నా జీవితంలో జరిగిన సంఘటనలు బోల్డ్‌గా చెబుతా.. అందుకే వెబ్ సిరీస్ ప్లాన్ చేశా.. జగపతిబాబు (ఇంటర్వ్యూ)
మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ రామబాణం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తున్నది.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. మే 5న రామబాణం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరో జగపతి బాబు తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

ఒకప్పుడు డబ్బుల కోసం వేషాలు: ఇటీవల కాలంలో నేను నటించే సినిమాలు తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు డబ్బుల కోసం వేషాలు వేశాను. అయితే నాకంటూ ఒక వ్యాల్యూ ఉండాలి. కానీ ప్రస్తుతం మంచి సినిమాలు, మంచి పాత్రలు చేయాలని అనుకొంటున్నాను. నా జీవితంలో 10 సంవత్సరాలు అద్బుతంగా ఉండాలని కోరుకొంటున్నాను. ఆ పది సంవత్సరాల్లో నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేశాను. మంచి చేశాను అని అనుకోవాలి అని జగపతిబాబు తెలిపారు.

బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు: సల్మాన్ ఖాన్‌తో కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ సినిమా చేసిన తర్వాత బాలీవుడ్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడి వాళ్లకు నా వ్యాల్యూ తెలియదు కదా.
అక్కడి వాళ్లు ఇక్కడ చేస్తున్నారు.ఇక్కడి వాళ్లు అక్కడ చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని పెద్ద సినిమాలు చేస్తున్నాను. కొన్ని పెద్ద సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. అందుకే నా సినిమాలు కాస్త లేటుగా వస్తున్నాయి అని జగపతి బాబు చెప్పారు.

నా జీవితంలో జరిగిన సంఘటనలు: సముద్రం అనే వెబ్ సిరిస్ ప్లాన్ చేశాం. నా జీవితంలో జరిగిన సంఘటనలను బోల్డ్‌గా చెప్పాలనుకొన్నాను. నిజాలే చెప్పాలని డిసైడ్ అయ్యాను. నిజాలు చెప్పడం ద్వారా కొందరికి స్పూర్తి ఇవ్వాలనుకొంటున్నాను. నా జీవితంలో జరిగిన సంఘటనలకు కొందరికి పాఠాలుగా మారుతాయని భావిస్తున్నా.
చాలా మెటిరియల్ షూట్ చేశాం. కానీ మేము అనుకున్నట్లు రాలేదు. దీంతో 12 గంటల ఫుటేజ్‌ను నా లైబ్రరీ లోనే ఉంచేశాను. అలాంటి కంటెంట్ తీసే సెన్స్బిలిటీ వున్న దర్శకుడు దొరికినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను అని జగపతి బాబు చెప్పారు.

చిన్న సినిమాలు ఉండవు: చిన్న సినిమాలు, యవ దర్శకులు మిమ్మల్ని అప్రోచ్ అవ్వొచ్చు. నా దృష్టిలో చిన్న సినిమా అనేది ఉండదు. సినిమా హిట్ అయితే పెద్ద సినిమా అవుతుంది. కలర్ ఫోటో, కేరాఫ్ కంచరపాలెం,బలగం సినిమాలు చూశాను. నాకు చాలా బాగా నచ్చాయి. అందులో నేను లేను అనే బాధ కూడా ఉంది. అయితే నేను చిన్న సినిమాలు చేయను, వారికి అందనని ఫిక్స్ అయిపోయారు. రెండూ తప్పే. నాకు డబ్బు ప్రాధాన్యత కాదు. పాత్ర, సినిమా ముఖ్యం. నాకు రెమ్యునరేషన్ కంటే ప్యాషన్ ముఖ్యం అని జగపతి బాబు అన్నారు.


Click it and Unblock the Notifications











