మా నాన్నకు థ్యాంక్యూ చెప్పాలనుకొన్నా.. కానీ ఆయన త్వరగానే లోకం విడిచి.. విక్రమ్ కుమార్ ఎమోషనల్
మనం, 24 లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం థాంక్యూ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు,శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో దర్శకుడు విక్రమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..

నా స్థాయికి కారణం నాన్న గారే..
థాంక్యూ అనే పదాన్ని మనం నిత్య జీవితంలో పలు సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. కానీ అసలైన ప్రాముఖ్యతను గుర్తించి థాంక్యూ చెప్పే సందర్భంలో మాత్రం చెప్పం. నిజానికి థాంక్యూ అనేది చాలా పవర్‌ఫుల్ పదం. దానికి మనం విలువ లేకుండాచేశాం. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నానంటే మా నాన్నగారే కారణం. ఆయనకు నేను ఏ రోజూ థాంక్స్ చెప్పలేదు. కానీ ఓరోజు ఆయన ఈ లోకాన్ని విడిచి పెట్టేసి వెళ్లిపోయారు. నిజానికి మన తల్లిదండ్రులు మన నుంచి థాంక్యూ అనే పదాన్ని చెప్పాలని కోరుకోరు. ఒకవేళ చెప్పిన వారికి కోపం వస్తుంది. కానీ మనం వారికి థాంక్యూ చెప్పాలి అని విక్రమ్ కుమార్ అన్నారు.

16 ఏళ్ల పిల్లాడిలా చైతూ
మూడు నాలుగేళ్ల నుంచి నేను, చైతన్య కలిసి ఓ సినిమా చేయాలని అనుకుంటూనే ఉన్నాం. దానికి సంబంధించిన చర్చలు జరుగుతూనే వచ్చాయి. అలాంటి సమయంలో ఈ స్క్రిప్ట్ వచ్చింది. ఇందులో నాగ చైతన్య మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తారు. అందులో 16 ఏళ్ల పిల్లాడిలా కనిపించే పాత్ర ఒకటి. అలాగే 20-21 ఏళ్ల వయసుండే కుర్రాడిగా కనిపిస్తారు. తర్వాత 35-40 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారు. 16 ఏళ్ల కుర్రాడిగా కనిపించటం కోసం చైతన్య చాలా కష్టపడ్డారు. 40-50 రోజుల పాటు స్పెషల్ డైట్ తీసుకుని బరువు తగ్గి తన లుక్‌ను మార్చుకున్నారు. ఆ పాత్రకు సంబంధించిన క్రెడిట్ అంతా నాగ చైతన్యకే దక్కుతుంది అని విక్రమ్ కుమార్ పేర్కొన్నారు.

థ్యాంక్యూలో అలాంటి మ్యాజిక్
ప్రేమమ్, ఆటోగ్రాఫ్ సినిమాలు గొప్ప సినిమాలు. అలాంటి సినిమాలతో మా 'థాంక్యూ' సినిమాను పోల్చితే మాకు చాలా ప్లస్ అయినట్లే. ఇది ఒక వ్యక్తి జర్నీ. అలాంటి కోవకు చెందిన సినిమానే అయినా ఆ సినిమాలకు దీనికి టచ్ ఉండదు. థాంక్యూ సినిమాలో ఓ మ్యాజిక్ ఉంటుంది. కచ్చితంగా అది ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా స్క్రిప్ట్ డిస్కషన్ చేసుకున్న తర్వాత మన జీవితంలో కచ్చితంగా కొందరికి థాంక్స్ చెప్పాలని నేను, చైతన్య భావించాం. ఆ ఫీలింగ్ మా ఇద్దరిలోనూ కలిగింది. అలా కొందరికీ థాంక్స్ చెప్పిన తర్వాతే ఈ సినిమాను స్టార్ట్ చేశాం అని విక్రమ్ కుమార్ చెప్పారు.

తమన్ అద్బుతమైన సంగీతం
బీవీఎస్ రవి వచ్చి ఈ కథను చెప్పగానే కథలోని మెయిన్ సోల్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ సోల్‌ను నా స్టైల్‌లో ఆడియెన్స్‌కు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా ముందుకు వెళ్లాం. దర్శకుడిగా నేను వేరే కథకు కనెక్ట్ కాలేనప్పుడు ఆ సినిమాను డైరెక్ట్ చేయలేను కదా. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని స్క్రీన్‌పై చూపించాలంటే సంగీతానికి చాలా ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. తమన్ మా సినిమాకు అద్బుతమైన సంగీతాన్ని అందించారు. రీసెంట్‌గా బ్యాగ్రౌండ్ స్కోర్ విన్నాను. చాలా చాలా బాగా చేశాడు. మనసు పెట్టి మ్యూజిక్ అందించాడు తమన్.

రాశీఖన్నా పాత్ర కీలకంగా
రాశీ ఖన్నా పాత్ర.. అభిరామ్ జర్నీలో చాలా కీలకమని చెప్పాలి. అభిరామ్ పాత్రను కథకు కనెక్ట్ అయ్యేలా చేసే పాత్ర ఆమెది. అందులో ఆమె నటించిన ఓ సీన్ ఉంటుంది. దాన్ని ఆమె ఎక్సలెంట్‌గా చేసింది. దాన్ని నేను మానిటర్‌లో చూసినప్పుడు నా కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. మాళవికా నాయర్ అద్భుతమైన నటి. ఆమె చేయాల్సినన్ని సినిమాలు చేయలేదనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత తనకు నటిగా ఇంపార్టెన్స్ మరింతగా పెరుగుతుంది. అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె చిన్నప్పటి నుంచే నటిగా మెప్పిస్తోంది.


Click it and Unblock the Notifications











