ఆస్కార్ 2025లో సత్తా చాటిన సుమంత్ రెడ్డి.. డ్యూన్ 2 టీమ్‌లో కీలకంగా తెలుగు కుర్రాడు!
ఆస్కార్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో డ్యూన్ పార్ట్ 2 (Dune Part 2) చిత్రం సత్తా చాటింది. పలు విభాగాల్లో నామినేట్ అయిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్‌లో ఉత్తమ అవార్డును అందుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను ఆలరించిన ఈ సినిమాలోని విజువల్ గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయి. అయితే అలాంటి విజువల్ ఎఫెక్ట్ పనితనంలో తెలుగు కుర్రాడు సుమంత్ రెడ్డి కూడా తన ప్రతిభను చాటుకొన్నాడు. డ్యూన్ 2 టీమ్‌లో కీలకంగా వ్యవహరించిన సుమంత్ రెడ్డి ఎడ్ల గురించిన వివరాల్లోకి వెళితే..
సుమంత్ రెడ్డి ఎడ్ల విషయానికి వస్తే.. కేసముద్రం మండలం అమీనాపురం గ్రామానికి చెందిన యువకుడు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సును పూర్తి చేశాడు. ఆ తర్వాత 2021 సంవత్సరంలో డ్యూన్ చిత్రం కోసం ముంబై కేంద్రంగా పనిచేసే డినెగ్ అనే సంస్థలో మోడలింగ్ టెక్నికల్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

డ్యూన్ పార్ట్ 2 ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించిన సమయంలో కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో టీమ్‌కు వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేశారు. ఆ సమయంలో అమీనాపురం గ్రామంలోనే తన ఇంటి వద్ద నుంచే డ్యూన్ 2 సినిమాకు పనిచేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆరు క్యారెక్టర్లకు హెడ్స్ డిజైన్ చేసినట్టు సుమంత్ రెడ్డి తెలిపారు.
భారతీయ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున అత్యంత వైభోవోపేతంగా, కన్నుల పండుగగా జరిగిన ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో డ్యూన్ పార్ట్ 2 సినిమాకు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో ఉత్తమ పురస్కారం లభించడం తెలిసిందే. తాను పనిచేసిన సినిమాకు అవార్డు రావడంతో సుమంత్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అలాగే అవార్డు లభించినప్పుడు నా ఆనందంలో మాటల్లో చెప్పలేకుండా ఉందని అని అన్నారు.

డ్యూన్ పార్ట్ 2 మాత్రమే కాకుండా హాలీవుడ్‌లో పాపులర్ చిత్రాలు ఫ్యూరియోసా: మ్యాడ్ మ్యాక్స్ సాగా, బోర్డర్ ల్యాండ్ చిత్రాలకు కూడా పనిచేశాను. ఇంకా కొన్ని పాపులర్ ప్రాజెక్టుల్లో భాగమయ్యానని సుమంత్ రెడ్డి తెలిపారు. డ్యూన్ పార్ట్ 2 సినిమాకు పనిచేయడం ఓ ఛాలెంజ్ లాంటింది అని ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications











