twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ 2017 : ఏ సినిమాకు బెస్ట్ పిక్చర్ అవార్డ్ వస్తుంది, మిగతా విభాగాల్లో ఎవరు గెలుస్తారు?

    ‘ల లా ల్యాండ్‌’ చిత్రానికే ఈ సంవత్సరం ఆస్కార్ వరించేటట్లు కనపడుతోంది.

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్ : ప్రపంచ సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసే ఆస్కార్‌ అవార్డ్ ల సమయం ఆసన్నమైంది. 89వ అకాడమీ అవార్డుల పండక్కి హాలీవుడ్‌ సిద్ధమవుతోంది. ఆమెరికాలోని కాలిఫోర్నియా డాల్బీ థియేటర్‌ ముస్తాభవుతోంది. ఫిబ్రవరి 26న ఆస్కార్‌ వేడుకలు జరగనున్నాయి. మరో నెల రోజుల సమయముంది. ఈలోగా వివిధ విభాగాలకు నామినేట్‌ అయ్యే చిత్రాల జాబితా వచ్చేసింది.

    ఆస్కార్‌ అవార్డ్‌ కోరుకోని నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలు ఉండవు. వాళ్లకు ఇదో అరుదైన గౌరవం. మరి ఈ ఏడాది ఆ గౌరవాన్ని దక్కించుకునే 'ఆస్కార్‌'మెవరికో...అనేదాని కోసం ప్రపంచంలోని సినీ ప్రేమికులంతా ఎదురుచూస్తూండంటంలో ఆశ్చర్యం లేదు. ఈ నేపధ్యంలో ఆస్కార్ బరిలో నిలిచిన తొమ్మిది చిత్రాల ప్రత్యేకతలు ఏమిటి...దేనికి బెస్ట్ పిక్చర్ వచ్చే అవకాసం ఉందో పరిశీలిద్దాం.

    గతేడాది తెరపైకి వచ్చి...ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన అనేక చిత్రాలు ఆస్కార్‌ కోసం పోటీ పడుతున్నాయి. 'ల లా ల్యాండ్‌ ' అనే చిత్రం అత్యధికంగా 14 విభాగాల్లో నామినేట్‌ అవడం ఈ ఏడాది ప్రత్యేకత. గతంలో 'ఆల్‌ అబౌట్‌ ఈవ్‌', 'టైటానిక్‌' సినిమాలకు మాత్రమే ఇంత భారీగా నామేనేషన్స్‌ దక్కాయి. 'ద మూన్‌ లైట్‌', 'అరైవల్‌' సినిమాలు ఎనిమిదేసి క్యాటగిరీల్లో పోటీ పడుతున్నాయి.

    ముఖ్యంగా ఈ ఏడాది ఉత్తమ చిత్రం విభాగంలో విజేతగా నిలవడానికి తొమ్మిది చిత్రాలు రంగంలో ఉన్నాయి. వాటిలో నిజ జీవిత కథలకే అగ్రతాంబూలం దక్కడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఓ భారతీయ కుర్రాడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఓ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలవడం విశేషం.

     రేసులో ముందుంది

    రేసులో ముందుంది

    ఉత్తమ చిత్రం విభాగంలో 9 సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే ‘ల లా ల్యాండ్‌' రేసులో ముందుంది. సంగీత ప్రధానంగా సాగే చిత్రమిది. నటి కావాలని ఊవిళ్లూరే ఓ యువతి...లాస్‌ఏంజిల్స్‌ చేరుకుంటుంది. సినిమాల్లో చేరే ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. కోరుకోగానే సినిమా అవకాశం వస్తుందా...? సినిమా మీద ప్రేమతో షూటింగ్‌ లు జరిగే ఆ ప్రాంతాన్ని కూడా అభిమానిస్తుంది. ఈ క్రమంలో ఓ యువకుడితో పరిచయం, ప్రేమ మొదలవుతాయి. నటి కావాలన్న లక్ష్యాన్ని యువతి ఎలా చేరిందన్నది ఆసక్తికరం. ‘ల లా ల్యాండ్‌' ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, నటుడు, దర్శకుడు ఇలా ఈ ఏడాది అత్యధిక నామినేషన్స్‌ అందుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు మరో విభాగంలోనూ ఈ చిత్రానికి ఆస్కార్‌ రావొచ్చనే అంచనాలున్నాయి.

