ఈ దఫా యువతను లక్ష్యం చేసుకుంటున్నారు..!!
బుల్లితెరపై కార్టూన్ రూపంలో వచ్చినా, వెండి తెరపై కనిపించినా దారం సాయంతో ఎంత ఎత్తునుండయినా దూకేసి సాలీడులా పాకుతూవెళ్లి సాహసాలు చేసే స్పైడర్ మ్యాన్ కు వున్న ఆదరణ ప్రత్యేకమయినది. ఇప్పటి వరకూ మూడు స్పైడర్ మ్యాన్ సినిమాలు రాగా అన్నీ రికార్డు స్థాయి విజయాలను నమోదుచేసుకున్నవే కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నాలుగవ సినిమా స్పైడర్ మ్యాన్-4 రూపొందుతున్న సంగతి తెలిసిందే. 2011 వేసవిలో ఈ సినిమాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రూపకల్పణ ఆగిపోయింది. ఈ సినిమా లో కథానాయకుడిగా నటిస్తున్న టోబే మ్యాగ్యూర్ మరియు దర్శకుడు శ్యామ్ రైమి ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం.
దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు లేవు. 2012 వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు సినిమా నిర్మాతలు సోనీ కార్పొరేషన్, కొలంబియా పిక్చర్స్ తెలియజేసారు. కథానాయుకుడు, దర్శకుడిని ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఈ సినిమా గత మూడు సినిమాలకు కొనసాగింపు కాదని, ఈ సినిమా కథ సరికొత్త పంథాలో నడుస్తుందని వారు చెప్పారు. విశ్వసనీయ కథనం ప్రకారం ఈ సినిమా కథ హీరో స్టూడెంట్ గా వున్నప్పుడు జరుగుతుందని సమాచారం. ఈ కథ యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్నట్టు సమాచారం. గత చిత్రం స్పైడర్ మ్యాన్-3 సినిమా వసూళ్ల పరంగా బాగానే రాబట్టినా, సినిమా మీద విమర్శకులు పెదవివిరిచారు. దీంతో నిర్మాతలు ఈ దఫా యువతను టార్గెట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











