'ఎత్తు' చిత్తు చేసింది..!!
హాలీవుడ్ సినిమా 'బ్రేవ్ హార్ట్' సినిమాలో నటించి, దర్శకత్వం వహించడమే కాకుండా, ఆ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న మెల్ గిబ్సన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 12 ఏళ్లకే యాక్టింగ్ స్కూల్ లో చేరిన గిబ్సన్ 'ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్' అనే ఓ వివాదాస్పద సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. అలాంటి గిబ్సన్ తను పొట్టిగా వుండటం వల్ల ఓ అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు. హాలీవుడ్ సినిమాల్లో ఎన్ని సినిమాలు వచ్చినా జేమ్స్ బాండ్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ప్రతీ హీరో కనీసం ఒక్కసారయినా బాండ్ గా నటించాలని ఆశ పడతాడు. అలా బాండ్ గా నటించే అరుదైన అవకాశం గిబ్సన్ ను వరించినట్టే వచ్చే చేజారిపోయింది. దీనికి కారణం అతను పొట్టిగా వుండటమే.
ఈ విషయాన్ని లెజెండరీ 007 నిర్మాత కబీ బ్రకోలీ యే స్వయంగా తెలియజేసారు. తాము గిబ్సన్ ను బాండ్ గా నటింపజేయాలనుకున్నామనీ, అయితే గిబ్సన్ కేవలం 5 అడుగల 9 ఇంచుల ఎత్తు మాత్రమే ఉండటంతో అతన్ని తీసుకోలేకపోయామని తెలిపారు. గిబ్సన్ ఓ గొప్ప నటుడనీ, తాను గిబ్సన్ సినిమా తీయాలనుకోవడం లేదని బాండ్ సినిమా తీయాలనుకుంటున్నానని, దీనికి గిబ్సన్ ఎత్తు సరిపోదని అందుకే అతన్ని తీసుకోలేకపోయామని చెప్పాడు.


Click it and Unblock the Notifications