     అతి తక్కువ బడ్జెట్ తో ...

    అతి తక్కువ బడ్జెట్ తో ...

    ఈ పోటీలో ...ఐదు మిలియన్‌ డాలర్ల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మూన్‌లైట్‌' కూడా ముందు వరసలో ఉంది. ఈ చిత్తరం 22 మిలియన్‌ డాలర్లు వసూలు చేయడమే కాదు.. 8 ఆస్కార్‌ నామినేషన్లు సాధించి సత్తా చాటింది. ఇప్పటికే ఉత్తమ చిత్రంగా గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం అందుకుంది. ‘ఇన్‌ మూన్‌లైట్‌ బ్లాక్‌ బాయ్స్‌ లుక్‌ బ్లూ' అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని బారీ జెన్‌కిన్స్‌ తెరకెక్కించారు. ఓ నల్లజాతి కుర్రాడికి బాల్యంలో, టీనేజ్‌లో, యవ్వనంలో సమాజం నుంచి ఎదురైన అనుభవాలను ఈ చిత్రం కళ్లకు కట్టింది. ట్రెవెంట్‌ రోడ్స్‌ ప్రధాన పాత్రలో నటించాడు.

     ఇదో సైన్స్ ఫిక్షన్

    ఇదో సైన్స్ ఫిక్షన్

    ఈ కేటగిరిలో ... సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంగా తెరకెక్కిన ‘అరైవల్‌' 8 ఆస్కార్‌ నామినేషన్లు సాధించింది. 47 మిలియన్‌ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం 195 మిలియన్‌ డాలర్లు వసూళ్లతో చక్కటి విజయం సొంతం చేసుకుంది. 1998లో టెడ్‌ చియాంగ్‌ రాసిన ‘స్టోరీ ఆఫ్‌ యువర్‌ లైఫ్‌' నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. డెనిస్‌ విలెన్యూవ్‌ దర్శకుడిగా వ్యవహరించిన ఈ చిత్రంలో ఎమీ అడమ్స్‌, జెరెమీ రెన్నర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

     నిజ జీవిత గాధ

    నిజ జీవిత గాధ

    ఇదో వాస్తవక గాధ. చిన్నతనంలో తప్పిపోయి విచిత్ర పరిస్థితుల్లో ఆస్ట్రేలియా చేరుకున్న ఓ భారతీయ కుర్రాడు తన సొంతూరిని, కన్నవాళ్లను, సొంతభాషను మర్చిపోతాడు. పాతికేళ్ల తర్వాత అతడు తన ఇంటికి చేరుకోడానికి పడిన తపనను ఆవిష్కరించిన చిత్రం ‘లయన్‌'. సరూ బ్రియర్లీ అనే భారతీయుడి నిజజీవిత కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రధాన పాత్రలో భారతీయ బ్రిటిష్‌ నటుడు దేవ్‌ పటేల్‌ నటించారు. ఈ చిత్రానికి 6 ఆస్కార్‌ నామినేషన్లు దక్కాయి. గర్త్‌ డేవిస్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్‌ నటి నికోల్‌ కిడ్‌మన్‌తో పాటు కొన్ని కీలక పాత్రల్లో భారతీయ నటులు నటించారు.

     అంతరిక్షంలో...

    అంతరిక్షంలో...

    అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాలో గణిత శాస్త్రజ్ఞులుగా పనిచేసే ముగ్గురు ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళల జీవితకథగా ఈ చిత్రం తెరకెక్కింది. 25 మిలియన్‌ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం 163 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. 3 ఆస్కార్‌ నామినేషన్లు సాధించింది. థియోడోర్‌ మెల్ఫి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తారాజి పి.హెన్సన్‌, ఆక్టోవియా స్పెన్సర్‌, జానెల్‌ మోనీ ప్రధాన పాత్రల్లో నటించారు.

