twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అస్కార్ 2015 :ఉత్తమ చిత్రం బరిలో ఉన్న చిత్రాలు..కథలు

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్: ఈ రోజు లాస్‌ఏంజిలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో 87వ ఆస్కార్‌ పురస్కారాల ప్రదానోత్సవం జరగుతోంది. ప్రపంచమంతా కళ్లప్పగించు కుని ఎదురుచూసే ఆస్కార్‌ అవార్డుల పండుగ రానే వచ్చింది. భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 5-30 గంటలకు లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ప్రారంభమయ్యింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ప్రపంచం మొత్తం ఎదురుచూసి, మాట్లాడుకుని, చర్చించుకునే స్దాయి ప్రత్యేకతను సంతరించుకున్న ఆస్కార్‌ అవార్డును అందుకోవాలన్నది చాలామంది నటీనటులకు, సాంకేతిక నిపుణులకు జీవిత కల. అయితే దానిని సాధించడమంటే మాటలు కాదు. ప్రపంచ నలుమూలల చిత్రాలన్నీ ఈ అవార్డుల కోసం పోటీపడతాయి.

    ఆస్కార్‌ వేడుక అంటేనే వైవిధ్యమైన చిత్రాలకు వేదిక. ఈ ఏడాదిలో అకాడెమీ ఉత్తమ చిత్ర పురస్కారం కోసం ఎనిమిది సినిమాలు పోటీ పడుతున్నాయి. వాటిలో జీవితకథ ఆధారంగా తీర్చిదిద్దినవి రెండు కాగా, యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించినవి రెండు. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలనే స్ఫూర్తినిచ్చేవి చిత్రాలు రెండైతే, మనుషుల అంతరంగాన్ని ఆవిష్కరించేవి రెండు. ఈసారి జాబితాలో ఏకంగా 12 ఏళ్ల పాటు చిత్రీకరించిన సినిమా కూడా ఉండడం విశేషం.

    ఈ సారి "బర్డ్‌మ్యాన్‌, ది గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్‌' చిత్రాలు ఎక్కువ శాతం విభాగాల్లో నామినేషన్లను దక్కించుకున్నాయి. ఇంకా "బాయ్‌హుడ్‌, అమెరికన్‌ స్నైపర్‌, సెల్మా, ది ఇమిటేషన్‌ గేమ్‌, ది థియరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌, విష్‌లాష్‌' చిత్రాలు ఆఖరి పోరాటంలో నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. వీటిలో ఏ చిత్రాలు అవార్డులను దక్కించుకుంటాయన్న అంశం మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.

    ఆ సినిమాలేంటి.. వాటికథేంటో ఓసారి చూద్దాం.

    స్లైడ్ షోలో... ఆ సినిమాలు వివరాలు

    'బాయ్‌హుడ్‌'....జీవిత దశలు

    'బాయ్‌హుడ్‌'....జీవిత దశలు

    సాధారణంగా ఓ సినిమాను ఏడాదో, రెండేళ్లో తీస్తారు. కానీ 12 ఏళ్లు తీస్తారా? అలా తీసిన సినిమానే 'బాయ్‌హుడ్‌'. నాలుగేళ్ల వయసు నుంచి పదహారేళ్ల ప్రాయం వరకు ఓ వ్యక్తి జీవితాన్ని దశల వారీగా తీసిన సినిమా ఇది. దర్శకుడు రిచర్డ్‌ లింక్‌లేటర్‌ మలచిన ఈ సినిమాలో ఎల్లార్‌ కోల్ట్రేన్‌ ప్రధాన పాత్రధారి. ఓ మనిషిపై తల్లిదండ్రుల, సమాజం చూపించే ప్రభావాలను విశ్లేషించే ప్రయోగాత్మక చిత్రం ఇది. ఉత్తమ సహాయ నటుడు, సహాయ నటి, ఉత్తమ చిత్రం, దర్శకుడు, ఫిల్మ్‌ ఎడిటింగ్‌, రచన (ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే)లాంటి ఆరు విభాగాల్లో పోటీలో ఉంది.

