ఫోటోలు: ప్రియురాలిని పెళ్లాడిన డ్వేన్ జాన్సన్(ది రాక్)
ఒకప్పుడు డబ్ల్యుడబ్ల్యుఇ రెజ్లర్‌గా వరల్డ్ వైడ్ పాపులర్ అయిన ది రాక్ అలియాస్ డ్వేజ్ జాన్సన్.... ఆ తర్వాత హాలీవుడ్లో నటుడిగా అవతారం ఎత్తి వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. తనకు రెజ్లింగ్ మాత్రమే కాదు అద్భుతమైన నటన కూడా వచ్చు అని నిరూపించుకున్నాడు.
హాలీవుడ్లో టాప్ యాక్షన్ హీరోగా ఎదిగిన డ్వేజ్ జాన్సన్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇండియాలో కూడా అతడి సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా డ్వేజ్ జాన్సన్‍తో కలిసి 'బే వాచ్' సినిమాలో నటించారు. ఇతడి మూలంగానే ప్రియాంక-నిక్ జోనస్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఆపై పెళ్లి వరకు వెళ్లింది.

ఇంటివాడైన డ్వేజ్ జాన్సన్
ఈ కండల వీరుడి గురించి అభిమానులకు ఒక గుడ్ న్యూస్. ది రాక్ పెళ్లి వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. హవాయి ద్వీపంలో తన ప్రియురాలు లురెన్ హషియన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఫోటోలు షేర్ చేశారు.

భార్యను ముద్దాడుతూ...
తన పెళ్లి విషయాన్ని వెల్లడిస్తూ రాక్ రెండు ఫోటోలు షేర్ చేశారు. ఒక దాంట్లో ఇద్దరూ తమ వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందంగా కనిపించారు. మరొక ఫోటోలో భార్యను ముద్దాడుతూ ఫోజులు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాక్ అభిమానులు నూతన దంపతులను విష్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు.

గంటలోనే 50 లక్షల లైక్స్
డ్వేన్ జాన్సన్ ఈ ఫోటోలు షేర్ చేసిన గంటలోపే దాదాపు 50 లక్షల మంది అభిమానులు లైక్స్, కామెంట్లతో ముంచెత్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీరి పెళ్లి టాపిక్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అవుతోంది. ఇన్‍స్టాలో ఈ హాలీవుడ్ స్టార్‌కు 154 మిలియన్ల పాలోవర్స్ ఉన్నారు.

12 సంవత్సరాలుగా సహజీవనం
డ్వేన్ జాన్సన్ వయసు 47 సంవత్సరాలు. ఇది ఆయనకు రెండో వివాహం. 1997లో డానీ గార్సియాను పెళ్లాడిన డ్వేన్ జాన్సన్ 2007లో విడిపోయాడు. 2007 నుంచి ప్రియురాలు లురెన్ హషియన్‌తో సహజీవనం చేస్తున్నాడు. దాదాపు 12 ఏళ్ల లివ్ ఇన్ రిలేషన్ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











