twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శభాష్: నట దర్శక,నిర్మాతకి నివాళికై ఏర్పాట్లు

    By Srikanya
    |

    ముంబై: 'గాంధీ' వంటి ప్రఖ్యాత చిత్రాన్ని ప్రపంచానికి అందించిన దివంగత దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బరోకు ఘనమైన నివాళి అర్పించేందుకు అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఇఫి) ఏర్పాట్లు చేస్తోంది. రిచర్డ్‌ ఈ ఏడాది ఆగస్టు 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నెల 20 నుంచి 30 వరకు గోవా వేదికగా జరగనున్న చలనచిత్రోత్సవంలో ఆయన గురించి నేటితరం వారికి తెలిసేలా, ఆయన గొప్పతనాన్ని వివరించేలా ఆడియో విజువల్స్‌ సిద్ధం చేస్తున్నారు. వేడుకల ప్రారంభోత్సవానికి ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు.

    తన అహింసా సిద్ధాంతాలతో ఆంగ్లేయ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన మహాత్మా గాంధీని తన చిత్రం ద్వారా మరొకసారి ప్రపంచ ప్రజల ముందు నిలబెట్టిన నటుడు, నిర్మాత, దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బరో. భారతీయుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. గాంధీని తలచుకున్న ప్రతిసారీ అటెన్‌బరో కూడా మదిలో మెదలుతారంటే అతిశయోక్తి కాదు. అటెన్‌బరో పూర్తిపేరు రిచర్డ్‌ శామ్యూల్‌ అటెన్‌బరో. అటెన్‌బరో 1923 ఆగస్టు 29వ తేదీన కేంబ్రిడ్జిలో జన్మించారు.

    ఆయన తండ్రి ఫ్రెడెరిక్‌ అటెన్‌బరో ఎమ్మాన్యుయేల్‌ కాలేజ్‌లో అకడమిక్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసేవారు. తల్లి మేరీ అటెన్‌బరో మ్యారేజ్‌ గైడెన్స్‌ కౌన్సెల్‌ అనే సంస్థ స్థాపక సభ్యురాలు. రిచర్డ్‌ అటెన్‌బరో రెండవ ప్రపంచ యుద్ధంలో రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో పని చేశారు. అటెన్‌బరో నటనా జీవితం రంగస్థలం నుంచి ఆరంభమైంది. లీసెస్టర్స్‌ లిటిల్‌ థియేటర్‌, డోవర్‌ స్ట్రీట్‌ మొదలైనచోట్ల నాటకాలు వేసిన తరువాత 'రాడా' అనే సంస్థలో చేరారు. తుది శ్వాస వరకూ ఆ సంస్థకు పాట్రన్‌గా కొనసాగారు.

    నట జీవితం తొలినాళ్లలో 'వెస్ట్‌ ఎండ్‌ ప్రొడక్షన్స్‌' వారు నిర్వహించిన ఆగథా క్రిస్టీ రచన 'ది మౌస్‌ట్రాప్‌'లో నటించారు. అటెన్‌బరో, ఆయన సతీమణి ఇద్దరూ ఈ ప్రదర్శనల్లో తొలి నుంచి పాల్గొన్న నటబృందంలో ముఖ్యులు. బ్రిటిష్‌ చిత్రాల్లో 30 ఏళ్లపాటు ఆయన నటించారు. 1950లో విడుదలైన జాన్‌ రారు బౌల్టింగ్‌ చిత్రాలు 'ప్రైవేట్‌ ప్రోగ్రెస్‌' (1956), 'ఐ యామ్‌ ఆల్‌ రైట్‌ జాక్‌' (1959) మొదలైన వాటిలో నటించారు. 'గన్స్‌ ఎట్‌ బటాసి' (1964) చిత్రంలో రెజిమెంటల్‌ సార్జెంట్‌ మేజర్‌ పాత్రకుగాను ఆయనకు బి.ఎ.ఎఫ్‌.టి.ఎ (బాఫ్టా) ఉత్తమనటుడి పురస్కారాన్ని ప్రదానం చేసింది.

