రాంగోపాల్ వర్మతోనే కాదు.. రాజమౌళితో కూడా సినిమా తీస్తా.. నిర్మాత గురురాజ్
సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో లవర్స్ డే ఫేమ్ ఎ.గురురాజ్ సుఖీభవ మూవీస్ పతాకంపై నటరాజ్ ని హీరోగా, నూరిన్, అంకిత హీరోయిన్లుగా పరిచయం చేస్తున్న చిత్రం 'ఊల్లాల ఊల్లాల'.
కొత్త కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకి జనవరి 1 న వస్తున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత ఎ.గురురాజ్ మీడియాతో మాట్లాడుతూ.. థ్రిల్లింగ్ కథనాల్లో సస్పెన్స్ సన్నివేశాలు 'ఊల్లాల ఊల్లాల' లో పుష్కలంగా ఉన్నాయి అన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..

నిర్మాత నుంచి యాక్టర్‌గా
యాక్టర్ కావాలనే ఉద్దేశంతో 90 దశకంలో సినీ పరిశ్రమకి వచ్చాను. కానీ కళామతల్లి మీద ప్రేమతో నిర్మాతగా మారాను. అయితే ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో చిన్న చిన్న వేషాలు మాత్రమే వేశాను. కానీ 'ఊల్లాల ఊల్లాల' లో మాత్రం కథని నడిపించే పాత్రని నేను కచ్చితంగా వేయాల్సి వచ్చింది. అనుకున్నట్టుగానే నా పాత్ర బాగా రావడమే కాక చిత్రానికి బాగా పనికొచ్చింది. గతంలో ఎన్నో సినిమాలు రూపొందించినా గానీ.. నేను ఎప్పుడూ తెరపై కనిపించాలని అనుకోలేదు. కానీ కథ డిమాండ్ చేయడంతో ఊల్లాల ఊల్లాల చిత్రంలో నటించాల్సి వచ్చింది అని గురురాజ్ చెప్పారు.

పోస్టర్‌తో క్రేజీగా.. సస్సెన్స్‌గా
గుర్రం, అమ్మాయితో సినిమా పోస్టర్ రిలీజ్ చేయగా మంచి స్పందన, క్రేజ్ ఏర్పడింది. సినిమాలో అది సస్పెన్స్ గా తీసుకెళ్తున్నాం, ఆ పోస్టర్ చూస్తేనే సినిమా ఎంత వైవిధ్యంగా ఉండబోతుందో అర్ధం అవుతుంది. సినిమాకి వచ్చిన ప్రేక్షకుడికి ఆ పోస్టర్ చూసాక పెరిగిన అంచనాలన్నీ థియేటర్‌లో తెరమీద దొరుకుతాయి.

ఊల్లాల ఊల్లాల కథ అలా చెప్పి
నేను యాక్టర్‌గా ట్రై చేస్తున్న సమయంలోనే సత్య ప్రకాష్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం నటుల పరిచయం అయ్యారు. సినిమాలో ఎంత క్రూరమైన విలన్‌గా కనిపిస్తాడో ఆయన బయట అంట పెద్ద భక్తుడు. అందుకే అతనితో స్నేహం పెరిగింది. ఒకరోజు అనుకోకుండా ఒక పాయింట్ చెప్తా వింటావా అని అన్నారు. అలా అప్పుడు చెప్పిన లైన్ ని తీసుకొని స్టోరీ గా డెవలప్ చేసి కొత్త కంటెంట్ తో ఎంటర్టైనింగ్ గా చూపించాం, థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేయడం ఖాయం అని గురురాజ్ పేర్కొన్నారు.

రాంగోపాల్ వర్మతో సినిమా
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సినిమా చేస్తున్నారనే వార్తలో నిజముంది. ఇప్పుడే ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కువగా చెప్పలేను. ఆయనను కలిసిన తర్వాత నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆయన గురించి నేను బయట నెగెటివ్‌గా విన్నదానికి ఆయన నిజంగా ఉన్నదానికి చాలా తేడా ఉంది, చాలా డిగ్నిటీతో వ్యవహరిస్తారు. చాలా మంచి మనిషి, మాటకి విలువిస్తారు. అలాగే నేను పిలవగానే మొదట్లో తనకి చిత్రానికి సంబంధం లేదు కాబట్టి రాను అన్నారు కానీ మీరొస్తే మా చిత్రానికి ప్లస్ అవుతుంది అనగానే ఈవెంట్ కి వచ్చారు, అన్ని కుదిరితే ఆయనతో ఒక ప్రాజెక్టు చేయడం మాకు చాలా సంతోషం అని గురురాజ్ పేర్కొన్నారు.

కళామతల్లి ఆశీస్సులు ఉంటే
భగవంతుడు, కళామతల్లి ఆశీర్వదిస్తే రాంగోపాల్ వర్మతోనే కాదు.. ఎస్ రాజమౌళితో కూడా సినిమా తీయడానికి వెనుకాడను. త్వరలోనే ఓ పెద్ద హీరోతో సినిమాను ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను. సినీ రంగంలోనూ, రియల్ ఎస్టేట్ రంగంలోనూ బిజీగా ఉన్నాను. మాకు సుఖీభవ పేరుతొ వేరు వేరు సంస్థలు స్థాపించాలనే ఆలోచనలో ఉన్నాం, అన్నీ కుదిరితే స్టూడియో నిర్మాణంపై దృష్టిపెడుతాం అని గురురాజ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











