ఆ క్షణంలో చచ్చిపోయా.. పట్టుదలతో విజేతగా.. అనిల్ రావిపూడిలో తెలియని కోణం
తెలుగు తెరపై మాయమవుతున్న కామెడీని తిరిగి నిలబెట్టి.. తీసిన 8 సినిమాలు సూపర్‌హిట్‌గా నిలబెట్టి ఓటమి ఎరుగని దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి సరసన నిలిచారు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో కెరీర్‌లో తొలిసారిగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరారు అనిల్. తన 9వ సినిమాను ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేసే ఛాన్స్‌ను దక్కించుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి పండుగ చేయడానికి సిద్ధమవుతున్నారు. స్టార్ యాంకర్ సుమ నిర్వహిస్తోన్న ఛాట్ షోలో పాల్గొన్న అనిల్ రావిపూడి.. తన కెరీర్, సినిమాలు, మెగాస్టార్‌తో ప్రాజెక్ట్ గురించి పంచుకున్నారు. ఈ వివరాలు మీకోసం..
సుమతో అనుబంధం
'సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం గట్టిగానే ప్రమోషన్స్ చేశాం. వాడకుండా మిగిలిపోయిన రెండు రీల్స్ ఉన్నాయ్, వాటిని వేస్తానంటే మీకే పంపిస్తా (నవ్వుతూ). తెలుగు చలనచిత్ర చరిత్రలో అతి ఎక్కువసార్లు ఈవెంట్స్‌లో కలిసిన యాంకర్, డైరెక్టర్ అని తీస్తే మీరు (సుమ), నేను మిగిలిపోతాం. మా ఈవెంట్స్ కాకుండా పక్క ఈవెంట్స్, పర్సనల్ షోలు, ఇంటర్వ్యూలు ఎన్నో ఉన్నాయి' అని సుమతో తన అనుబంధం గురించి పంచుకున్నారు అనిల్ రావిపూడి

నా ఇమిటేషన్ బేస్ ఆ క్యాసెట్
'నాకు దక్షిణాది వంటలంటే చాలా ఇష్టం. సాంబర్ రైస్, అవకాయ, ముద్దపప్పు, నెయ్యి, కారంపొడి, రోటి పచ్చడి, రసం, పెరుగన్నం ఉంటే చాలు. ఉదయాన్నే చద్దన్నంలో ఓ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఉన్నా లాగించేస్తా. శ్రీదేవి పెళ్లి అనే క్యాసెట్ నాపై బాగా ప్రభావం చూపింది. శ్రీదేవి పెళ్లికి సినీ ప్రముఖులంతా వస్తే పెళ్లి పెద్దలుగా రావుగోపాల్ రావు గారు, ఆయనకి అసిస్టెంట్‌గా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన గెస్టులను రిసీవ్ చేసుకుంటారనే దానిపై ఓ మిమిక్రీ క్యాసెట్. చిన్నప్పుడు వీరందరి వాయిస్‌లు ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని, మిమిక్రీ బాగా చేసి నవ్వించేవాడిని. కృష్ణగారు, రావుగోపాలరావు, శోభన్ బాబు గారు, మోహన్ బాబు గారు, ప్రభాకర్ రెడ్డి గారి వాయిస్ బాగా ప్రాక్టీస్ చేసి స్కూల్‌లో క్లాస్‌మేట్స్‌కి చెబుతుండేవాడిని. ఫంక్షన్స్ సమయంలో ఇంట్లో ఫ్యామిలీలు కలిసినప్పుడు కూడా నన్ను సెంటర్‌లో కూర్చోబెట్టి షో చేయించేవారు. నా ఇమిటేషన్‌కు బేస్ అక్కడే పడింది' అని అనిల్ గుర్తుచేసుకున్నారు.
