కరోనా దెబ్బకు తోక ముడిచిన బ్యాట్‌మెన్
హాలీవుడ్ చిత్రం ది బ్యాట్‌మెన్‌ను కూడా కరోనా భయాందోళనలు చుటుముట్టాయి. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా పలు సినిమాల షూటింగ్‌లు, రిలీజ్‌లు వాయిదాపడుతున్నాయి. ఈ క్రమంలోనే బ్యాట్‌మెన్ షూటింగ్‌ను కూడా చిత్రయూనిట్ వాయిదా వేసినట్టు ప్రకటన చేసింది.
బ్యాట్‌మెన్ షూటింగ్ వాయిదా వేయడంపై వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ స్పందిస్తూ.. ఇప్పటి నుంచి రెండువారాలపాటు సినిమా షూటింగ్‌ను నిలిపివేస్తున్నాం. కరోనావైరస్ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. పరిస్థితులకు అనుగుణంగా షూటింగ్‌ను ప్రారంభించే విషయాన్ని దృష్టిలో పెట్టుకొన్నాం అని తెలిపారు.

త్వరలోనే ప్రస్తుతం అనుకొన్న లొకేషన్ నుంచి లివర్‌పూల్‌కు మార్చే విషయంపై దృష్టిపెట్టారని హాలీవుడ్ పత్రికలు కథనాలు వెల్లడించాయి. అయితే షూటింగ్ వాయిదా కారణంగా ఈ సినిమా రిలీజ్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని జూన్ 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ది బ్యాట్‌మెన్ చిత్రంలో రాబర్ట్ ప్యాటిసన్, జాన్ టర్టూరో, పాల్ డానో, కోలిన్ ఫారెల్, జెఫరీ రైట్, ఆండీసెరిక్ తదితరులు నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతికతో ప్రేక్షకులను కొత్త అనుభూతిని కలిగించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాల్లో చిత్ర యూనిట్ ఉంది.


Click it and Unblock the Notifications











