హాలివుడ్ హాలిడే హంగామా
ప్రపంచంలోనే అతి పెద్ద సినీపరిశ్రమ హాలీవుడ్. కోట్ల రూపాయల వ్యయంతో సినిమాలు నిర్మించాలన్నా, రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాలన్నా హాలీవుడ్ కే చెల్లింది. తాజాగా ఇప్పుడు హాలిడే సీజన్ కావడంతో సినిమాలు వెళ్లువలా విడుదలవుతున్నాయి. ఇటీవలే విడుదలయిన మైఖేల్ జాక్సన్ చివరి చిత్రం 'దిస్ ఈజ్ ఇట్' ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకొని రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టగా, తాజా విడుదలయి, ఈ వారం ట్రేడ్ రిపోర్ట్ లో అగ్రస్థానం లో నిలబడిన 'ఎ క్రిస్ట్ మస్ కరోల్' మరో సారి బాక్సాఫీసును షేక్ చేసింది. తొలి వారంలో 31 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ది పోలార్ ఎక్స్ ప్రెస్, బీవూల్ఫ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆస్కార్ అవార్డు విజేత రాబర్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
కాగా హాలిడేస్ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని 'న్యూ మూన్', '2012', 'అవతార్', 'షెర్లాక్ హాల్మస్' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇందులో 'న్యూ మూన్' సినిమా దయ్యాల కథను ఇతివృత్తంగా తీసుకొని తీయగా, '2012' సినిమా 2012వ సంవత్సరం డిసెంబరు 21న సంభవించబోయే ప్రళయాన్ని మూలకథగా తీసుకొని నిర్మించారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో కావలసినంత ప్రచారం ఈ సినిమాకు లభించింది. 2012లో ప్రళయం సంభవించబోతోందని పలువురు హెచ్చరిస్తుండటం, ఇదే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమా తీయడంతో సాధారణంగానే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా తీసిన ఈ సినిమా ట్రెయిలర్లు ఇప్పటికే విడుదలయ్యి ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచుతోంది. ఈ నెల 13వ తేదీన ఈ '2012' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈ సీజన్ లో రాబోతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'అవతార్'. టైటానిక్ సినిమాకు దర్శకత్వం వహించిన జేమ్స్ క్యామరాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలే వున్నాయి. 3-డి యానిమేషన్ పరిజ్ఞానంతో రూపొందిన ఈ సినిమా కై ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ సోషియో ఫాంటసీ తరహా చిత్రాలు కాగా 'షెర్లాక్ హాల్మస్' ఓ డిటెక్టివ్ కథతో రూపొందించిన సినిమా. ఈ సినిమా పై కూడా మంచి అంచనాలే వున్నాయి. ఇన్ని సినిమాల మధ్య హాలీవుడ్ హాలిడే సీజన్ ఎన్ని రికార్డులను సృష్టించనుందో, ఎన్ని కోట్లను వరదలా పారించనుందో తెలుసుకోవాలంటే ఇంకొన్నాళ్లు వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











