ఆయన ఓ దొంగ.. సరైనా దారిలో వెళ్లకపోవడం వల్లే ఆ సమస్య.. డైరెక్టర్ అరుణ్ పవార్
Recommended Video
స్టార్ కమెడియన్ హీరో సప్తగిరి, డైరెక్టర్ అరుణ్ పవార్ కాంబినేషన్‌లో వచ్చిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ భారీ విజయాన్ని అందుకొన్నది. ఆ సినిమా తర్వాత మళ్లీ మరోసారి వజ్రకవచధార గోవింద సినిమా కోసం వారిద్దరు జతకట్టారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఈ నరేంద్ర, జీవీఎన్ రెడ్డి నిర్మించారు. బుల్గానియన్ సంగీతం అందించారు. వైభవి జోషి నటించిన ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో వజ్రకవచధార గోవింద గురించి దర్శకుడు అరుణ్ పవార్ పలు విషయాలను వెల్లడించారు. అరుణ్ పవార్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

వజ్రకవచధార టైటిల్ హెవీగానే
వజ్రకవచధార సినిమా టైటిల్ చాలా హెవీగానే అనిపిస్తుంది. ఈ సినిమా కథ వజ్రం చుట్టు తిరుగుతుంది. సప్తగిరి పేరు గోవిందు. అందుకే ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. సప్తగిరికి ఈ టైటిల్ హెవీ అయినప్పటికీ.. కథకు యాప్ట్. అందుకే ఆ టైటిల్ పెట్టాను. అందరికీ కనెక్ట్ కావడం నాకు హ్యాపీగా ఉంది.

వజ్రకవచధార స్టోరీ ఇదే
వజ్రకవచధార గోవింద చిత్రంలో సప్తగిరి ఓ దొంగ. అతను ఉండే ఊరిలో జరిగిన ఓ మోసం వల్ల దొంగగా మారాల్సి వస్తుంది. ఎలాగైనా డబ్బు సంపాదించేందుకు ఓ దారిలో ఇరుక్కుపోతారు. తాను ఎంచుకొనే దారి సరైంది కాకపోవడంతో ఫలితం దక్కదు. సరైన దారి ఎంచుకొన్న తర్వాత మంచి ఫలితాలు లభిస్తాయి. మనం చేసే పని మంచిదైనా.. మనం వెళ్లే దారి సరియైనదై ఉండాలి అనే థీమ్ పాయింట్. వజ్రకవచధార గోవింద చిత్రంలోని పాటలు కథలో భాగంగా ఉంటాయి. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాలో మాదిరిగా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించలేదు.

జబర్దస్త్ టీమ్‌తో కామెడీ
బుల్లితెర మీద జబర్దస్త్ టీమ్ హిట్ అయినప్పటీకి.. వెండితెర మీద ఆదరణ లభించకపోవడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. సరైన కంటెంట్ లేకపోవడం వల్లే వారికి అంత క్రేజ్ లభించలేదు. కానీ వజ్రకవచధార చిత్రంలో ఓ సన్నివేశంలో 30 మంది కమెడియన్లు ఉంటారు. వారందరికీ శ్రీనివాసరెడ్డి లీడ్. ఓ వ్యక్తి ఓ విషయాన్ని మరిచిపోతాడు. దానిని గుర్తు చేయడానికి ఆడే డ్రామాలో అందరూ కనిపిస్తారు. కామెడీ బాగా పండుతుంది.

రెండో సినిమాకు గ్యాప్ కారణమదే
సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌కు వజ్రకవచధార గోవిందాకు మధ్య గ్యాప్ రావడానికి ఓ కారణం ఉంది. దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర)కు ఓ కథ చెప్పాను. ఆయనకు నచ్చి ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు వచ్చారు. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయింది. ఆ మధ్యలో ఈ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే కొంత గ్యాప్ కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