    1969లో విడుదలైన 'ది గ్రేట్‌ ఎస్కేప్‌'లో ఆర్‌ఎఎఫ్‌ స్క్వాడ్రన్‌ లీడర్‌ రోగర్‌ బార్ట్‌లెట్‌గా నటించారు. ఈ చిత్రం రోగర్‌ బుషెల్‌ నిజజీవితంలోని సంఘటనల ఆధారంగా తీశారు. 1971లో విడుదలైన '10 రిల్లింగ్టన్‌ ప్లేస్‌' చిత్రంలో జాన్‌ క్రిస్టీ అనే సీరియల్‌ హంతకుడిగా ఆయన నటనకు విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందాయి. పలు చిత్రాల్లో నటించిన అటెన్‌బరో 'జురాసిక్‌ పార్క్‌' (1993) చిత్రంలో పార్క్‌ స్థాపకుడి పాత్రను పోషించారు. 1950 దశకం చివరలో అటెన్‌బరో తన స్వంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. 1969లో 'ఓహ్ !వాట్‌ ఎ లవ్‌లీ వార్‌' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. సంగీత ప్రాధాన్య చిత్రంగా ఇది గుర్తింపు పొందింది. ఆ తరువాత నుంచి అటెన్‌బరో ఎక్కువగా చిత్ర నిర్మాణం, దర్శకత్వంపై దృష్టి సారించారు.

    మహాత్ముడి జీవితాన్ని తర్వాతి తరాలకు కళ్లకు కట్టినట్లు చూపడానికి అటెన్‌బరో చేసిన కృషి మాటలలో వర్ణించలేనిది. గాంధీ గురించిన చిత్రం తీయాలనుకున్నప్పుడు అనేక ఆటంకాలు... ఆంగ్లేయుడై ఉండి, ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి గురించిన చిత్రం తీస్తున్నందుకు విమర్శలు ఎదుర్కొన్నాడాయన. అయితే లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు. గాంధీ గురించిన సమగ్ర సమాచారాన్ని సేకరించారు. గాంధీపై వచ్చిన అనేకానేక గ్రంథాలను పఠించారు. ఆనాటి పత్రికల్లో వచ్చిన వార్తావిశేషాలు, సంఘటనలు ... ప్రతి విశేషాన్ని, విషయాన్ని పదిలపరచుకున్నారు.

    IFFI Tributes to Richard Attenborough

    'గాంధీ' చిత్రం ప్రపంచ ప్రేక్షకుల కితాబులు అందుకుంది. ఈ చిత్రానికి ఎనిమిది ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఆ చిత్రంలో గాంధీ పాత్ర పోషించిన బెన్ కింగ్‌స్లే 'నా జీవితాంతం గుర్తుంచుకోదగ్గ చిత్రం ఇది. అటెన్‌బరోని మర్చిపోలేను' అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే పుస్తకరూపంలో కూడా దొరుకుతోంది.

    'గాంధీ' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో 'చాప్లిన్' ఒకటి. చార్లీ చాప్లిన్ జీవితం ఆధారంగా ఆయన ఈ చిత్రం రూపొందించారు. దర్శక, నిర్మాతగా కొనసాగుతున్న సమయంలోనే 'జురాసిక్ పార్క్'లో చేసిన జాన్ హమ్మొండ్ పాత్రకు అభినందనలు అందుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం 'పకూన్'. 2002లో ఇది విడుదలైంది. దర్శక, నిర్మాతగా 'క్లోజింగ్ ది రింగ్' చివరి చిత్రం. 2007లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత అటెన్‌బరో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనారోగ్యం కారణంగా కొంత కాలంగా ఆయన ఓ నర్సింగ్ హోమ్‌లో ఉంటూ, అక్కడే తుది శ్వాస విడిచారు.

    English summary
    International Film Federation of India is getting ready to pay floral tributes to great Richard Attenborough, who passed away on Aug, 24th. Organisers will be screening an audio showcasing the greatness of Attenborough during the IFFI festival in Goa from November, 20th-30th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X