ఓప్పెన్‌హైమర్ మూవీకి అవార్డుల పంట.. ఎన్ని ఆస్కార్ అవార్డులను సాధించిందంటే?
ప్రపంచ సినిమా రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా ముగిసింది. ఈ పురస్కారాల వేదికలో అనేక భావోద్వేగాలు, ఆనందకరమైన క్షణాలు కనిపించాయి. 96 అకాడమీ అవార్డుల కార్యక్రమంలో క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఓప్పెన్‌హైమర్ చిత్రం అవార్డుల పంటపండించింది. ఈ సినిమా ఏ కేటగిరిలో అవార్డులు గెలుచుకొన్నదనే వివరాల్లోకి వెళితే..
2023 సంవత్సరంలో ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా ఓప్పెన్‌హైమర్ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం సాధారణ ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ వరకు అందర్నీ ఆకట్టుకొన్నది. అణుబాంబు సృష్టికర్త జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నోలన్ రూపొందించారు.

ఓప్పెన్‌హైమర్ సినిమా అస్కార్ అవార్డుల కార్యక్రమంలో మొదటి నుంచి సత్తా చాటుతూనే ఉంది. ఈ సినిమా మొత్తంగా 13 విభాగాల్లో నామినేట్ అయింది. ఈ సినిమాకు అత్యధికంగా అవార్డులు వస్తాయని సినీ విమర్శకులు, సాధారణ ప్రజలు ముందే అంచనా వేశారు. అంచనాలకు తగినట్టే ఈ సినిమా అత్యధిక అవార్డులు గెలుచుకోవడం విశేషంగా మారింది.
ఓప్పెన్‌హైమర్ సినిమా విషయానికి వస్తే.. 13 నామినేషన్లకు గాను.. 7 అవార్డులు గెలుచుకొని సత్తా చాటింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా హోయ్టే వాన్ హోయ్‌టేమా, ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ ఎడిటర్‌గా జెన్నిఫర్ లేమ్, ఉత్తమ సంగీతం విభాగంలో లడ్'విగ్ గోరాన్సన్, ఉత్తమ నటుడిగా కిలియన్ మర్ఫీ, ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్, ఉత్తమ చిత్రంగా కేటగిరిలో ఓప్పెన్‌హైమర్ సినిమా అవార్డులు గెలుచుకొన్నది.
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన ఓప్పెన్ హైమర్ సినిమా సుమారుగా 100 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా $952,021,870 డాలర్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఇప్పటి వరకు ప్రపంచ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా ఈ సినిమా రికార్డుల్లో నిలిచింది.


Click it and Unblock the Notifications











