నిరాశ్రయులకు చేయూతనందిస్తున్న ఈ జంట అభినందనీయం
హాలీవుడ్ అందమయిన జంట ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ తమ మనసులు కూడా చాలా అందమయినవని ఎన్నో సార్లు చాటుకున్నారు. ఇప్పటి సంఘటన కూడా వారి మంచి మనస్సుకు నిదర్శనం. ప్రస్తుతం ఏంజలీనా జోలీ తాజా సినిమా ది టూరిస్ట్ సినిమా షూటింగ్ నిమిత్తం వెనీస్ లో వుంటున్న ఈ జంట అక్కడి నుండీ బోస్నియా దేశానికి పయనమై వెళ్లారు, అక్కడి నిరాశ్రయుల వ్యథలు విని.. వారికి సాయం చేసేందుకు.
బోస్నియా యుద్ధంలో దారుణంగా నష్టపోయి దాదాపు 18 ఏళ్లుగా సొంత ఊరికి.. ఉన్న ఆస్తులకు దూరమై దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న అక్కడి నిరాశ్రయులు తమ జీవితం ఏ గమ్యం చేరుతుందో తెలియకపోయినా వారి పిల్లల భవిష్యత్తు కోసం పడుతున్న కష్టాలను, వారి తెగువను చూసి ఆమె చలించిపోయారట. త్వరలోనే వీరి ఆలనాపాలన గురించి ఇక్కడి ప్రభుత్వంలో మాట్లాడటానికి తిరిగి బోస్నియా వస్తానని ఆమె తెలిపారు. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ప్రపంచంలోని అనేక నిరాశ్రయులకు చేయూతను అందిస్తున్న జోలీకి ఆమె భర్త బ్రాడ్ పిట్ ప్రతిఅడుగులోనూ తోడు వుంటూ ఆదర్శజంట అని అనిపించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications