బాలకృష్ణ వల్ల ఏడ్చాను.. ఆ సినిమాతో జీవితం తారుమారు.. లయ (ఇంటర్వ్యూ)
తన నవ్వుతో కొన్నేళ్ల పాటు యువతకు నిద్రలేకుండా చేశారు లయ. క్లాసికల్ డ్యాన్సర్ అయిన లయ తన సహజ నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. సడెన్‌గా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ తిరిగి రీ ఎంట్రీలో సత్తా చాటాలని సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న తమ్ముడు చిత్రంలో లయ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వార్తాసంస్థ ఎన్టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజిక్ ఇంటర్వ్యూలో లయ తన కెరీర్, పెళ్లి, పిల్లలు, సెకండ్ ఇన్నింగ్స్ తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
మా అమ్మని చూసి నేర్చుకున్నా
'మాతృత్వపు భావన మనం అనుభవిస్తేనే కానీ తెలియదు. మా అమ్మను చూసి నేర్చుకున్న ఎన్నో విషయాలు, నాకు ఉపయోగపడుతున్నాయి. పిల్లల్ని పెంచడం, ప్రయోజకుల్ని చేయడం పెద్ద రెస్పాన్సిబిలిటీ. పిల్లలతో ఎక్కువసేపు గడిపే అవకాశం దక్కింది. వాళ్లకు చిన్నప్పుడే అన్ని పనులు నేర్పించడం వల్ల వారు స్వతంత్రంగా బతకడం నేర్చుకుంటారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా నా పిల్లలు నాకెంతో అండగా నిలిచారు. మా అమ్మ ఏదో సాధించడానికి వెళ్లింది మనం సపోర్ట్ చేద్దాం అనే మెంటాలిటీ' అని లయ తన పిల్లలు, కుటుంబం గురించి పంచుకున్నారు.

నా కూతురు 16 ఏళ్లకే బాధ్యతలు తీసుకుంది
'నా కూతురుకు 16 ఏళ్లే తను కార్ డ్రైవింగ్ నేర్చుకుని తమ్ముడిని స్కూల్‌లో దించేసి, తను కాలేజీకి వెళ్లి మళ్లీ వచ్చేటప్పుపడు తమ్ముడిని పిక్ చేసుకుని ఇంటికి వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు వెంటనే అందుకోవాలి, మనకి కావాలి అన్నప్పుడు అది దొరకదు. ఇలా సినిమాలలో అవకాశం వచ్చిందని తెలియగానే భర్త, పిల్లలతో కలిసి డిస్కస్ చేశాం. నువ్వు ఐటీలో పనిచేశావ్, జీఈలో పనిచేశావ్, యాపిల్‌లో పనిచేశావ్.. ఆల్రెడీ నువ్వు నటివే కాబట్టి నీకు ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోవద్దని నా భర్త యాంకరేజ్ చేశారు. ఇండియా - యూఎస్ మధ్య తిరిగాల్సి వస్తుందని తెలిసినా ఆయన ఒప్పుకున్నారు' అని లయ తెలిపారు.
విడాకులు, ఆర్ధిక పరిస్ధితిపై
'నా భర్త ఓ దేశంలో, నేనొక చోట ఉంటున్నాం కాబట్టి విడాకుల గురించి గాసిప్స్ స్పెడ్ చేస్తున్నారు. లయకి డబ్బులు లేక తిరిగి నటించడానికి ఇండియాకు వచ్చిందని ఇష్టమొచ్చినట్లు రాసేస్తున్నారు. పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి గాసిప్స్ వల్ల ఇబ్బంది పడ్డ వాళ్లే, ఎవరూ తప్పించుకున్నది లేదు. నేను ఎవరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మా నాన్న గారు, నా భర్త, మామగారు, ఆడపడుచు ఇలా మా ఫ్యామిలీ నిండా డాక్టర్సే. వేలకోట్లు లేకపోయుండొచ్చు కానీ ఆర్ధికంగా బాగా స్ధిరపడిన కుటుంబం. నేనేమీ గోల్డెన్ స్పూన్‌తో పుట్టలేదు, కష్టపడి సంపాదించుకున్నాం. నా భర్తకు అమెరికాలో క్లినిక్స్ ఉన్నాయి, మనం రిచ్ అనుకుంటే మనకంటే రిచ్ వాళ్లుంటారు. మేం ఏ ప్లేస్‌లో ఉన్నామో నాకు తెలియదు. జెట్‌లు, ఫ్లైట్లు కొనుక్కోలేకపోవచ్చు కానీ మిగిలినది ఏం కావాలన్నా కొనుక్కోగలను' అని విడాకులపై లయ స్పందించారు.
బీటెక్ మధ్యలోనే వదిలేశా
'రెమ్యునరేషన్ కూడా ముఖ్యమే కానీ నేను దాని కోసమే అమెరికా నుంచి రాలేదు. మంచి స్టోరీ చేయాలనే ఇక్కడి వరకు వచ్చాను. సెలెక్టీవ్‌గా సినిమాలు చేయాలనుకున్నాను కానీ, ఏది పడితే అది చేయడానికి నేను రాలేదు. మనోహరం సినిమా టైంలో గుణశేఖర్ గారు హోంవర్క్ ఇచ్చేవారు. నెక్ట్స్ టైం ఏం చేయాలనే దానిపై ముందే చెప్పేవారు. సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే విజయవాడకు వెళ్లి అక్కడ ప్రాక్టీస్ చేసి వచ్చేదాన్ని. ఆ సినిమా కోసం స్కూటర్ తోలడం నేర్చుకున్నా.. ఇప్పుడు గేర్ బైక్ కూడా డ్రైవ్ చేయడం నేర్చుకుంటున్నా. మనోహరం సినిమా సమయంలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. బీటెక్ పూర్తి చేయలేక ఎంసీఏ చదివాను. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్నల్‌కి వెళ్లాలని దర్శక నిర్మాతలని అడిగితే ఈ అమ్మాయి ఎక్కడ దొరికిందిరా బాబూ అని విసుక్కునేవాళ్లు. అయినప్పటికీ కొన్నిసార్లు నన్ను పరీక్షలకు పంపించేవాళ్లు' అని తొలిరోజులను లయ గుర్తుచేసుకున్నారు.