మన భవిష్యత్తు కళామతల్లి దగ్గరే అనుకున్నా
'ఫ్రెండ్స్‌తో, అపరిచితులతో మాట్లాడుతూ వారి మాటతీరు, బాడీ లాంగ్వేజ్‌ను గమనించేవాడిని. దీని వల్లే హీరోల బాడీ లాంగ్వేజ్‌ను బట్టి డైలాగ్స్ రాయడం ఈజీ అయ్యింది. వెంకటేష్ గారికి రాసేటప్పుడు పూర్తిగా ఆయనలా మారిపోయాను, ఇప్పుడు చిరంజీవి గారి విషయంలోనూ అదే జరుగుతుంది. విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ చదువుతున్నప్పుడు సినిమాలు ఎక్కువ చూసేవాడిని, క్లాస్‌లకి తక్కువ వెళ్లేవాడిని.. నేనొకడిని ఉన్నానని అమ్మాయిలకి అస్సలు తెలియదు. మనకంటూ గుర్తింపు లేదని బాధపడుతున్న సమయంలో విజ్ఞాన్ ఛైర్మన్ లావు రత్తయ్య గారు విజ్ఞాన్ మహోత్సవ్ అని ఒకటి కండక్ట్ చేశారు. దానికి స్కిట్‌లు ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ ప్లాన్ చేయమని చెప్పడంతో మెయిన్ ఈవెంట్ కంటే ముందే నా ఎలక్ట్రానిక్ డిపార్ట్‌మెంట్ ఫెస్టివల్ కోసం చిన్న స్కిట్ చేశా. అప్పట్లో రఘుబాబు గారు, శ్రీనివాస్ రెడ్డి వూళ్లలో కొన్ని షోలు చేసేవారు అద్ధంకి కాలేజీలో ఉన్నప్పుడు వారు చేసిన స్కిట్‌లోని చిన్న పార్ట్ తీసుకుని చేస్తే అందరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి చప్పట్లు కొట్టారు. ఆ రోజుతో మన భవిష్యత్ కంప్యూటర్ ముందు కాదు.. కళామ్మతల్లి దగ్గరే అని ఫిక్స్ అయ్యా'నని నాటి జ్ఞాపకాలను అనిల్ రావిపూడి గుర్తుచేసుకున్నారు.

అమ్మాయి కనిపిస్తే వణుకే
'భార్గవి నా క్లాస్‌మేట్ .. ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ బాగుండేది, నా వేషాలన్నీ తనకు తెలుసు. అప్పుడే ఆమెకు స్టోరీలు చెబుతుండేవాడిని, బీటెక్ థర్డ్ ఇయర్ వరకు నేను ఏ అమ్మాయితో మాట్లాడేవాడిని కాదు. అమ్మాయిలతో మాట్లాడాలంటే భయమేసేది, ఎప్పుడైతే స్కిట్ వేశానో అప్పటి నుంచి కాలేజీలో ఒక స్టార్ డమ్ వచ్చింది. అప్పటి నుంచి మాట్లాడటం మొదలు పెడితే భార్గవి పరిచయమైందని తన ప్రేమ జీవితం గురించి అనిల్ ఓపెన్ అయ్యారు.