     నాటకం ఆధారంగా

    నాటకం ఆధారంగా

    ప్రపంచ సాహిత్య రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్‌ పురస్కారాన్ని గెలుచుకున్న ‘ఫెన్సెస్‌' నాటకం ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రం తెరకెక్కింది. ఆస్కార్‌ బరిలో 4 నామినేషన్లు అందుకుంది. ఆఫ్రికన్‌ అమెరికన్‌ జాతీయుడైన ఓ వ్యక్తి కుటుంబానికి 1950లో అమెరికాలో ఎదురైన అనుభవాలను ఈ చిత్రం ఆవిష్కరించింది. ‘ఫెన్సెస్‌' నాటక రచయిత ఆగస్ట్‌ విల్సనే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే సమకూర్చాడు. డెంజెల్‌ వాషింగ్టన్‌ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించారు.

     ఓ టీనేజ్ కుర్రాడి కథ

    ఓ టీనేజ్ కుర్రాడి కథ

    ఈ సినిమాపైనా మంచి అంచనాలే ఉన్నాయి. కేవలం 8.5 మిలియన్‌ డాలర్లతో తెరకెక్కి 55 మిలియన్‌ డాలర్ల వసూళ్లతో ఆశ్చర్యపరిచిన చిత్రం ‘మాంచెస్టర్‌ బై ది సీ'. సన్‌డ్యాన్స్‌ చిత్రోత్సవంలో ప్రదర్శితమై విమర్శకులు ప్రశంసలూ అందుకుంది. ఆస్కార్‌ బరిలోనూ 6 నామినేషన్లతో సత్తా చాటుతోంది. తండ్రిని కోల్పోయి బాబాయి చెంతకు చేరిన ఓ టీనేజీ కుర్రాడి భావోద్వేగభరిత ప్రయాణంగా ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను కదిలించింది. కెన్నెత్‌ లొనెర్గన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో కేసీ అఫ్లెక్‌, మిషెల్‌ విలియమ్స్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కేసీ అఫ్లెక్‌ ఈ చిత్రంతో ఉత్తమ నటుడిగా గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం అందుకున్నాడు.

     డాక్టర్ ఎక్సపీరియన్స్ లు

    డాక్టర్ ఎక్సపీరియన్స్ లు

    రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యంలో పనిచేసిన ఓ డాక్టర్ అనుభవాలకు తెరరూపంగా ‘హాక్‌సా రిడ్జ్‌' తెరకెక్కింది. 40 మిలియన్‌ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం 164 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. 6 ఆస్కార్‌ నామినేషన్లు సాధించింది. మెల్‌ గిబ్సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆండ్రూ గార్‌ఫీల్డ్‌, శామ్‌ వర్తింగ్టన్‌, విన్స్‌ వాగ్న్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

     ఫ్యామిలీ కోసం దొంగతనం

    ఫ్యామిలీ కోసం దొంగతనం

    కుటుంబాన్ని పోషించుకోవడానికి బ్యాంకు దొంగలుగా మారిన ఇద్దరు అన్నదమ్ముల కథతో క్రైమ్‌థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘హెల్‌ ఆర్‌ హై వాటర్‌'. 4 ఆస్కార్‌ నామినేషన్లు సాధించింది. కేన్స్‌ చిత్రోత్సవంలో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. ది అమెరికన్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన 2016లో వచ్చిన పది ఉత్తమ చిత్రాల జాబితాలో దీనికి చోటు దక్కింది. డేవిడ్‌ మెకంజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిడ్నీ కెమ్మెల్‌, పీటర్‌ బెర్గ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

     భారతీయ సంతతి నటుడు..

    భారతీయ సంతతి నటుడు..

    ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' చిత్రంతో మనకు పరిచయమైన నటుడు దేవ్‌ పటేల్‌. భారతీయ సంతతికి చెందిన ఈ బ్రిటీష్‌ నటుడు ఈ సారి ఆస్కార్‌ పోటీలో ఉన్నాడు. అతను నటించిన ‘లయన్‌' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ లో నటించిన దేవ్‌ పటేల్‌ ఉత్తమ సహాయ నటుడు విభాగంలో పోటీ పడుతున్నాడు. ఈసారి మన దేశం నుంచి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఒక్క సినిమా ఎంపిక కాలేదు.

     ఉత్తమ నటి...

    ఉత్తమ నటి...

