గోల్డెన్ గ్లోబ్ అవార్డుల పంట పండించుకొని ఆస్కార్ కై పరుగులు తీస్తున్న 'అవతార్'..!!
ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 'టైటానిక్' సినిమా తర్వాత వచ్చిన భారీ చిత్రం అవతార్. ఈ సినిమా వసూళ్ల పరంగా టైటానిక్ సినిమాని అధికమించే దిశగా పయనిస్తోంది. వసూళ్ల పరంగానే కాక అవార్డుల్లో కూడా అవతార్ టైటానిక్ ను అనుసరిస్తోంది. తాజాగా హాలీవుడ్ లో ఆస్కార్ అవార్డుల భవితవ్యాన్ని తెలిపే గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ప్రకటించారు. ఇందులో జేమ్స్ కామెరూన్ అవతార్ సినిమా ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడి విభాగంలో రెండు అవార్డులను దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమ చిత్రాల విభాగంలో ది హర్ట్ లాకర్, ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్, ప్రీషియస్, అప్ ఇన్ ది ఎయిర్ వంటి చిత్రాలను వెనక్కు నెట్టి అవతార్ ఈ అవార్డును సొంతం చేసుకుంది.
ఇక ఉత్తమ దర్శకుడి విభాగంలో కామెరూన్ కు తన మాజీ భార్య కేథరీన్ బిజెల్ నుండీ తీవ్ర పోటీ ఎదురైంది. ఆమె దర్శకత్వం వహించిన ది హర్ట్ లాకర్ సినిమా విమర్శకుల ప్రశంసలను పొందింది. ఇరాక్ యుద్ధం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఇక ఉత్తమ నటి విభాగంలో అందరూ ఊహించినట్టే బ్లైండ్ సైడ్ చిత్రంలో నటనకు గాను సాండ్రా బుల్లక్ సొంతం చేసుకుంది. క్రేజీ హర్ట్ చిత్రంలో సంగీత కళాకారుడిగా అద్భుత నటనను ప్రదర్శించిన జెఫ్ బ్రిడ్జెస్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.
ఇదిలా వుంటే సరిగ్గా 12 ఏళ్ల క్రితం ప్రకటించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడి విభాగంలో జేమ్స్ కామెరూన్ టైటానిక్ సినిమా అవార్డులను కైవసం చేసుకుని అస్కార్ బరిలో కూడా విజేతగా నిలిచింది. దీని ప్రకారం అవతార్ సినిమా కూడా ఆస్కార్ అవార్డుని కైవసం చేసుకోనుంది.


Click it and Unblock the Notifications