ర్యాగింగ్ బాధితురాలినే
'నటీనటుల నటన గురించి మాట్లాడితే బాగుంటుంది. పర్సనల్ లైఫ్ గురించి తెలిసి మాట్లాడితే ఓకే, తెలియకుండా సోషల్ మీడియాలో ఏం పెడతారు. అంటే వాళ్లు వెదవల కిందే లెక్క. పెద్దపెద్ద ఆర్టిస్టుల గురించి ఏం తెలుసని వీళ్లంతా కామెంట్స్ పెడుతున్నారు. కాలేజీలో నన్ను ర్యాగింగ్ చేసేవారు, కానీ వాళ్లెవరూ ఒక్కలైన్ క్రాస్ చేయలేదు. వాళ్లు ఏం చేసినా సార్ సార్ అనేదానిని దాంతో సీనియర్స్ కూడా చాలా బాగుండేవారు. సినిమా రిలీజై పెద్ద హిట్ అయిన తర్వాత నన్ను ఎగతాళి చేసినవాళ్లు కూడా మారిపోయి లయ మా ఫ్రెండ్ అని చెప్పుకునేవారు. నాకు రెస్పెక్ట్ కావాలి, మంచి నటిగా గుర్తింపు కావాలి అందుకే చాలా కష్టపడ్డా' అని కాలేజ్ రోజులను లయ గుర్తుచేసుకున్నారు.

హీరోయిన్లను బలి చేయొద్దు
'ప్రేమించు సినిమాకు చాలా మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఇలాంటి సినిమా కోసం అంతా చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు .చిన్న క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ అన్న తేడా లేకుండా సీరియస్‌గా తీసుకుంటున్నారు. లుక్ టెస్ట్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ ఇలా అన్నింటిపై శ్రద్ధ పెడుతున్నారు. గతంలో లాగా 123 కాకుండా డైలాగ్స్ నేర్చుకునే చెబుతున్నారు. ఇప్పుడు వీళ్లు పడుతున్న కష్టం నేను పడలేదు. ప్రేమించు సినిమా ప్రతి వారం ఏదో ఒక ఛానెల్‌లో వచ్చేది. అది చూసినప్పుడల్లా ఇంకొంచెం బాగా చేయొచ్చు అనిపించేది. ప్రేమించు సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. నా పీఆర్ సర్కిల్స్ బాలేకనే పెద్ద హీరోల సినిమాలలో ఛాన్స్ రాకపోయుండొచ్చు. బాలకృష్ణ గారి సినిమా వచ్చింది బాగానే చేశా, కానీ హిట్ అయ్యుంటే నా కెరీర్ మరోలా ఉండేది. కొందరు హీరోయిన్లని గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తున్నారు.. సినిమా రిజల్ట్ వారి చేతుల్లో ఉండదు' అని లయ స్పష్టం చేశారు.
బాలయ్య అంటే క్రమశిక్షణ
'విజయేంద్ర వర్మ సినిమాలో ఓ స్టెప్ దగ్గర బాలకృష్ణ కాలు తొక్కేశా, అది కూడా ప్రాక్టీస్‌లోనే. తప్పు తెలుసుకున్న నేను భయపడిపోయి సారీ చెబుతూనే ఉన్నా. దానికి బాలయ్య చాలా సీరియస్‌గా నా కాలే తొక్కుతావా? ప్యాకప్ అసలు ఈ అమ్మాయిని తీసేయమన్నారు. నేను నిజంగానే తీసేస్తారని భయపడిపోయా, నేను ఆయన పక్కనే కూర్చొని నా తప్పు లేదని చెబుతూ ఏడుస్తూనే ఉన్నా. దానికి బాలయ్య టెన్షన్ పడిపోయి ఇది నిజం కాదని సరదాగా జోక్ చేశానని చెప్పారు. ఆ రోజు షూటింగ్ ఫస్ట్ డే కావడంతో బాగా భయపడిపోయా. నన్ను సార్ సార్ అనొద్దు.. బాలయ్య అని పిలువు అని చెప్పేవారు. బాలకృష్ణ గారు అందరితో చాలా సరదాగా ఉంటారు, ఎక్కడ కనిపించినా ఎలా ఉన్నావ్ అమ్మా అని అడుగుతారు. ఎన్టీఆర్ దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ, నిజాయితీని బాలయ్య మా అందరికీ అలవాటు చేశారు. ఇప్పటికీ అది ఫాలో అవుతూనే ఉన్నా.. సెట్స్‌లో అందరి కంటే ముందు నేనే ఉంటానని బాలకృష్ణ గురించి చెప్పారు.


Click it and Unblock the Notifications











