ఆరెంజ్ తర్వాత పీకల్లోతు కష్టాలు.. అన్నయ్య, పవన్ ఆదుకొన్నారు.. అరవింద్ వల్లే.. నాగబాబు
అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మాతగా నాగబాబు ఎన్నో మంచి చిత్రాలను నిర్మించారు. అరెంజ్ దారుణంగా ఫ్లాప్ కావడంతో నిర్మాతగా ఆయన కుదేలయ్యారు. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఆ తర్వాత సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నారు. నటుడి, యాంకర్‌గా బిజీగా మారిన నాగబాబు ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రంలో ఓ నిర్మాతగా భాగస్వామ్యమయ్యారు. ఈ నేపథ్యంలో నాగబాబు తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. నాగబాబు చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
Recommended Video


ఆరెంజ్ ఫెయిల్యూర్ తర్వాత
రాంచరణ్‌తో తీసిన ఆరెంజ్ సినిమా తర్వాత సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నాను. యాక్టింగ్, టీవీ సీరియల్స్, రియాలిటీ షోస్ చేయడం వల్ల నిర్మాతగా యాక్టివ్‌గా ఉండలేకపోయాను. మూడేళ్ల క్రితం బన్నీతో సినిమా చేయమని అల్లు అరవింద్ సూచించారు. కానీ మళ్లీ సినిమాలు చేయగలనా? అనే కాన్ఫిడెన్స్ నాలో కలిగింది. అపనమ్మకం ఉండటంతో తొలుత భయపడ్డాను. బన్నీ, అరవింద్ నాలో ధైర్యాన్ని నింపారు. వారి ప్రోత్సాహం వల్లనే లగడపాటి శ్రీధర్‌తో ఈ సినిమాను నిర్మించాను. నిర్మాతగా ఇకపై వరుసగా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.

ఆరెంజ్ తర్వాత తీవ్ర కష్టాలు
ఆరెంజ్ చిత్రం దారుణంగా ఫ్లాప్ కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న మాట నిజమే. ఆ సమయంలో అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌కల్యాణ్ ఆదుకున్నారు. అదే సమయంలో అరవింద్ మళ్లీ నటుడిగా బిజీ కావడానికి తోడ్పాటునందించారు. చాలా ఇబ్బందుల తర్వాత జీవితంలో మంచి స్థాయికి చేరుకున్నాననే ఫీలింగ్ ప్రస్తుతం ఉంది.

వరుణ్ విషయంలో జోక్యం తక్కువే
కెరీర్ విషయంలోనూ, చిత్రాల సెలెక్షన్‌లోనూ వరుణ్ తేజ్‌కు సలహాలు, సూచనలు ఇవ్వను. వరుణ్ కెరీర్ విషయంలో నా జోక్యం తక్కువే. కథల ఎంపికలో వాడి నిర్ణయమే ఫైనల్. చేసే సినిమాల గురించి చెబుతాడు. ఫిదా సినిమా చేసేటప్పుడు ఆ కథ గురించి నాకు చెప్పలేదు. భవిష్యత్తుకు సంబంధించి ఎవరి నిర్ణయాలు వారే తీసుకోవాలి. హీరోగా రాణించాలంటే బయటి నిర్మాతలందరితో పనిచేయాలన్నది నా కోరిక. ఆ తర్వాత మా బ్యానర్‌లో వరుణ్‌తేజ్‌తో సినిమాలు చేస్తాను.

నా పేరు సూర్యపై దుష్ట్రచారం
ఇండస్ట్రీలో కొన్ని వర్గాలు పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. నా పేరు సూర్య చిత్రాన్ని చూడటకుండానే బాగా లేదంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
సినిమా బాగా రాలేదని మా సినిమాపై కుట్రలు చేస్తున్నారు. అలాంటి ప్రచారం నన్ను, అల్లు అరవింద్‌తో పాటు మా అందరిని బాధించింది. అందుకే అరవింద్ అలా స్పందించారు.

మేమన్నా పెదరాయుళ్లమా?
టెలివిజన్ ఛానెళ్లను, ఇతర మీడియాపై నిషేదం విధిస్తామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. పరిశ్రమకు సంబంధించిన వారెవరూ అధికారికంగా ప్రకటన చేయలేదు. అలాంటి ప్లాన్ మాకు లేదు. మేము ఎవరిని బ్యాన్ చేయడం లేదు. మరొకరిని బహిష్కరించడానికి మేమేమైనా పెదరాయుళ్లమా అని నాగబాబు చమత్కరించారు.

నేను చేస్తున్న సినిమాలు
ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సైరా నరసింహారెడ్డిలో నటించడం లేదు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో విజయ్ దేవరకొండకు తండ్రిగా నటిస్తున్నాను. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో పది, పదిహేను నిమిషాలు ఉండే ఓ కీలక పాత్రను చేస్తున్నాను.


Click it and Unblock the Notifications











