ఆ తప్పు జరిగితే సూపర్ స్టార్ కృష్ణ క్షమించరు.. పవిత్రా లోకేష్, నరేష్ బంధం అలాంటిదే.. ఎంఎస్ రాజు (ఇంటర్వ్యూ)
ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు రూపొందించిన చిత్రం మళ్లీ పెళ్లి. వీకే నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం కావడంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రం వారి నిజ జీవిత కథనా? ఊహాజనితమైన కథనా అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ కూడా అలాంటి అనుమానాలనే కలిగించాయి. అలాంటి నేపథ్యంలో మే 26వ తేదీన రిలీజ్ అవుతున్న సందర్భంగా ఎంఎస్ రాజు మీడియాతో మాట్లాడుతూ..
ప్రేక్షకులను చీట్ చేయం: మళ్లీ పెళ్లి సినిమా ఒక సెన్సేషనల్ పాయింట్‌తో చేశాం. ప్రస్తుతం ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. వీకే నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి నిజమా? వారి జీవితం గురించి చెబుతున్నారా? అనే ప్రశ్నలు మీడియాలోను, బయటకు వెళ్లినప్పుడు అడుగుతున్నారు. అయితే వారందరికి సినిమా చూడండి మీకే తెలుస్తుంది. కానీ ఈ సినిమాతో ప్రేక్షకులను చీట్ చేయడం లేదు. అది రిలీజ్ తర్వాత మీరే చెబుతారు అని ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు చెప్పారు.

ఆ డిస్కషన్‌తో పుట్టిన కథ: మళ్లీ పెళ్లి చిత్రం ఏ జోనర్‌లో తీశామంటే సమాధానం నా వద్ద లేదు. ఈ సినిమా గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. కానీ ఇది కాలక్షేపం కోసం తీసిన సినిమా కాదు. కాలక్షేపం ఉంటుంది. కానీ అదే మొత్తం కాదు. నా జీవితంలో నేను చాలా కష్టపడి రాసిన చిత్రం మళ్లీ పెళ్లి. విజయ కృష్ణా బ్యానర్‌ను మళ్లీ లాంచ్ చేయాలని వీకే నరేష్ నాతో షేర్ చేసుకొన్నారు. అలా మా మధ్య జరిగిన డిస్కషన్ వల్ల పుట్టిన కథనే మళ్లీ పెళ్లి అని ఎంఎస్ రాజు తెలిపారు.
సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులు: సూపర్ స్టార్ కృష్ణ బతికి ఉన్నప్పుడే మళ్లీ పెళ్లి కథను ఆయనకు చెప్పాం. ఆయన కథ విన్నప్పుడే బాగుంది. జాగ్రత్తగా ఈ కథను హ్యాండిల్ చేయమని చెప్పారు. ఈ సినిమాకు ఆయన బెస్ట్ విషెస్ ఉన్నాయి. మళ్లీ పెళ్లి నేను రాసుకొన్న కథనా? లేదా పవిత్ర లోకేష్, వీకే నరేష్ కథనా అని చెప్పే సాహసం నేను చేయను. రిలీజ్ తర్వాత మీకే ఆ కథ ఏమిటో తెలుస్తుంది. ఈ కథలో సెన్సేషన్ ఉంది. ఇది ఆషామాషి సినిమా కాదు. కృష్ణ గారు పై నుంచి చూస్తుంటారు. మేము తప్పు చేస్తే ఆయన క్షమించరు అని ఎంఎస్ రాజు అన్నారు.

బోర్ కొట్టకుండా తీశాం: మళ్లీ పెళ్లి టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత పవిత్ర లోకేష్, నరేష్ కథ అనుకోవడం సహజం. అయితే చిలకా గోరింకల్లా ఉండే వారి కథే ఈ సినిమా అనుకొంటే అది ఒక భ్రమనే. స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా తీశాం. అన్ని వర్గాలకు నచ్చే విధంగా సినిమాను తీశాం. ఈ సినిమా ఫన్, మంచి మ్యూజిక్, ఎమోషన్స్ ఉంటాయి అని ఎంఎస్ రాజు చెప్పారు.
మళ్లీ పెళ్లి కథలో ట్విస్టులు: కన్నడ స్టార్, తెలుగు స్టార్‌కు మధ్య ఉండే మిడిల్ ఏజ్ జీవితం చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. అలాంటి కథనే అందర్ని ఆకర్షించేలా చేసింది. ఒక భార్య, భర్త ఇంట్లో ఇమిడిపోవడానికి కష్టపడితే పరిస్థితులు ఏమిటి అనే ప్రశ్న వెంటాడుతుంది. ప్రస్తుత సమాజంలో ఫ్యామిలీ కోర్టుల సంఖ్య పెరుగుతుందంటే.. చాలా సమస్యలు జీవితాల్లో ఉన్నాయని అర్ధం. మీరు ఊహించని ట్విస్టులు ఈ కథలో ఉంటాయి. అవి నిజమా? అబద్దామా అని మీరే డిసైడ్ చేసుకోవాలి అని ఎంఎస్ రాజు తెలిపారు.

చాలా ఎమోషనల్‌గా చెప్పాం: సూపర్ స్టార్ కృష్ణకు కనెక్ట్ అయిన కథ మళ్లీ పెళ్లి. ఆయన కథ ఎలా వచ్చిందని అడిగే వారు. ఆయన మాటలను దృష్టిలో పెట్టుకొని నేను చాలా భయంతో ఈ సినిమా చేశాను. నేటి సమాజంలో జరుగుతున్న సమస్యను కథగా తీసుకొన్నాం. మారిన పరిస్థితుల కారణంగా భార్యభర్తలు ఇద్దరు ఒక ఇంటిలో కలిసి ఉండటం ఇబ్బందిగా మారింది. అలాంటి కథను ఎమోషనల్‌గా చెప్పాం అని ఎంఎస్ రాజు తెలిపారు.
వారిద్దరి బంధం ఎలాంటిదే..: పవిత్ర లోకేష్, నరేష్ మధ్య లైంగిక సంబంధంలో ఉండే ఆకర్షణ లేదు. మధ్య వయసులో ఒంటరిగా ఉండే వ్యక్తులు కలిసి ఉండాలనే కోరికతో ఏర్పడే బంధమే వారి మధ్య ఉంది. ఒకప్పుడు కృష్ణ, విజయ నిర్మల మ్యారేజ్ కూడా చాలా సెన్సేషనల్. అప్పుడు మీడియా ఇంత లేదు కాబట్టి.. అంతా సెన్సేషనల్ కాలేదు. వారిద్దరు కలిసి చేసిన సినిమాలు కూడా చాలా బోల్డ్‌గా ఉండేవి అని ఎంఎస్ రాజు చెప్పారు.


Click it and Unblock the Notifications











