నాగచైతన్యకు ఆ ఇద్దరితో సమస్యలు.. ఆ లోపం లేదు.. మారుతి
భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు చిత్రాల తర్వాత మారుతి రూపొందించిన చిత్రం శైలజారెడ్డి. అత్త, ప్రేయసి ఇగోలను ఎదురించే యువకుడిగా నాగచైతన్య నటించాడు. రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో కనిపించారు. శైలజారెడ్డి చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడిగా ఈ చిత్రం గురించి మారుతి పలు విషయాలను వెల్లడించారు. సినిమా గురించి, నాగచైతన్య నటన గురించి ఫిల్మీబీట్ తెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడారు. మారుతి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా
శైలజారెడ్డి అల్లుడు చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకొని వినాయకచవితి కానుకగా ఆగస్టు 13న రిలీజ్‌కు సిద్ధమైంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఇప్పటి వరకు నేను తీసిన చిత్రాల్లన్నీంటిలో పక్కా ఫ్యామిలీ చిత్రంగా రూపొందింది.

అంచనాలు మించి చైతూ
శైలజారెడ్డి చిత్రంలో కొత్త నాగచైతన్యను చూస్తాం. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా కనిపిస్తాడు. లవర్ ఇమేజ్ నుంచి పక్కకు తొలగి యాక్టివ్‌గా కనిపించాడు. కొన్ని సీన్లలో నాకు నాగార్జున కనిపించాడు. నేను సీన్లు రాసుకొనేటప్పుడు ఓ అంచనా పెట్టుకొని స్క్రిప్టు తయారు చేసుకొన్నాడు. కానీ ఆ అంచనాలను మించి చైతూ చేశాడు.

అత్త, ప్రేయసి మధ్య నలిగి
శైలజారెడ్డి చిత్రంలో చైతూ పాత్రకు అటు అమ్మాయితోనూ, ఇటు అత్తతోనూ సమస్యలు ఉంటాయి. ఇగో ఉన్న తల్లి, కూతుళ్లను ఎలా మెప్పించి పెళ్లి చేసుకొన్నాడన్నదే నా ఈ సినిమా కథ. ఇగో ఉండే వ్యక్తుల మధ్య ఓ యువకుడు ఎలా నలిగిపోతుంటాడు. వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన పాయింట్.

ఆ లోపాలు ఉండదు..
భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు చిత్రంలో మాదిరిగా హీరోకు ఎలాంటి లోపాలు ఉండవు. అలాంటి కథ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా శైలజారెడ్డి. ఇగో అనేది ఓ వ్యక్తికి లోపం కాదు. ఇది అంతా తెలిసిన కథే. అయితే కొత్తగా చూపించడమే ఈ సినిమాలో ఛాలెంజ్.

టైటిల్‌లో రెడ్డి పెట్టడానికి
ఈ టైటిల్‌లో రెడ్డి అని పెట్టడానికి ప్రత్యేక కారణం లేదు. టైటిల్‌లో రెడ్డి అంటే పవర్‌ఫుల్‌గా ఉంటుందని పెట్టాను. రంగమ్మనాయుడు అల్లుడు అంటేగానీ, లేదా ఇతర టైటిల్ పెడితే టైటిల్‌లో ఇంపాక్ట్ ఉండదు. శైలజారెడ్డి అంటే రమ్యకృష్ణకు యాప్ట్‌గా ఉంటుందని, అల్లుడు అంటే కొంతసాఫ్ట్‌గా ఉండేలా జోడించి ఓ క్లాస్ మూవీని చేశాం.

రమ్యకృష్ణతో పోటాపోటిగా
రమ్యకృష్ణ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారు. ఎంతో అనుభవం ఉన్న నటి ముందు నాగచైతన్య ధీటుగా సమాధానం చెప్పారు. క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ ముందు పేజీల కొద్ది డైలాగ్స్‌ను అలవోకగా చెప్పారు. ఖచ్చితంగా శైలజారెడ్డి చిత్రం నాగచైతన్యకు కొత్త ఇమేజ్ తెచ్చిపెడుతుంది.


Click it and Unblock the Notifications











