నా కథను విజయ్ దేవరకొండకు చెప్పా.. ఆర్జీవి ట్వీట్‌తో ఫుల్ క్రేజ్.. RX 100 గురించి..
Recommended Video

టాలీవుడ్‌లో ప్రస్తుతం విభిన్నమైన లవ్ స్టోరిగా తెరకెక్కినట్టు ప్రచారమవుతున్న ఆర్ఎక్స్ 100 రిలీజ్‌కు ముందే సెన్సేషన్‌గా మారింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు అజయ్ భూపతి, హీరో కార్తీకేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కొత్తగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం జూలై 12న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు అజయ్ భూపతి తెలుగు ఫిల్మ్‌బీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అజయ్ భూపతి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

విజయ్ దేవరకొండకు కథ చెప్పా
ఆర్ఎక్స్ 100 కథ తయారు చేసుకొన్న తర్వాత మొదటగా విజయ్ దేవరకొండకు స్టోరి చెప్పాను. అప్పటికే ఆయన పెళ్లిచూపులు సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత చూద్దాం అని అన్నాడు. కానీ ఆ తర్వాత అర్జున్‌రెడ్డితో విజయ్ రేంజ్ మారిపోయింది. అర్జున్‌రెడ్డి కథ అర్బన్ కావడం, నా స్టోరి రూరల్ బ్యాక్ డ్రాప్ కావడంతో ఆయనతో చేయడానికి కొంత సంకోచించాను.

రౌడీ సినిమాకు వర్మ వద్ద ఆఫర్
దర్శకుడు కావాలనే కోరికతో హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో నాకు ఎవరూ తెలియదు. ఆ తర్వాత వీరుపోట్ల వద్ద సహాయకుడిగా పనిచేశాను. వర్మ ఫిలింస్ సీఈవో సుధీర్ చంద్ర నాకు ఫ్రెండ్ కావడం, అక్కడ రౌడీ సినిమాకు అవకాశం రావడం జరిగింది.

ఎటాక్ చిత్రంతో ఆర్జీవితో అనుబంధం
వర్మ వద్ద అవకాశం వచ్చినా గానీ రౌడీ సినిమాకు పనిచేయలేదు. ఇంట్లో కొన్ని సమస్యల వల్ల వీలు కాలేదు. ఆ తర్వాత ఎటాక్ చిత్రానికి వర్మ దగ్గర పనిచేశాను. అప్పటి నుంచి కిల్లింగ్ వీరప్పన్ లాంటి చిత్రాలకు వర్క్ చేశాను.

ఆర్జీవి నుంచి అన్నీ నేర్చుకోవచ్చు..
దర్శకుడిగా మారాలనుకొనే వారు వర్మ నుంచి చాలా నేర్చుకోవచ్చు. సెల్‌ఫోన్ వాడటం, సోషల్ మీడియాలో బిజీగా ఉండే విషయాలు తప్ప వర్మ వద్ద నుంచి అన్నీ నేర్చుకోవచ్చు. ఆర్ఎక్స్ 100 ట్రైలర్ రిలీజైన తర్వాత మా గురువుగారు ట్వీట్ చేయడంతో భావోద్వేగానికి గురయ్యాను.


Click it and Unblock the Notifications











