'అవతార్' సినిమాకు సీక్వెల్ ను తీసే ఆలోచనలో ఆ దర్శకుడు..!!
ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత సృష్టి 'అవతార్'. సుమారు 300 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమా అద్భుతమయిన గ్రాఫిక్ మాయాజాలంతో ప్రపంచం మొత్తం విజయదుందుబి మోగించి రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. విడుదలయిన రెండు వారాలకే 600 మిలియన్ డాలర్లను వసూలు చేసి బిలియన్ డాలర్లను వసూలు చేసే దిశగా పరుగులు తీస్తోంది. కాగా జేమ్స్ కామెరూన్ ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
పాండోరా గ్రహం లోని ఖనిజాలను దోచుకోవాలనే దురాశతో అక్కడి ప్రకృతిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మానవులను ఏలియన్లను పోలిన అక్కడి వింత జీవులు అడ్డుకుంటారు. దీంతో వీరివురి మధ్య యుద్ధం మొదలవడం, ఈ ఏలియన్లకు కథానాయకుడు సాయపడటం, వారు విజయం సాధించడం ఇదీ అవతార్ సినిమా కథ క్లుప్తంగా. అతి సాధారణమయిన ఈ కథను అద్భుతమయిన సాంకేతిక విలువలతో, బిగుతైన స్క్రీన్ ప్లే తో రక్తి కట్టించడంలో కామెరూన్ ఘనవిజయం సాధించారనడం అతిశయోక్తి లేదు. దీంతో ఈ సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇక రాబోయే సీక్వెల్ లో పాండోరా లో కాకుండా మరో గ్రహంలో జరిగే కథతో సినిమాను రూపొందించనున్నట్టు కామెరూన్ తెలిపారు. కానీ ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. 'టైటానిక్' వంటి సినిమాను సృష్టించిన పుష్కర కాలానికి ఈ అవతార్ సినిమాను విడుదల చేసిన కామెరూన్ ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చెయ్యడానికి ఎంత సమయం తీసుకుంటాడో...!!


Click it and Unblock the Notifications











