Bruce Willis: ప్రముఖ నటుడికి ప్రాణాంతక వ్యాధి.. దాని లక్షణాలు తెలిస్తే వణికిపోతారు!
ఈ మధ్య కాలంలో ఎన్నో కొత్త కొత్త రకాలైన వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. మారుతున్న జీవిన విధానాల వల్ల ప్రాణాంతకమైన వింత రుగ్మతలు బయట పడుతున్నాయి. సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా వీటి బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా' అనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రూస్ విల్లీస్. తాజాగా ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. అంతేకాదు, ఆయన ఎలాంటి సమస్యలతో బాధ పడుతున్నారో కూడా తెలుపుతూ ప్రకటనను వదిలారు.
దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగానే హాలీవుడ్‌లో నటుడిగా సత్తా చాటిన బ్రూస్ విల్లీస్.. అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఈ ఫేమస్ యాక్టర్ 'ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా' అనే ప్రాణాంతకమైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు ప్రకటనను వదిలారు. అందులో 'బ్రూస్ ఎప్పుడూ తన స్వరాన్ని ఇతరులకు సహాయం చేయడానికి, పబ్లిక్‌గా, ప్రైవేట్‌గా ముఖ్యమైన విషయాల గురించి అవగాహన పెంచుకోవడానికి తన స్వరాన్ని ఉపయోగించాలని విశ్వసించేవాడు. కానీ, ఇప్పుడు ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు' అని పేర్కొన్నారు. ఈ ప్రకటనపై విల్లీస్ ప్రస్తుత, మాజీ భార్యతో పాటు పిల్లలంతా సంతకం చేశారు.

ఇక, బ్రూస్ విల్లీస్‌కు వచ్చిన 'ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా' వ్యాధి మెదడును ప్రభావితం చేస్తుందని నిపుణులు వెల్లడించారు. ఈ వ్యాధి బారిన పడిన వాళ్లలో వ్యక్తిత్వం, భావోద్వేగాలు, ప్రవర్తన, ప్రసంగం సరిగా ఉండవని తెలిపారు. ఈ రుగ్మతల వల్ల మెదడు కణాల పనితీరును కోల్పోతుంది. దీంతో వీళ్లు సరిగా మాట్లాడలేరు.. అర్థం చేసుకోలేరు. ఒకరకంగా బతికున్నా లేనట్లే అని వైద్యులు తెలిపారు. ఇక, బ్రూస్ విల్లీస్ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని చాలా మంది సెలెబ్రిటీలు, అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బ్రూస్ విల్లీస్ 'డై హార్డ్', 'ది సిక్త్స్ సెన్స్', 'ఆర్మగెడాన్', 'పల్ప్ ఫిక్షన్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ప్రపంచ దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు. అంతేకాదు, ఆయన ఐదు సార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు ఎంపికై.. మూడు సార్లు దాన్ని దక్కించుకున్నారు. అలాగే, రెండు సార్లు ఎమ్మీ అవార్డులను కూడా గెలుచుకున్నారు.


Click it and Unblock the Notifications