    'అమెరికన్‌ స్నైపర్‌'... లెజెండ్‌ జీవితం

    'అమెరికన్‌ స్నైపర్‌'... లెజెండ్‌ జీవితం

    ఓ అమెరికా యుద్ధ సైనికుడి జీవితాన్ని కళ్లకు కట్టిన చిత్రం 'అమెరికన్‌ స్నైపర్‌'. బ్రాడ్లీ కూపర్‌, సియన్నా మిల్లర్‌ ప్రధాన పాత్రధారులు. 'అమెరికన్‌ స్నైపర్‌' నవల ఆధారంగా దర్శకుడు క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌ తెరకెక్కించాడు. ఇరాక్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ సైనికుడి మనోవ్యథ, అతని కుటుంబ సభ్యుల పరిస్థితులను సినిమాలో పొందుపరిచారు. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఫిల్మ్‌ ఎడిటింగ్‌, సౌండ్‌ ఎడిటింగ్‌, మిక్సింగ్‌, రచన (అడాప్టడ్‌ స్క్రీన్‌ప్లే) విభాగాల్లో ఇది పోటీ పడుతోంది.

    'బర్డ్‌మ్యాన్‌'

    'బర్డ్‌మ్యాన్‌'

    ఆ హీరో ఎక్కడికెళ్లినా 'బర్డ్‌మ్యాన్‌.. బర్డ్‌మ్యాన్‌' అని పిలుస్తుంటారు. అంతగా ఆ పాత్రతో పేరు సంపాదించుకున్నాడాయన. అలాంటి వాడు నటన వదిలేద్దామనుకున్నాడు. దర్శకత్వం వైపు రావడానికి ప్రయత్నాలు చేస్తాడు. మరి అతడి ప్రయత్నం ఫలించిందా? ఈ కథతో అల్లుకున్న సినిమా 'బర్డ్‌మ్యాన్‌'. మైఖేల్‌ కీటన్‌ ముఖ్య పాత్రధారి. అలెజాండ్రో జి.ఇనారిట్టు దర్శకత్వం వహించారు. ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ దర్శకుడు, నటి, సహాయ నటుడు, సహాయ నటి, సినిమాటోగ్రఫీ, సౌండ్‌ ఎడిటింగ్‌, మిక్సింగ్‌, రచన (ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే) విభాగాల్లో రేసులో ఉందీ చిత్రం.

    'సెల్మా'....హక్కుల సాధనకై

    'సెల్మా'....హక్కుల సాధనకై

    ఆఫ్రికన్‌ అమెరికన్ల హక్కుల సాధన కోసం పోరాడిన ధీరుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌. ఈ ప్రయత్నంలో భాగంగా సెల్మా నుంచి మాంటగోమరీ వరకు మార్టిన్‌ నిర్వహించిన ర్యాలీకి ప్రత్యేక స్థానముంది. ఆ ర్యాలీ.. తదనంతర పరిస్థితులకు చలనచిత్ర రూపం 'సెల్మా'. ఒయ్‌లేవో ప్రధాన పాత్రధారి. 1964 నాటి పరిస్థితులను, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ విశిష్టతను దర్శకుడు అవా డువెర్నాయ్‌ చక్కగా ఆవిష్కరించాడు. ఆస్కార్‌ రేసులో ఈ సినిమా ఉత్తమ చిత్రంతోపాటు సంగీతం (ఒరిజినల్‌ సాంగ్‌) విభాగంలో పోటీలో ఉంది.

    'ది ఇమిటేషన్‌ గేమ్‌'....యుద్ధ భూమిలో ఉపాధ్యాయులు

    'ది ఇమిటేషన్‌ గేమ్‌'....యుద్ధ భూమిలో ఉపాధ్యాయులు

    పాఠశాలల్లో గణితశాస్త్రం బోధించే నలుగురు ఉపాధ్యాయులను బ్రిటిష్‌ ప్రభుత్వం ఓ కూటమిగా ఏర్పాటు చేసింది. లెక్కల పుస్తకం పట్టుకొని పాఠాలు చెప్పాల్సిన వాళ్లు యుద్ధ భూమిలోకి దిగాల్సి వస్తుంది. ఎందుకు? మరి విజయం సాధించారా? అనే ప్రశ్నలకు సమాధానం 'ది ఇమిటేషన్‌ గేమ్‌'. బెనెడిక్ట్‌ కంబర్‌బ్యాచ్‌, కెయిరా నైటింగ్‌లే ముఖ్య పాత్రధారులు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌-జర్మనీల మధ్య పరిస్థితులను తెలిపేలా చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు మోర్టన్‌ టైల్డమ్‌. ఇది ఉత్తమ నటుడు, సహాయ నటుడు, ఉత్తమ చిత్రం, దర్శకుడు, ఎడిటింగ్‌, సంగీతం (ఒరిజినల్‌ స్కోర్‌), ప్రొడక్షన్‌ డిజైన్‌, రచన (అడాప్టడ్‌ స్క్రీన్‌ప్లే) లాంటి ఎనిమిది విభాగాల్లో ఆస్కార్‌ రేసులో ఉంది.