ఆ స్టేజ్‌పై మాట రాలేదు
ఇంటర్మీడియట్ టైంలో క్లాస్‌లో లెక్చరర్స్‌ని ఇమిటేట్ చేస్తూ మిమిక్రీ చేస్తుండగా ప్రిన్సిపాల్ చూసి ఛాంబర్‌కు రమ్మన్నారు. నా పని ఇక అయిపోయిందని అనుకున్నా, కానీ అక్కడ పూర్తి రివర్స్‌లో జరిగింది. చాలా బాగా చేస్తున్నావని మెచ్చుకున్న ప్రిన్సిపాల్ .. యానివర్స్ డేకి స్టేజ్ మీద చేయమని ఎంకరేజ్ చేశారు. ఆయన మాటలతో కాన్ఫిడెంట్ పీక్స్‌కి వెళ్లి స్టేజ్ మీద చించేద్దామని అనుకున్నా, స్టేజ్ మీద నన్ను నేను పరిచయం చేసుకుని సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేస్తున్నట్లు చెప్పా. దాంతో ఆడిటోరియం మొత్తం పిన్‌డ్రాప్ సైలెంట్.. నాకు చెమటలు పట్టి, హార్ట్ బీట్ పెరిగిపోతోంది వాళ్లేమో ఏఎన్ఆర్, ఎస్వీఆర్‌లా చేయమని అడగటంతో భయమేసి కిందకి దిగేశా. ఇంతమంది ముందు నువ్వు వాయిస్ ఓపెన్ చేయలేకపోయానని సిగ్గేసింది, జీవితంలో నువ్వు ఏం పీకగలవని అనుకున్నా. అక్కడి నుంచి స్టేజ్ ఫియర్ ఎలా పొగొట్టుకోవాలని అనుకున్నప్పుడు బీటెక్‌లో మళ్లీ స్టేజ్ ఎక్కే అవకాశం వచ్చింది' అని చేదు అనుభవాన్ని పంచుకున్నారు అనిల్ రావిపూడి.

నెలకు 70 సినిమాలు చూశా
'ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు నెలకి 70 సినిమాలు చూసేవాడిని. ప్రతిరోజూ మూడు సినిమాలు చూడాల్సిందే, అలా చూడటం వల్లే ఆడిటోరియంలో పబ్లిక్ పల్స్ ఏంటో క్యాచ్ చేయగలిగే కెపాసిటీ వచ్చింది. ఫ్లాప్స్, బ్లాక్‌బస్టర్స్ ఏది వదలకుండా చూసేవాడిని.. జనం ఏ సీన్‌కు ఎక్కువ చప్పట్లు కొడుతున్నారు? ఎక్కడ విజిల్స్ వేస్తున్నారు? ఎక్కడ సైలెంట్‌గా ముఖాలు పెట్టుకుని చూస్తున్నారు? ఇలాంటి అనాలిసిస్ చేసేవాడిని. ఒక్కో సినిమాను 15 సార్లు చూసిన రోజులూ ఉన్నాయి. బ్లాక్‌బస్టర్ సినిమా వస్తే ఎందుకు ఈ సినిమా హిట్ అయ్యందని గమనించేవాడిని. స్కూల్‌లో బాగా చదివితేనే సినిమాలు చూపిస్తానని ఇంట్లో వాళ్లు రూల్స్ పెట్టేవారు, దాంతో క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. సినిమాలు చూడటం కోసం రెండు మెస్ కార్డ్స్‌కి బదులు ఒకటే తీసుకునేవాడిని' అని సినిమాలపై తన ఇష్టాన్ని బయటపెట్టారు అనిల్.
రైటర్‌కి సహనం ఉండాలి
'గౌతమ్ ఎస్ఎస్‌సీ సినిమాకు మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ డైరెక్టర్ కావడంతో అప్రెంటీస్‌గా జాయిన్ అయ్యా. ఇండస్ట్రీలోకి వస్తానంటే బాబాయ్ అంగీకరించలేదు. ఇక్కడ అలవాటు పడటానికి చాలా ఇబ్బందిపడ్డా, కానీ ఏ సమస్య ఉన్నా బాబాయ్‌తో చెప్పేసేవాడిని. డిస్కషన్స్ జరిగేటప్పుడు నోటికి ఏదొస్తే అది వాగేసేవాడిని, అప్పుడు బాబాయ్ నాలోని ప్రతిభను గుర్తించాడు. తర్వాత వీఎన్ ఆదిత్య గారి దగ్గర బాస్ సినిమాకు పనిచేశా. రైటర్ అనేవాడికి ఓర్పు ఉండాలి, డైరెక్టర్స్‌కి ఒక వెర్షన్‌తో ఒప్పుకోరు.. వాళ్లు తృప్తిపడే వరకు రాయాల్సిందే' అని కొత్తగా వచ్చే వారికి అనిల్ రావిపూడి సలహా ఇచ్చారు.


Click it and Unblock the Notifications











