కరోనావైరస్ బారిన పడ్డ మరో నటుడు.. టామ్ హంక్స్ భార్య డిశ్చార్జి
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కరోనావైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్నది. ఈ వైరస్ ప్రభావం సినీ పరిశ్రమలపై భారీగా చూపిస్తున్నది. పలువురు సినీతారలు ఈ వైరస్ బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో హాలీవుడ్ యాక్టర్ ఇద్రీస్ ఎల్బా చేరారు.
కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైన ఇద్రీస్ పరీక్షలు చేయించుకోగా కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని నటుడు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ రోజు ఉదయం టెస్టులు చేసుకోగా కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఎలాంటి తీవ్రమైన లక్షణాలు లేవు. వైరస్ సోకిందని తెలియగానే ఒంటరిగానే ఉంటున్నాను. ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొండి. ఇంటి వద్దనే ఉంటూ క్షేమంగా ఉండాలి. నా ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాను. ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దు అని ఇద్రీస్ ఎల్బా అన్నారు.
ఇదిలా ఉండగా, జేమ్స్‌బాండ్ హీరోయిన్, మోడల్ ఓగ్లా కురిలెంకో కూడా కరోనావైరస్ బారిన పడ్డారు. ఉక్రేయిన్‌కు చెందిన అందాల భామకు పరీక్షలు చేయించుకోగా నావెల్ కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ను ప్రాణాంతక వ్యాధిగా ప్రకటించిన తర్వాత అంతర్జాతీయంగా ఈ వ్యాధి బారిన పడిన తొలి సెలబ్రిటీగా ఓగ్లా కురిలెంకో పేరు బయటకు వచ్చింది.

గత వారం టామ్ హంక్స్, రీటా విల్సన్ దంపతులు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. సోమవారం ఆమె ట్రీట్‌మెట్ తర్వాత తమ నివాసానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం రీటా విల్సన్ ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉందని టామ్ హంక్స్ తెలిపారు.


Click it and Unblock the Notifications