    'ది థియరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌'...మొక్కవోని దీక్ష

    'ది థియరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌'...మొక్కవోని దీక్ష

    అరుదైన వ్యాధితో శరీరం చచ్చుబడిపోయి చక్రాల కుర్చీకే పరిమితమైనా సైన్స్‌ సిద్ధాంతాలతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ జీవితం ఆధారంగా తీసిన సినిమా 'ది థియరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌'. ఆయన మాజీ భార్య రాసిన 'ట్రావెలింగ్‌ టు ఇన్ఫినిటీ - మై లైఫ్‌ విత్‌ స్టీఫెన్‌' నవల ఆధారంగా దర్శకుడు జేమ్స్‌ మార్ష్‌ తీశారు. ఎడ్డి రెడ్‌మేన్‌, ఫెలిసిటీ జోన్స్‌ కీలక పాత్రలు పోషించారు. ఉత్తమ చిత్రంతోపాటు, నటుడు, నటి, సంగీతం (ఒరిజినల్‌ స్కోర్‌), రచన (అడాప్టడ్‌ స్క్రీన్‌ప్లే) విభాగాల్లో పోటీపడుతోంది.

    'విప్‌లాష్‌'...కుర్రాళ్ల కలలు.. ఆంక్షలు

    'విప్‌లాష్‌'...కుర్రాళ్ల కలలు.. ఆంక్షలు

    భయపెడితేనే విద్యార్థుల్లో ప్రగతి ఉంటుందని నమ్మే శిక్షకుడు... ప్రపంచ ప్రఖ్యాత జాజ్‌ డ్రమ్మర్‌ కావాలని కలలుకనే కుర్రాడు... వీరిద్దరి కథే 'విప్‌లాష్‌'. మైల్స్‌ టెల్లర్‌, జె.కె.సిమ్మన్స్‌ ముఖ్య పాత్రధారులు. గురుశిష్య సంబంధాలను విశ్లేషించే సినిమాగా దీన్ని దర్శకుడు డామియెన్‌ చాజెల్లె రూపొందించాడు. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ సహాయనటుడు, ఫిల్మ్‌ ఎడిటింగ్‌, సౌండ్‌ మిక్సింగ్‌, రచన (అడాప్టడ్‌ స్క్రీన్‌ప్లే) విభాగాల్లో అకాడెమీ పురస్కారం కోసం పోటీ పడుతోంది.

    'ది గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్‌'...స్పూర్తి చిత్రం

    'ది గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్‌'...స్పూర్తి చిత్రం

    ఓ హోటల్‌లో లాబీ బాయ్‌గా పనిలో చేరిన వ్యక్తి ఆ హోటల్‌కే యజమానిగా మారాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆ వ్యక్తి గురించి మీరూ తెలుసుకోవాలంటే 'ది గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్‌' చూడాల్సిందే. రాల్ఫ్‌ఫియన్స్‌ ప్రధాన పాత్రధారి. స్టీఫెన్‌ జ్వేగ్‌ రచించిన కొన్ని నవలలను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వెస్‌ ఆండర్సన్‌. ఉత్తమ చిత్రంతోపాటు సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌, దర్శకత్వం, ఎడిటింగ్‌, మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్త్టెలింగ్‌, సంగీతం (ఒరిజినల్‌ స్కోర్‌), ప్రొడక్షన్‌ డిజైన్‌, రచన (ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే) వంటి మొత్తం తొమ్మిది విభాగాల్లో పోటీలో ఉంది.

    English summary
    The ceremony is getting underway shortly at the Dolby Theatre. After a competitive awards season, the Oscars ceremony is finally here. In the best picture category, eight films are vying for the top honor: American Sniper, Birdman, Boyhood, The Grand Budapest Hotel, The Imitation Game, Selma, The Theory of Everything and Whiplash.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X