కేవలం వాటితో సినిమా ఆడదు.. రామ్ చరణ్ సినిమాపై హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు
ఒక సినిమా హిట్ అవ్వడానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబెట్టినవాడే విజయం సాధిస్తారు. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హార్రర్, కామెడీ, రొమాంటిక్ ఇలా ఒక్కో జోనర్ ప్రేక్షకుడు ఇష్టపడతాడు. సినిమాలో జనం కోరుకున్న ఎలిమెంట్స్‌ను చొప్పించి, డ్రామాను అద్భుతంగా రక్తి కట్టించేవాడే విన్నర్. దశాబ్ధాలుగా ఈ సూత్రాన్ని ఉపయోగించి కోట్లు వసూళ్లు సాధించారు దర్శక నిర్మాతలు. అయితే అన్ని ఎలిమెంట్స్ అన్ని సార్లు వర్కవుట్ కావని పలు సినిమాలు నిరూపించాయి.
ఇదే విషయాన్ని చెబుతున్నారు యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్. మాస్ మహారాజా రవితేజ - భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా ఆయన తెరకెక్కించిన మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో సినిమాకు విపరీతమైన హైప్ వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ అందాలు కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తున్నాయి. రవితేజ - భాగ్యశ్రీలపై తెరకెక్కించిన రొమాంటిక్ సీన్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుండగా.. అదే సమయంలో హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్‌పైనా అదే స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి అంతే ఘాటుగా ఆన్సర్ ఇచ్చారు హరీష్ శంకర్.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిరపకాయ్, బలుపు సినిమాల తర్వాత రవితేజ రేంజ్ పెరిగిందని, దానిని అందుకునే కంటెంట్ కోసమే గ్యాప్ తీసుకున్నానని ఆయన చెప్పారు. యాక్షన్ సీక్వెన్స్, ఫైట్స్ వల్ల సినిమాలు ఆడవని అభిప్రాయపడిన హరీష్ శంకర్.. మగధీరలో హీరో రామ్ చరణ్ 100 మందిని చంపే సీన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గుర్రపుస్వారీ, కత్తియుద్ధాలు, విజువల్ ఎఫెక్ట్స్, ఎలివేషన్స్, పాటలు ఈ సినిమాను మరో మెట్టుపైకి ఎక్కించాయి.

ముఖ్యంగా.. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో షేర్‌ఖాన్ పాత్రలో శ్రీహరి తన మనుషుల్ని 100 మందిని పంపిస్తానని, వాళ్లందరినీ నువ్వొక్కడివే చంపాలని.. అప్పుడు రాణిని, రాజ్యాన్ని తిరిగిస్తానని హీరోతో ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు చరణ్ ఒక్కొక్కొడిని కాదు షేర్ ఖాన్.. 100 మందిని ఒకేసారి పంపించు అంటూ పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతాడు. చెప్పినట్లుగానే బాణాలు తగులుతున్నా, శరీరం గాయపడినా 100 మందిని చంపి సవాల్‌లో గెలుస్తాడు. ఈ పోరాట సన్నివేశం మగధీరకే హైలెట్‌గా నిలవడమే గాక.. ఇప్పుడు చూసినా గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఆ తర్వాత అలాంటి యాక్షన్ సీక్వెన్స్‌లు ఎన్నో వచ్చినా.. మగధీరలోని ఆ సీన్ మాత్రం ఓ అధ్యాయంగా నిలిచిపోయింది.

ఈ పోరాట సన్నివేశం ఇంతగా రక్తి కట్టడానికి కారణం ఇందులోని ఎమోషనే అన్నారు హరీష్ శంకర్. ఈ సీన్ రియాలిటీకి దగ్గరగా లేదని ప్రేక్షకులు భావించి ఉంటే ఫ్లాప్ అయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభాస్ నటించిన సలార్‌లో హీరో చాలా మందితో ఫైట్ చేస్తాడని.. ఇందులో ఎమోషన్ ఉంది కాబట్టే ప్రేక్షకులు ఆదరించారని హరీష్ శంకర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