    ఉత్తమ నటి బరిలో ఐదురుగు భామలు ఉన్నారు. వీళ్లలో నటాలియా పోర్ట్‌మన్‌ , ఇసాబెల్లె హుపర్ట్‌ ఫేవరేట్స్‌ గా ఉన్నారు. ‘ ల లా ల్యాండ్‌' చిత్రంలో నటించిన నాయిక ఎమ్మా స్టోన్‌ కూడా వీళ్ల తో ఆస్కార్‌ కోసం పరుగెడుతోంది. మిగతా విభాగాల్లో స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తున్నా...ఉత్తమ హీరోయిన్ ఎవరనేది తేల్చడం కష్టంగానే కనిపిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు దివంగత జాన్‌ ఎఫ్‌ కెన్నడీ భార్య జాక్వెలిన్‌ కెన్నెడీ జీవిత కథతో తెరకెక్కిన సినిమా ‘జాకీ' . ఈ చిత్రంలో జాక్వెలిన్‌ పాత్రలో నటించింది నటాలియా పోర్ట్‌ మన్‌. శక్తివంతమైన దేశానికి మొదటి మహిళగా, అమెరికా అధ్యక్షుడి భార్యగా జాక్వెలిన్‌ పోషించిన అద్భుత పాత్రను తన నటనలో చూపించింది నటాలియా. భర్త హత్యకు గురైనప్పుడు జాక్వెలిన్‌ భావోద్వేగాలు ఎలా ఉన్నాయో తన అభినయంలో పలికించింది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘ఎలె' లో ప్రధాన పాత్ర పోషించిన ఎలిజబెత్‌ కూడా తన నటనతో ఆస్కార్‌ కు గట్టిపోటీనిస్తోంది.

     ఐదుగురు మధ్య పోటీ

    ఐదుగురు మధ్య పోటీ

    ఆస్కార్‌ దక్కించుకునే హీరొ ఎవరనేది మొత్తం పురస్కారాల్లో ఆసక్తికర ఘట్టం. ఈ ఏడాది ఐదుగురు హీరోలు అవార్డు బరిలో ఉన్నారు. డాంజిల్‌ వాషింగ్టన్‌ (‘ఫెన్సెస్‌'), విగో మార్టెన్‌సేన్‌ (‘కెప్టెన్‌ ఫెంటాస్టిక్‌'), ఆండ్రూ గార్‌ఫీల్డ్‌ (‘హాక్‌సా రిడ్జ్‌'), కాసే అఫ్లిక్‌ (‘మాంఛెస్టర్‌ బై ద సీ'), ర్యాన్‌ గాస్లింగ్‌ (‘ల లా ల్యాండ్‌') బెస్ట్‌ హీరో అవ్వాలని పోటీ పడుతున్నారు. హాలీవుడ్‌ వార్తా సంస్థల సర్వేల ప్రకారం ‘మాంఛెస్టర్‌ బై ద సీ' చిత్రంలో నటించిన కాసే అఫ్లిక్‌ కు ఆస్కార్‌ దక్కే అవకాశం ఉంది. ఈ చిత్రంలో తండ్రిని కోల్పోయిన మేనల్లుడిని సంరక్షించే మామయ్య పాత్రలో కాసే అఫ్లిక్‌ నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

     బెస్ట్ డైరక్టర్

    బెస్ట్ డైరక్టర్

    ‘ల లా ల్యాండ్‌' చిత్రాన్ని అందమైన పాటలా మలిచిన దర్శకుడు డామియెన్‌ ఛాజెలె ఉత్తమ దర్శకుడు నామినేషన్స్‌ లో ఫేవరేట్‌ గా ఉన్నారు. నామినేట్‌ అయిన మరో ఆరుగురు దర్శకుల్లో ఛాజెలె కే ఆస్కార్‌ దక్కే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ద మూన్‌ లైట్‌' చిత్ర దర్శకుడు బ్యారీ జెంకిన్స్‌ ఛాజెలె తర్వాత స్థానంలో నిలుస్తాడనే అంచనాలున్నాయి.

    English summary
    Will La La Land dance its way to the Best Picture Oscar? Or could some Hidden Figures step in its way? Is the sun going to shine on Moonlight? Or will Manchester by the Sea ride a wave to Oscar glory? And could Lion leap over Fences to reign as the king of Hollywood’s biggest night?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X