ఏంజలీనా, బ్రాడ్ పిట్ ల ఔదార్యం
హాలీవుడ్ హాట్ జంట ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ లు చాలా బిజీగా వున్నప్పటికీ కష్టాల్లో వున్న వారిని ఆదుకోవడానికి వారికెప్పుడూ సమయం వుంటుంది. అనాధలను దత్తతకు తీసుకొన్న ఈ జంట, తాజాగా వారు సిరియాలోని రెండు ఇరాక్ కుటుంబాలను కలుసుకొని వారి కష్టసుఖాలను ఆరాతీసి, వారిని ఓదార్చారు. ఐక్యరాజ్యసమితి బ్రాండ్ అంబ్యాసిడర్ గా వున్న ఏంజలీనా ఇరాక్ లో కిడ్నాప్ అయి దాడికి గురయిన ఓ మహిళ కష్టాలను పంచుకొని, ఆమె ధైర్యానికి ప్రశంసలు కురిపించారు.
తర్వాత జోలీ సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సద్, అతని భార్య అస్మా అల్-అస్సద్ ను కలుసుకొని దేశంలో నిరాదరణకు గురయిన పిల్లల విధ్య, ఆరోగ్యానికై తీసుకుంటున్న చర్యలను ఆరా తీసారు. బ్రాడ్ పిట్ నిరాదరణకు గురయిన బాలలను ఆటపాటల్తో అలరించాడు. ఆ మీడియాతో తర్వాత మాట్లాడిన ఏంజలీనా సిరియాలో ఎన్నో అవరోధాలున్నా ఇక్కడి ప్రభుత్వం అవసరమైన వారందరికీ ఆరోగ్యం అందించడంలో సఫలమవుతోందని, మిగిలిన దేశస్తులు కూడా ఇరాక్ బాధితులకు సాయం అందించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చింది. కానీ ఆమె పర్యటనపై అమెరికాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. మన దేశంలో వున్న సమస్యలు వదిలేసి ఇంకొకరి గురించి గింజుకోవడం ఎందుకని కొందరు ప్రత్యక్ష విమర్శలకు దిగుతున్నారు. అయినా కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలు సహజమని ఏంజలీనాకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటా.


Click it and Unblock the Notifications











