అందుకే చిరంజీవి, రాంచరణ్‌తో సినిమా తీయడం లేదు.. కొదమ సింహం నిర్మాత క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి కౌబాయ్ పాత్రలో నటించిన చిత్రం కొదమసింహం. రమా ఫిలింస్ బ్యానర్‌పై కైకాల నాగేశ్వరరావు నిర్మాతగా కే మురళీ మోహన్ రావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించింది. అందాల భామలు రాధ, సోనమ్, వాణి విశ్వనాథ్, బాలీవుడ్ నటుడు ప్రాణ్ చోప్రా, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, టైగర్ ప్రభాకరన్, సుధాకర్, ప్రఖ్యాత హాస్య నటుడు అల్లు రామలింగయ్య, బ్రహ్మనందం, గొల్లపూడి మారుతీరావు, చలపతిరావు, వైవిజయ ప్రధాన పాత్రల్లో నటించారు.
సాంకేతిక విభాగాల నిపుణుల విషయానికి వస్తే.. కేఎస్ హరి సినిమాటోగ్రఫి, నాగేశ్వరరావు, సత్యనారాయణ ఎడిటింగ్ బాధ్యతలు, రాజ్ కోటి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పంపిణీ చేసింది. 1990 ఆగస్టు 9వ తేదీన రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమాను మరోసారి 4K, డాల్బీ టెక్నాలజీతో రీ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ సందర్బంగా నిర్మాత కైకాల నాగేశ్వరరావు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని, కొదమ సింహం సినిమా నిర్మాణం వెనుక విశేషాలను వెల్లడిస్తూ..

రమా ఫిలింస్ బ్యానర్‌పై చిరంజీవితో చిరంజీవి అనే సినిమా చేశాం. అప్పటికే హీరోగా పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అయితే ఆ సినిమాలో ఆయనది నెగిటివ్ రోల్. అయితే ఆయన ఇమేజ్‌కు భిన్నంగా ఉండటంతో సరిగా ఆడలేదు. కానీ మాకు లాభాలు వచ్చాయి. కానీ సంతృప్తిని ఇవ్వలేదు. అయితే చిరంజీవితో కౌబాయ్ సినిమా చేయాలని ప్రపోజల్ పెట్టినప్పుడు.. ఆ మాటే చెప్పాం. మీతో సినిమా చేసి డబ్బులు సంపాదించాం. కానీ మీతో మంచి సినిమా చేయలేదనే అసంతృప్తి ఉంది. ఈసారి సంతృప్తిని కలిగించే సినిమాను చేయాలని ఉందని చెప్పాం. అయితే ఆయన డబ్బు బాగా ఖర్చు అవుతుంది. జాగ్రత్తగా ప్రాజెక్టును డీల్ చేయండి అని సలహా ఇచ్చారు అని కైకాల నాగేశ్వరరావు చెప్పారు.
రాంచరణ్‌కు కొదమ సింహం సినిమా అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఈ సినిమా చూసి ఆయన గుర్రపు స్వారీ నేర్చుకొన్నారు. చిన్నప్పుడు ఈ సినిమాను చాలాసార్లు చూసే వారట. భోజనం చేసేటప్పుడు కొదమ సింహం సినిమా పెడితేనే అన్నం తినేవాడనే విషయాన్ని స్వయంగా చెప్పుకొన్నారు అనే విషయాన్ని ఆయన వెల్లడించారు.
చిరంజీవి, రాంచరణ్‌తో సినిమా చేయాలని ఉంటుంది. కానీ ప్రస్తుతం సినీ నిర్మాణం చాలా కష్టంగా మారింది. మేము ఒకప్పుడు చాలా డిసిప్లిన్‌తో మూవీ చేసే వాళ్లం. ఇప్పుడు ఆ డిసిప్లేన్ లేదు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులకు మేము అలవాటు పడలేం. ఇప్పడు ఉన్న డిసిప్లేన్ మాకు సూట్ కాదు. అందుకే సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నాం. ఒకవేళ మాకు తగినట్టు పరిస్థితులు వస్తే.. మళ్లీ వారితో సినిమా చేసే విషయాన్ని ఆలోచిస్తాం అని ఆయన అన్నారు.
సినిమా పరిశ్రమలో నిర్మాతకు ఒకప్పుడు గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఆ గౌరవం కనిపించడం లేదు. ఇండస్ట్రీలో నిర్మాత అంటే క్యాషియర్ అనే మాట వినిపిస్తున్నది. డబ్బు ఇచ్చి వెళ్లు.. మేము సినిమా తీసి పెడుతాం అనే ధోరణి ఉంది. అలాంటి పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం. నిర్మాత ఇన్వాల్వ్‌మెంట్ ఉంటేనే ప్రాజెక్ట్ బాగుంటుంది. ఒకప్పడు చక్రపాణి, నాగిరెడ్డి లాంటి వాళ్లు నిర్మాతలుగా గొప్ప సినిమాలు అందించారనే విషయాన్ని కే నాగేశ్వరరావు తెలిపారు.


Click it and Unblock the Notifications











