Nayeem Diaries అంతు చూస్తాం.. సినిమా ఆపేయండి.. పోలీస్, టీఆర్ఎస్ నేతల బెదిరింపులపై డైరెక్టర్
నక్సలైట్‌గా నయీం హీరోయిజం, గ్యాంగ్‌స్టర్‌గా అతడి అరాచకాలు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి అసాంఘీక శక్తి జీవితం ఆధారంగా కిల్లర్ వీరప్పన్ మూవీకి కథ, స్క్రీన్ ప్లే అందించిన దాము బాలాజీ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం నయీం డైరీస్. ఈ చిత్రం డిసెంబర్ 10వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో దాము బాలాజీ ప్రత్యేకంగా మాట్లాడుతూ..

ఆర్జీవీతో కిల్లింగ్ వీరప్పన్ సినిమా
నేను కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమాకు రాంగోపాల్ వర్మతో పనిచేశాను. ఈ సినిమాకు స్క్రిప్టు, స్క్రీన్ ప్లే అందించాను. అయితే నయీం డైరీస్ సినిమాకు ఆర్జీవి వద్ద బీజం పడింది. నేను మాజీ నక్సలైట్‌ను కావడం వల్ల ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. నయీం సినిమా ఆయన తీయాలని ప్లాన్ చేసినప్పుడు ఆ కథకు నన్నే వర్క్ చేయమని అడిగారు.
ఆయన నయీం బయోపిక్ ఆపేశారు. అయితే నేను ఆ సినిమాను డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. నేను నక్సలైట్ ఉద్యమంలో ఉండటం వల్లా నయీం కథ గురించి నాకు ఆసక్తి ఉండేది. సినిమాగా చెప్పాలనుకొన్నపుడు మంచి ఎలిమెంట్ ఉన్నాయని అనిపించింది అని దర్శకుడు దాము బాలాజీ తెలిపారు.

మా చేతిలో చచ్చిపోలేదనే బాధ
ఒక సిన్సియర్ నక్సలైట్.. వారికి అంత మొత్తంలో బద్దవిరోధిగా మారడం కథలో మలుపు. ఇన్ఫార్మర్లుగా మారిన తర్వాత మాజీలు సమాచారం అందించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఏకంగా నక్సలైట్లను చంపిన మాజీ నక్సలైట్ నయీం ఒక్కరే. అలా నక్సలైట్లకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుపుతూ పదహారేళ్లు జీవించిన వ్యక్తి ఒక్కరే.
అయితే ఇప్పటికీ తమ చేతిలో చచ్చిపోలేదనే బాధ నక్సలైట్లు, మాజీ నక్సలైట్లలో ఉంది. వాడు చచ్చాడు కానీ.. మన చేతిలో చావలేదు అనే బాధను చాలా మంది నాతో అన్నారు. నక్సలైట్ నుంచి ఎలా తప్పించుకొన్నాడనే విషయం నాకు ఆసక్తిగా అనిపించేంది. అలాగే నక్సలైట్ల లోపాల గురించి కూడా చర్చించాలనే ఇంట్రెస్ట్ ఉండేది అని డైరెక్టర్ దాము బాలాజీ చెప్పారు.

నక్సలైట్లు హీరోలు కాదు..
నక్సలైట్లను కొందరు హీరోలు అంటారు. మరికొందరు క్రిమినల్స్ అంటారు. కానీ వాళ్లు హీరోలు కాదు.. క్రిమినల్స్ కాదు.. అందరి మాదిరిగానే మనుషులు. కానీ ఓ లక్ష్యం కోసం అంకితాభావంతో పనిచేస్తారు. నక్సలైట్ల సిద్దాంతాల కంటే.. వారి లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్స్. అయితే నయీం చనిపోయిన తర్వాత రాజకీయ వర్గాలు అతడిని విలన్‌గా చిత్రీకరించింది. అయితే మీడియా కూడా అదే విధంగా చూడటం నాకు ఆశ్చర్యం కలిగించింది అని దాము బాలాజీ అన్నారు.

ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అంటూ
అయితే మావోయిస్టుల మీద, పోలీసు వ్యవస్థ మీద ఎక్కుపెట్టిన సినీ విమర్శనాస్త్రం నయీం డైరీస్. మాజీ నక్సలైట్లను రెండు రకాలుగా కరప్ట్ చేస్తారు. డబ్బు సంపాదించే విధంగా, అలాగే నక్సలైట్లను మట్టుపెట్టేందుకు పోలీసులు వారిని వాడుకొన్నారు. అయితే పోలీసులు, నక్సలైట్లు, ప్రభుత్వం నుంచి నాకు ఒత్తిడి ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. అలాగే బెల్లి లలిత మనుషులు నలుగురు కాల్ చేసి హెచ్చరించారు.
కొందరు టీఆర్ఎస్ నాయకులు, ఓయూ స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. వారం రోజులుగా నాకు ఫోనులో బెదిరింపులు వస్తున్నాయి అని దాము బాలాజీ చెప్పారు. అయితే సినిమా చూసిన తర్వాత మీరు మాట్లాడండి. నేను తప్పుగా తీస్తే ఖండించండి. కానీ సినిమా ఆపుతామంటే సరికాదని చెప్పారు.

గ్యాంగ్‌స్టర్‌గా మారడానికి కారణం ఇదే..
నిజాయితీ, అంకితభావం ఉన్న నక్సలైట్ నుంచి నయీం విలన్‌గా మారడానికి కారణం నక్సలైట్లే ప్రధాన కారణం. వ్యాస్ హత్య అనంతరం జైల్లో ఉన్న నయీంను వేధింపుల కారణంగా అతడు నక్సలైట్లకు వ్యతిరేకంగా మారారు. జైల్లో కొందరు నక్సలైట్లను నయీం కొట్టాడు. దాంతో నయీంపై నక్సలైట్ నేతలు ఏకపక్షంగా చర్యలు తీసుకొన్నారు.
అంతేకాకుండా తన సోదరిపై ఈదన్న అనే నక్సలైట్ రేప్ అటెంప్ట్ చేయడం, బెల్లి లలిత మర్డర్ లాంటి అంశాలు నక్సలైట్లకు నయీం వ్యతిరేకంగా పనిచేయడానికి కారణాలు అయ్యాయి. అదే అవకాశాన్ని వాడుకొని తమకు అనుకూలంగా, నక్సలైట్లకు వ్యతిరేకంగా పోలీసులు వాడుకొన్నారు అని దాము బాలాజీ వెల్లడించారు.

నయీంకు అమ్మాయిల పిచ్చి గురించి
గ్యాంగ్ స్టర్‌గా మారిన తర్వాత నయీం చేసిన అసాంఘీక కార్యక్రమాలను తెరమీద చూపించాను. అయితే నయీంకు అమ్మాయిల పిచ్చి అనే విషయంలో వాస్తవం లేదు. నయీంకు మానభంగాలు చేయలేదు. సిగరెట్ తాగడు. మద్యం తీసుకోడు. అయితే తన చుట్టూ అమ్మాయిలను పెట్టుకోవడానికి కారణం తనకు తాను రక్షించుకోవడానికే.
అమ్మాయిలు ఉంటే తనపై కాల్పులు జరపారనే ఉద్దేశంతో వారిని తన పక్కన పెట్టుకొనే వాడు. అయితే నయీం క్యారెక్టర్‌ను చెడుగా చూపించడానికి కొన్ని వర్గాలు చూపించాయి. కుక్కను చంపాలనుకొనేటప్పుడు పిచ్చి కుక్క అని ముద్ర వేస్తారు. నయీం విషయంలో కూడా అదే జరిగింది అని దాము బాలాజీ తనకు తెలిసిన విషయాలను స్పష్టంగా చెప్పారు.
Recommended Video

నయీంపై నాకు జాలి లేదు అంటూ
నయీంపై నాకు జాలి లేదు కానీ.. ఒకరకమైన బాధ ఉంది. ప్రజల కోసం పనిచేస్తున్న నక్సలైట్లను చంపాడు. అయితే ఆ విషయంలో ఆయన శిక్షార్హుడు. అయితే క్రిమినల్ కార్యక్రమాలు చేయడం వెనుక అతడి వ్యక్తిగత స్వార్ధం లేదు. కానీ ప్రభుత్వాల స్వార్థం ఉంది. ఆ విషయాన్ని ఎవరూ కూడా ప్రస్తావించరు. బయటకు చెప్పరు. అదే విషయాన్ని నేను నా సినిమా ద్వారా బయటకు చెప్పాలని అనుకొంటున్నాను అని దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











