గాడ్ ఫాదర్ నటుడు కన్నుమూత.. కోమా నుంచి తిరిగి రాని లోకాలకు
ప్రపంచ సినిమాకు స్ఫూర్తిగా నిలిచిన ది గాడ్ ఫాదర్ చిత్రంలో నటించిన కార్మైన్ కారిడి ఇక లేరు. కొద్దిరోజులుగా కోమాలోకి జారుకొన్న ఈ విలక్షణ నటుడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. ఆయన మృతికి సినీ ప్రపంచం శ్రద్దాంజలి ఘటిస్తున్నది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాప ప్రకటనలు వెలువరిస్తున్నారు.
ఆరు దశాబ్దాలపాటు ప్రేక్షకులకు తన నటనతో వినోదాన్ని పంచిన కార్మైన్ కారిడి మరణించారు. ఆయన సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య మంగళవారం సెడార్స్ సినియా హాస్పిటల్‌లో కన్నుమూశారు అని మీడియా ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 25న జారి కింద పడటంతో తలకు బలంగా గాయకావడం, దాంతో కోమాలోకి జారుకొన్నారని బంధువులు వెల్లడించారు.

ది గాడ్ ఫాదర్: పార్ట్ 2 చిత్రంలో కార్మైన్ రొసాటో పాత్రలో నటించిన కారిడీ విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆయన పాత్రకు అత్యంత ప్రజాదరణ లభించింది. గాడ్ ఫాదర్ ట్రయోలజీ చివరి భాగంలో కూడా కారిడి కనిపించారు. గాడ్ ఫాదర్ చిత్రాన్ని పక్కన పెడితే, పలు టెలివిజన్ షోలలో నటించారు. షైలీస్, స్టార్ స్కై, హచ్, టాక్సీ, ఎన్‌వైపీడీ బ్లూ, తదితర షోలు అత్యంత ప్రజాదరణ పొందాయి. 2004లో ఆస్కార్ అవార్డుల కమిటీ కారిడీని నిషేధించడం వివాదాస్పదంగా మారింది. కొన్ని సినిమాలను వీసీఆర్ కాపీలుగా మార్చి అమ్మారనే ఆరోపణలపై ఆయనపై నిషేధం వేటు వేశారు.


Click it and Unblock the Notifications











