికీ పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. ఆమె పేరు తల్చుకుంటే 'గొప్ప అందగత్తె" అని మాత్రమే అనుకుంటారు. కానీ ఈ చిత్రం విడుదల తర్వాత ఆ దృక్పథం మారిపోతుంది.
క్లియోపాత్ర అందగత్తె మాత్రమే కాదు... ఎంత మంచి తల్లో, మంచి నాయకురాలో అర్థం చేసుకుంటారు. ఆమె జీవిత చరిత్ర చదువుతుంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఐదు భాషలు అనర్గళంగా మాట్లాడగల ప్రతిభాశాలి ఆమె. నా దృష్టిలో క్లియోపాత్ర అత్యంత శక్తివంతురాలు. ఆ పవర్‌ఫుల్ లేడీ ఇమేజ్‌కి ఏమాత్రం భంగం వాటిల్లకుండా ఈ పాత్రను చేయాలని ఫిక్స్ అయ్యాను"" అన్నారు.


Click it and Unblock the Notifications











