The Ghost.. అలాంటి షాక్‌తో ప్రేక్షకులు బయటకు.. ఊహకు అందకుండా యాక్షన్.. నాగార్జున (ఇంటర్వ్యూ)
శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాణ సారథ్యంలో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ది ఘోస్ట్. దసరా కానుకగా ఈ సినిమా అన్ని హంగులతో అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా గురించి నాగార్జున అక్కినేని ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ..

ప్రవీణ్ సత్తారు కథ చెప్పిన విధానం
ది ఘోస్ట్ సినిమాలో దర్శకుడు కొత్తగా కథను చెప్పిన విధానం.. పాత్రను ప్రజెంట్ చేసిన తీరుతో నేను సినిమా చేయడానికి ఒప్పుకొన్నాను. ఫ్యామిలీ ఎమోషన్స్, సిస్టర్ సెంటిమెంట్ అంశాలు నన్ను బాగా ఆకట్టుకొన్నాయి. నా సిస్టర్ ఫ్యామిలీని టచ్ చేయానికి ప్రయత్నించడం.. వాటిని అడ్డుకోవడం లాంటి అంశాలు, యాక్షన్ తదితరల అంశాలు ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేస్తాయి. యాక్షన్, ఎమోషన్స్ బాగా మిక్స్ అవ్వడం కష్టం. కానీ ఘోస్ట్ విషయంలో అవన్నీ బాగా కుదిరాయిది ఘోస్ట్ కథనే కాకుండా.. నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా కొత్తగా ఉంటుంది. ఏ పాత్రకు ఎవరైతే బాగుంటారో. వారినే తీసుకొన్నాం. కొందరు కొత్త వారిని కూడా ఎంపిక చేసుకొన్నాం అని నాగార్జున అక్కినేని చెప్పారు.

గరుడవేగ తర్వాత యాక్షన్ మూవీతో
కొత్తగా ఉండే యాక్షన్ సినిమాను చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాను. గరుడువేగ సినిమా చూసిన తర్వాత ప్రవీణ్ సత్తారును అప్రోచ్ అయ్యాం. అయితే తాను చెప్పిన కథ నాకు నచ్చలేదు. ఏదైనా కొత్తగా ట్రై చేయమని చెప్పాను. కేవలం నన్ను, నా ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ది ఘోస్ట్ కథ రాశాడు. స్క్రీన్ ప్లే, నా ప్రజెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రవీణ్ సత్తారు చేసిన ప్రీ ప్రొడక్షన్ బాగా చేశాడు. అందుకే 65 రోజుల్లో సినిమాను కంప్లీట్ చేశారు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత రెండు నిమిషాలు ఒక షాక్‌లో ఉంటారు అని నాగార్జున అక్కినేని తెలిపారు.

యాక్షన్ సీన్లతో అలాంటి కిక్కు
ది ఘోస్ట్ సినిమాలో యాక్షన్ సీన్లు కొత్తగా ఉంటాయి. దాదాపు 12 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ సీన్లు చేస్తుంటే నాకు కష్టం అనిపించలేదు. కానీ ఓ కిక్ వచ్చింది. అందుకే సినిమా నాకు బాగా నచ్చింది. అందుకే పలుచోట్లకు వెళ్లి నేను ప్రమోషన్స్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఎన్నడూ చేయని విధంగా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాను. ది ఘోస్ట్ చిత్రం సక్సెస్ అయితే ప్రీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ సినిమా రిజల్ట్ తర్వాత ఫ్రాంచైజీలను ఆలోచిస్తాం అని నాగార్జున అక్కినేని తెలిపారు.

చిరంజీవి సినిమాతో పోటీ లేదు
టాలీవుడ్‌లో రెండు సినిమాలు ఒకే రోజున రావడం కొత్తేమీ కాదు అని గాడ్‌ఫాదర్ సినిమాతో పోటీపడటంపై నాగార్జున స్పందించారు. రెండు సినిమాలు రిలీజై రెండు భారీ విజయాలు అందుకొన్న విషయం తెలిసిందే. సినిమా బాగుంటే చూస్తున్నారు.. లేకుంటే రిజెక్ట్ చేస్తున్నారు. చిరంజీవి, నా సినిమాలు ఒకే రోజున రిలీజ్ కాలేదు. కానీ ఒకే సమయంలో వచ్చాయి. ఏది ఏమైనా రెండు సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది అని నాగార్జున అక్కినేని అన్నారు.

మోహన్ రాజాతో మూవీకి ప్లాన్
ది ఘోస్ట్ సినిమా తర్వాత గాడ్‌ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాతో సినిమా చర్చలు జరుగుతున్నాయి. ఆ చిత్రంలో అఖిల్, నేను నటిస్తాం. అది కూడా యాక్షన్ సినిమానే. నాకు యాక్షన్ చిత్రాలంటే ఇష్టం. నాకంటే ఎక్కువ అఖిల్‌కు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. యాక్షన్ సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాం అని నాగార్జున చెప్పారు. ఇంకా కొత్త సినిమాల గురించి ఏమీ నిర్ణయం తీసుకోలేదన్నారు.


Click it and Unblock the Notifications











