Kalyani Malik Interview.. హిట్లు ఇచ్చినా అవకాశాలు రావడం లేదు.. ‘PAPA’ తర్వాత కెరీర్ గ్రాఫ్ ఎలా ఉందంటే?
యువ హీరో, హీరోయిన్లు నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి (PAPA) చిత్రం విడుదలకు ముస్తాబువుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, పాటలు ప్రేక్షకులను, సినీ అభిమానులను ఆకట్టుకొంటున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 17వ తేదీన రిలీజవుతున్న ఈ సినిమాలోని కనుల చాటు మేఘమా? పాటలు ట్రెండింగ్ అవుతున్ననేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...

చెక్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నా
నా కెరీర్‌లో సక్సెస్, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నా సంగీతం అందించిన చెక్ సినిమాపై నాకు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ చెక్ సినిమా సరిగా ఆడకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కోవిడ్ 19 ప్రభావం వల్ల నేను ఎక్కువగా వర్క్ చేయలేకపోయాను. ప్రస్తుతం ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి సినిమాతోపాటు, ఇంటింటి రామాయణం,విద్యావాసులం, మరో రెండు వెబ్ సిరీస్‌ల కోసం పనిచేస్తున్నాను అని కల్యాణి మాలిక్ చెప్పారు.

కనుల చాటు మేఘమా పాట
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా నుంచి ఇటీవల రిలీజైన కనుల చాటు మేఘమా పాట అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఈ పాటపై అందరి నుంచి వస్తున్న రెస్పాన్స్ చేసి చాలా సంతోషంగా ఉంది. స్వార్షం లేని ప్రేమ ఈ పాటకు స్పూర్తి. కనుల చాటు మేఘమా పాట ఇంత హిట్ కావడానికి కారణం దర్శకులు అవసరాల శ్రీనివాస్. సినిమా రిలీజ్‌కు ముందే మంచి పేరు రావడం చాలా హ్యాపీగా ఉంది అని కల్యాణి మాలిక్ అన్నారు.

20 ఏళ్లలో 19 సినిమాలు మాత్రమే..
గతంలో కూడా నేను చాలా మంచి పాటలు ఇచ్చాను. కానీ సక్సెస్‌ఫుల్ ఆల్బమ్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఎందుకు అవకాశాలు రాలేదంటే నా దగ్గర సమాధానం లేదు. నా ప్లాన్ ప్రకారం నా కెరీర్ ముందుకు సాగలేదు. అయితే నేను నిరుత్సాహానికి గురికాకుండా మంచి మ్యూజిక్ ఇచ్చేందుకే ప్రయత్నించాను. నేను సంగీత ప్రియులను, దర్శకులను సంతృప్తి పరచడానికే పనిచేస్తాను. మిగితా విషయాలు నేను ఆలోచించను. ఏప్రిల్ 2023 కి నా కెరీర్ 20 ఏళ్లు పూర్తవుతుంది. కేవలం 19 సినిమాలు మాత్రమే చేశాను. నా జీవితంలో చాలా ఎత్తు పల్లాలు ఉన్నాయి. చాలా సినిమాల్లో నా పాటలకు మంచి ప్రశంసలు లభించాయి. మీడియా ఎప్పుడూ నాకు సపోర్టుగా నిలిచింది అందుకు ధన్యవాదాలు అని కల్యాణి మాలిక్ అన్నారు.

లాబీయింగ్ చేయడం తప్పుకాదు..
హీరోలు, నిర్మాతలు, దర్శకులతో లాబీయింగ్ చేయడం ద్వారా అవకాశాలు లభిస్తున్నాయి అంటే దానిపై నేను కామెంట్ చేయను. లాబీయింగ్ చేయడానికి నేను ఇష్టపడను. నా కెరీర్ ఆరంభంలో చాలా దూకుడుగా ఉండేవాడిని. అలాగని నేను నిర్మాతలు, దర్శకులతో టచ్‌లో లేకుండా లేను. అయితే నన్ను తీసుకుపోవడానికి, అవకాశాలు ఇవ్వకపోవడానికి ఎవరి రీజన్స్ వారికి ఉన్నాయి. నేను దానిని తప్పుపట్టను. లాబీయింగ్ చేయడం వల్ల అవకాశాలు రావొచ్చు.. రాకపోవచ్చు అని కల్యాణి మాలిక్ చెప్పారు.

అవసరాలతో పనిచేయడం గురించి
దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌తో పనిచేయడం ఎప్పుడూ కొత్త అనుభూతి ఉంటుంది. వాస్తవానికి తొలుత ఈ సినిమాకు నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదు. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు. ఆయన ఒక పాటను కంపోజ్ చేశారు. ఆ పాటను లండన్‌లో షూట్ చేశారు. ఆతర్వాత వివేక్ సాగర్ స్థానంలో నన్ను తీసుకొన్నారు. ఆయన స్థానంలో నన్ను తీసుకోవడానికి కారణాలు తెలియదు. కానీ ఈ సినిమాకు పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని కల్యాణి మాలిక్ అన్నారు.

దర్శకుడి విజన్ 99 శాతం
ఏ సినిమాకైనా ప్రేక్షకులపై ప్రభావం చూపే సంగీతం రావడానికి దర్శకుడి పాత్ర 99 శాతం ఉంటుంది. దర్శకుడి విజన్ కారణంగానే మంచి అవుట్‌పుట్ వస్తుంది. ఈ సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది. ఈ సినిమా పాటలకు జాతీయ అవార్డు రావాలని అనుకొంటున్నాను అని కల్యాణి మాలిక్ చెప్పారు.


Click it and Unblock the Notifications











