‘పవన్ కల్యాణ్‌తో నా డ్రీమ్ ప్రాజెక్ట్.. దాని కోసమే ఎదురు చూస్తున్నా..’
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ మూవీ మే 31వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు, రచయిత కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడుతూ..
దర్శకుడిగా రెండు సినిమాలు చేసిన తర్వాత కొన్ని ప్రాజెక్టులు అనుకొన్నాం. కానీ అవి ముందుకు సాగడంలో కొన్ని సమస్యలు రావడంతో ప్రారంభం కావడం ఆలస్యమైంది. అప్పుడు గ్యాప్ ఎక్కువైపోయిందనే భయం నాలో మొదలై.. త్రివిక్రమ్ గారితో షేర్ చేసుకొన్నాను. ఆయన సూచించడంతో విశ్వక్ సేన్ కథ చెప్పడం.. ఆయన అంగీకరించడంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ జర్నీ మొదలైంది.

గోదావరి ప్రాంతమంటే పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు అనే ఇంప్రెషన్ కలుగుతుంది. కానీ అలాంటి సుందర ప్రాంతంలో కూడా నేరాలు, ఘోరాలు చోటుచేసుకొంటాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనషుల మనస్తత్వాలు బట్టి నేరాలు జరుగుతుంటాయి అనే పాయింట్ నుంచి పుట్టిన కథ. ఈ మూవీ కథ కల్పితమే. కానీ ఎమోషన్స్ దట్టించాం. ఇది గ్యాంగ్‌స్టర్ మూవీ అని అందరు అనుకొంటారు. కానీ అలాంటి కథ కాదు అని కృష్ణ చైతన్య అన్నాడు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయనే విషయం తప్పు. సెన్సార్ వాళ్లు మా సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారంటే.. కుటుంబమంతా కలిసి చూసే సినిమా. కొన్ని చోట్ల డైలాగ్స్ మ్యూట్ చేశారు. ట్రైలర్‌లో కనిపించిన రెండు డైలాగ్స్.. సినిమాలో కనిపించవు. సీన్లలో ఎమోషన్స్ ఎలివేట్ చేయడానికి ట్రైలర్‌లో ఆ డైలాగ్స్ ఉంచాం అని దర్శకుడు చెప్పారు.
ఈ సినిమాకు మ్యూజిక్ అత్యంత ప్రాధాన్యం. అందుకే యువన్ శంకర్ రాజాను ఎంచుకొన్నాం. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్‌తో పనిచేయాల్సి వచ్చినప్పుడు ముందుగా భయపడ్డాను. కానీ తన అనుభవంతో.. నేను కోరుకొన్నట్టుగా సంగీతాన్ని అందించారు. చాలా సీన్లను ఆయన మరో రేంజ్‌కు తీసుకెళ్లారు అని కృష్ణ చైతన్య తెలిపాడు.

నాకు ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలనే కోరిక ఉంది. ఆ ప్రాజెక్టును పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో చేయాలన్నది నా కోరిక. ఆయనంటే నాకు చెప్పలేని అభిమానం. ఆ అభిమానాన్ని మాటల్లో చెప్పలేనిది. పవన్‌తో సివనిమా చేసే అవకాశం రావాలని కోరుకొంటాను అని కృష్ణ చైతన్య తెలిపాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. నిర్మాతలు చినబాబు, నాగవంశీ ఇచ్చిన సహకారం మరువలేనిది. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











