Rowdy Boys హీరో కావడానికి 25 కేజీల బరువు తగ్గా.. దిల్ రాజు మాటలను ఛాలెంజ్‌గా తీసుకొన్నా.. ఆశీష్ రెడ్డి
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి నటవారసుడిగా ఆశీష్ రెడ్డి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హుషారు మూవీ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల నుంచి ఆశీర్వాదం పొందేందుకు సిద్దమయ్యారు. ఈ చిత్రం జనవరి 14న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆశీష్ రెడ్డి తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

25 కేజీల బరువు తగ్గాను
చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఫ్యామిలీ పార్టీలలో డ్యాన్సులు చేసే వాడిని. నాకు అల్లు అర్జున్ అంటే ఫేవరెట్. అప్పుడు బన్నీ అన్నను చూసి యాక్టింగ్‌లోకి రావాలని అనుకొన్నాను. కానీ నాకు సిగ్గు, బిడియం ఎక్కువ. నేను యాక్టింగ్ చేయగలనా? అనే సందేహం వచ్చేది. కానీ నేను యాక్టింగ్ చేయాలని ఉందని ఇంట్లో చెప్పినప్పడు అందుకు తగిన శిక్షణ తీసుకోమని చెప్పారు. ఆ సమయంలో నేను చాలా లావుగా ఉండే వాడిని. సన్నపడటానికి దాదాపు 25 కేజీలు తగ్గాను. అప్పుడు తపన, అంకిత భావం చూసి ఇంట్లో వాళ్లకు ఓ నమ్మకం కుదిరింది అని ఆశీష్ రెడ్డి అన్నారు.

న్యూయార్క్‌లో, సత్యానంద్ వద్ద శిక్షణ
ఒకసారి నేను సన్నబడిన తర్వాత యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకొన్నాను. న్యూయార్క్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందాను. హైదరాబాద్‌లో బిక్షు వద్ద ట్రైనింగ్ తీసుకొన్నాను. అలాగే సత్యానంద్ వద్ద శిక్షణ పొందాను. బాంబేలో యాక్టింగ్ స్టూడియోలో ట్రైనింగ్ తీసుకొన్నాను. ఆ తర్వాత ఫ్యామిలీ సూచన మేరకు కేరింత సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి సినిమా మేకింగ్‌లో పలు విభాగాల గురించి తెలుసుకొన్నాను. ఆ తర్వాత హీరో కావాలని మానసికంగా సిద్దమయ్యాను అని ఆశీష్ రెడ్డి తెలిపారు.

సొంత బ్యానర్ కావడంతో బాధ్యత పెరిగింది
దర్శకుడు హర్ష చెప్పిన కథ నచ్చడంతో రౌడీ బాయ్స్ సినిమా చేయడానికి నిర్ణయించుకొన్నాను. సొంత బ్యానర్ కావడంతో బాధ్యత పెరిగింది. సినిమాకు ముందు హర్ష, నేను, అనుపమ పరమేశ్వరన్, కొంతమంది వర్క్‌షాప్ చేశాం. అన్నపూర్ణ స్టూడియోలో రామ్ సార్ సూచనలు, సలహాలు తీసుకొన్నాను. ఆ తర్వాత నేరుగా షూటింగుకు వెళ్లాం. హర్ష, నేను కాలేజ్ నుంచి అప్పుడే రావడంతో మా అభిప్రాయాలను పంచుకొన్నాం. సన్నివేశాలను ఇంప్రూవ్ చేయడానికి మా మధ్య అవగాహన బాగా ఉపయోగపడింది. సినిమాటోగ్రాఫర్ మది ఈ సినిమాకు పనిచేయడం చాలా ఉపయోగపడింది. నటనపరంగా ఏం చేయాలో.. ఏం చేయకూడదో అనే విషయాలను ఆయన నాకు బాగా చెప్పారు. ఆ విషయాలు బాగా ఉపయోగపడ్డాయి ఆశీష్ రెడ్డి వెల్లడించారు.

ప్రతీ రోజు సీన్ పేపర్లు తీసుకొని..
రౌడీ బాయ్స్ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత ముందు రోజే సీన్ పేపర్లు తీసుకొని ప్రిపేర్ అయి సెట్‌కు వెళ్లేవాడిని. ప్రతీ రోజు సీన్లు బాగా ప్రిపేర్ అవ్వడంతో నాకు పెద్దగా కష్టం అవ్వలేదు. నాకు సొంత బ్యానర్ అని రిలాక్స్‌గా లేను. ఎవరి బ్యానరైనా సినిమా బాగా ఆడాలని కోరుకొంటాను. నా తొలి సినిమా అయినా అందరి మాదిరిగానే కష్టపడ్డాను. ప్రేక్షకుల తీర్పు కోసం వేచి చూస్తున్నాను అని ఆశీష్ రెడ్డి తెలిపారు.

ప్రేక్షకుల మెప్పు పొందేందుకు
నాకు ఫలానా జోనర్ సినిమాలు చేయాలనే ఫిక్స్ కాలేదు. సినిమా రిలీజ్ తర్వాత వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను బట్టి నేను ఎలాంటి సినిమాలు చేయాలనేది నిర్ణయించుకొంటాను. ముందు సినిమా ఇండస్ట్రీ వర్గాలను, ప్రేక్షకుల మనసు దోచుకొనే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాతే నేను ఎలాంటి పాత్రలు చేస్తే ప్రేక్షకులు మెచ్చుకొంటారనే కోణంలో ఆలోచిస్తాను అని ఆశిష్ రెడ్డి చెప్పారు.

రౌడీ బాయ్స్ తర్వాత సెల్ఫీష్ సినిమాతో
రౌడీ బాయ్స్ సినిమా తర్వాత నేను సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఈ సినిమా సుకుమార్ రైటింగ్ బ్యానర్, శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. ఈ సినిమాకు సుకుమార్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. రౌడీ బాయ్ సినిమా తర్వాత సెల్ఫీష్ సినిమా గురించి ప్రమోషన్స్ ప్రారంభిస్తాం. కోవిడ్ పరిస్థితులను బేరిజు వేసుకొని సెల్ఫీష్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని ఆశీష్ రెడ్డి తెలిపారు.


Click it and Unblock the Notifications











