Mufasa: The Lion King Trailer Review : ముఫాసా - స్కార్‌లు ఎందుకు బద్ధ శత్రువులయ్యారంటే?
ప్రపంచవ్యాప్తంగా ది లయన్ కింగ్ మూవీకి ప్రత్యేకమైన అభిమానులున్న సంగతి తెలిసిందే. 1994లో యానిమేషన్‌లో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించగా అప్పట్లో పిల్లలు, పెద్దలు ఈ మూవీని ఎంజాయ్ చేశారు. ఇది సక్సెస్ కావడంతో పదేళ్ల తర్వాత 3డీ యానిమేషన్ వెర్షన్‌లో 2019లో విడుదల చేస్తే మరోసారి ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా ఇప్పుడు ముఫాసా ఒక రాజుగా ఎలా ఎదిగాడనే స్టోరీని బేస్ చేసుకుని ''ముఫాసా .. ది లయన్ కింగ్''ను తెరకెక్కించారు మేకర్స్.
క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది. బ్యారీ జెంకిన్స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను లైవ్ యాక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్‌తో, ఫోటో రియల్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెరీలో తెరకెక్కించారు. ప్రపంచ ప్రఖ్యాత వాల్ట్ డిస్నీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా శనివారం ముఫాసా : ది లయన్ కింగ్ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

రెండు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్‌లో ముఫాసా అనే అనాథ సింహం పిల్ల.. ప్రైడ్ ల్యాండ్స్‌కు రాజుగా ఎలా మారిందనేది ఇందులో షార్ట్ కట్‌లో చూపించారు. ట్రైలర్ ప్రారంభం కాగానే సింబా, నలాల కుమార్తె కియారాకు ముఫాసా, స్కార్‌ల కథను ప్రైడ్ ల్యాండ్స్‌కు షామన్‌గా పనిచేసే రఫీకి వివరిస్తుంటాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో ముఫాసా.. రాజ వంశానికి వారసుడైన తాకా అనే సింహాన్ని ఎలా కలుస్తుంది, అతను ముఫాసాను తన సోదరుడిగా ఎలా అంగీకరించాడనేది ట్రైలర్‌లో చూపించారు.
శత్రువైన కిరోస్‌తో పోరాటంలో సోదరులిద్దరూ సాహసాలు చేస్తుండగా.. తాకా చివరికి స్కార్‌గా మారతాడు. శత్రువులతో పోరాడుతూ, కలిసి పెరిగేకొద్దీ.. ముఫాసాకు వ్యతిరేకంగా తాకా మారడంతో కథ అనుకోని మలుపు తిరుగుతుంది. రాజుగా మారడానికి ముందు ముఫాసా గురించి తెలియని విషయాలను ఇందులో చర్చించినట్లుగా ఉంది. ప్రారంభంలో తాకా నుంచి ముఫాసా తిరస్కరణను ఎదుర్కొన్నప్పటికీ.. చివరికి ఇద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడి, వారి సోదరభావాన్ని పటిష్టం చేస్తుంది.

ముఫాసా పాత్రకు నటుడు ఆరోన్ పియరీ , తాకా పాత్రకు కెల్విన్ హారిసన్ జూనియర్ , బిల్లీ ఐచ్నర్ టిమోన్‌కు, సేత్ రోజెన్ పుంబాకు గాత్రదానం చేశారు. అయితే ముఫాసా.. ది లయన్ కింగ్ రిలీజ్‌తో పాటు వాల్ట్ డిస్నీ నిర్మించిన లిలో అండ్ స్టిచ్, స్నో వైట్ వంటి పలు చిత్రాల విడుదల తేదీలు కూడా ఇప్పటికే ప్రకటించారు. మరి ముఫాసా, స్కార్‌ల మధ్య శత్రుత్వం ఎందుకొచ్చింది.. ముఫాసాను స్కార్ ఎందుకు చంపాలనుకున్నాడో తెలియాలంటే డిసెంబర్ 20 వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











