twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దట్స్ తెలుగు ప్రత్యేకం - అద్భుత సాంకేతిక మాయాజాలం 'అవతార్' రివ్యూ

    By Kuladeep
    |
    Avatar
    Rating
    టైటానిక్ వంటి అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని అందించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ కు 'అవతార్' వంటి అద్భుత సాంకేతిక విలువలతో కూడిన ప్రేమ కథా చిత్రాన్ని అందించడానికి 15 ఏళ్లు పట్టింది. అయితే మాత్రం ఏంటి చరిత్రలో చిరస్థాయి గా నిలిచిపోయే విధంగా ఈ సినిమా రూపొందింది. టర్మినేటర్, ఏలియన్స్, ట్రూ లైస్ మరియు టైటానికి వంటి చిత్రాలను రూపొందించిన కామెరూన్ 300 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రివ్యూ షో ఇటీవలే జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలకానున్న ఈ సినిమా రివ్యూ ప్రత్యేకంగా దట్స్ తెలుగు పాఠకుల కోసం....

    అవతార్ సినిమాను చూస్తే దర్శకుడు కామెరూన్ 1940వ సంవత్సరంలో వచ్చిన 'ది వెస్ట్రనర్', 1925 లో వచ్చిన 'ది వ్యానిషింగ్ అమెరికా' వంటి సినిమాల నుండీ స్పూర్తి పొందినట్టు అనిపిస్తుంది. అవతార్ సినిమా ఊహకందని, ఎవరూ ఊహించలేని విధంగా రూపొందింది. సాంకేతికంగా అద్భుతంగా వున్న ఈ సినిమాలో అద్భుతమయిన ప్రేమ కథ కూడా వుంది. ఈ ప్రేమ కథ ప్రతి ఒక్కరి హృదయాలనూ హత్తుకునే విధంగా చిత్రీకరించారు కామెరూన్.

    ఇక కథ విషయానికి వస్తే క్రీ.శ.2154 వ సంవత్సరంలో జార్ సుల్లీ (శ్యామ్ వర్తింగ్టన్) అమెరికా నేవీలో పనిచేస్తూ గాయపడి నడవలేని స్థితిలో వుంటాడు. ఆ తర్వాత జాక్ కు అవతార్ అనే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటే జాక్ తిరిగి నడవగలడు అని తెలుస్తుంది. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జాక్ భూమి నుండీ 4.3 కాంతి సంవత్సరాల దూరంలో వున్న పాండోరా అనే అడవికి పయనమవుతాడు. ఈ అడవి నావీ అనే జీవరాశులకు నిలయము.

    పది అడుగుల ఎత్తు వుండి, పొడువాటి తోకతో, మెరిసే నీలం రంగు చర్మంలో ఈ నావీలు విచిత్రంగా వుంటాయి. కాగా ఈ పాండోరా అడవితో మనుషులు శ్వాసతీసుకోలేరు, కనుక ఈ అడవిలోకి వెళ్లిన వారిని కృత్రిమంగా బ్రీడ్ చేసి మానవ-నావీలుగా మార్పుచేసి అవతార్ అనే పేరు పెట్టి ఈ అడవిలోకి పంపుతారు. ఈ అడవిలోని విలువైన ఖనిజ సంపదను వెతుకుతూ ఈ అవతార్ లు అడవిలోకి చొచ్చుకు వెళుతుండటంతో, వీరి నుండీ తమ ప్రపంచానకి ముప్పు వాటిల్లుతుందని భావించి, వారి నుండీ తమ అడవిని కాపాడుకునేందుక నావీలు వీరి మీద యుద్ధం ప్రకటిస్తారు.

    కాగా పాండోరా అడవిలో సరికొత్త అవతార్ రూపంలో జాక్ నడవగలుగుతాడు. పాండోరా అడవిలో సైనికులకు వేగుచూచేవాడిగా నియమితుడైన జాక్ ఈ అడవిలోని ఎన్నో అందాలనూ, అద్భుతాలను ఆశ్వాదిస్తూ వుంటాడు. ఈ పరిణామ క్రమంలో నెయిత్రి(జో సాల్దనా) అనే ఓ ఆడ నావీ సాహసాలను చూసి ఆమె మీద మనసుపారేసుకుంటాడు జాక్. ఆ తర్వాత నావీలలో తనని తాను కలిపేసుకుని ఆమెతో ప్రేమలో పడతాడు అవతార్ రూపంలో వున్న జాక్. ఇలా సాగుతున్న అతని ప్రయాణం మిలటరీ, నావీ ల మధ్య యుద్ధం జరిగేప్పుడు అతను ఎవరి వైపో తేల్చుకోమన్నప్పుడు సంధిగ్ధంలో పడతాడు. ఆ తర్వాత అతను ఎవరి వైపు నిలబడతాడు, ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, పాండోరా అడవి, నావీల భవిష్యత్తు ఎటువైపు వెళ్లింది అనేది మిగిలిన కథ...

    ఇక విశ్లేషనకు వస్తే ఈ సినిమాను జేమ్స్ కామెరూన్ తన భుజస్కందాలపై వేసుకుని నడిపించాడు అనిపిస్తుంది. ఈ సినిమాతో సాంకేతిక అద్భుతాలను సృష్టించడంలో తన తర్వాతే ఎవరైనా అని మరో సారి నిరూపించుకున్నాడు కామెరూన్. శ్యామ్ వర్తింగ్టన్, జో సాల్దనా లు తమ పాత్రల పరిధిమేరకు బాగా నటించారు. స్టిఫెన్ ల్యాంగ్, సిగౌర్నీ వీవర్, మిచ్చెల్ రొడ్రిగ్యూజ్ సహాయ నటులుగా రాణించారు.

    ఈ సినిమా ప్రథమార్థం సాఫీగా, ఆశక్తిగా సాగిపోయినా ద్వితియార్థంలో కథను ముందుకు కదపడానికి కష్టపడ్డట్టు అనిపిస్తుంది. కానీ సినిమా మొత్తంగా చూస్తే ఊహకందని సాంకేతిక అద్భుతాలతో రూపొందిన ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పవచ్చు. 160 నిమిషాల పాటు సాగే ఈ సినిమాను చూస్తుంటే అప్పుడే అయిపోయిందా అని అనిపించకుండా వుండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అద్భుతమయిన సినిమాను మిస్ కావద్దని మనవి. ఈ సినిమాను 3-డి లో చూడటం ఉత్తమం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X