త్వరలో బ్రాడ్‌పిట్, ఏంజిలీనా జోలీల వివాహం!
లాస్‌ఏంజెల్స్: ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న హాలీవుడ్ సూపర్ జంట బ్రాడ్‌పిట్(48), ఏంజెలినా జోలీ(36) త్వరలో ఒక ఇంటి వారుకానున్నారు. ఇటీవలే వారి నిశ్చితార్థం అయినట్లు అధికారకంగా వెల్లడైంది. జోలీ కోసం ఆమె ప్రియుడు బ్రాడ్ పిట్ ఓ వజ్రపుటుంగరం తయారుచేయించడంతో ఈ విషయం బయటకొచ్చింది. పెళ్లి కోసం బ్రాడ్ 2.50 లక్షల డాలర్ల విలువైన వజ్రపుటుంగరం చేయించినట్లు బెవర్లీ హిల్స్ జ్యూయలర్ రాబర్ట్ ప్రొకాప్ వెల్లడించారు.
అనంతరం పిట్ అధికార ప్రతినిధి సింతియా పెట్-దంతే ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. 'అవును అది నిజమే. భవిష్యత్తుకు భరోసా కల్పించే ఈ నిర్ణయం పట్ల వారి పిల్లలంతా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతానికి వారి పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు' అని ఆమె తెలిపారు. చాలా నాణ్యమైన వజ్రంతో జూలీ చేతికి సరిపోయాలా చక్కని ఉంగరాన్ని తయారుచేసినట్లు ప్రొకాప్ వెల్లడించారు. లాస్‌ఏంజెల్స్ కౌంటీ మ్యూజియంలో ఇటీవల జరిగిన చైనీస్ ఆర్ట్ కలెక్షన్ కార్యక్రమంలో తొలిసారిగా జోలీ ఆ ఉంగరంతో కనిపించారు.
పిట్, జోలీలు 2004లో మిష్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటికే పిట్‌కు జెన్నిఫర్ అనిస్టన్‌తో వివాహమైంది. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గుర్ని దత్తత తీసుకోగా, మరో ముగ్గురికి జన్మనిచ్చారు.


Click it and Unblock the Notifications











