నాన్న మరణాంతరం అలా జరిగింది, తట్టుకోలేకపోయా.. అమ్మ దు:ఖంలో.. మంచి భర్తగా మారిపోయా.. ఎన్టీఆర్
అరవింద సమేత షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది. అమితంగా ప్రేమించే నాన్న మరణం ఆయనను కొంత కృంగ దీసింది. ఆ విషాదం నుంచి తేరుకొని షూటింగ్‌కు హాజరయ్యారు యంగ్ టైగర్. అయితే ఆ విషాద సంఘటన తర్వాత చిత్రీకరించిన పెనిమిటి పాటతో మరోసారి విషాదంలో మునిగిపోయానని ఎన్టీఆర్ వెల్లడించారు. 11న అరవింద సమేత రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ..

నా ఎనర్జీని దృష్టిలో పెట్టుకొవద్దు
అరవింద సమేత సినిమాకు ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఒకటే చెప్పాను. ఎన్టీఆర్ ఎనర్జీని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయకు. సో కాల్డ్ ఇమేజ్ ఆలోచించి కథను ఆలోచించకూడదని నేను చెప్పాను. త్రివిక్రమ్ కథ చెప్పడంలో మేమంత భాగం కావాలని చెప్పాం. ఎన్టీఆర్ జర్నీలో తివిక్రమ్ పార్టీ కావొద్దని స్పష్టం చేశాను. కేవలం మేమంత త్రివిక్రమ్ జర్నీలో భాగమయ్యాం. అలా స్వేచ్ఛ దొరకడంతో ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రలను సృష్టించారు. అందుకు సాక్ష్యంగా జగపతిబాబు పాత్ర, పూజా హెగ్డే పాత్రలు కనిపిస్తాయి.

కథను చెప్పే పాటలే ఉన్నాయి
సాధారణంగా నా సినిమాలో నా ఎనర్జీకి తగినట్టుగా ఐటమ్ పాటలు కావొచ్చు. ఇతర రొమాంటిక్ పాటలు ఉంటాయి. కానీ అరవింద సమేత చిత్రంలో అలాంటి పాటలు కనిపించవు. కథను బలంగా చెప్పే పాటలు ఉన్నాయి. కథకు ఉపయోగపడే పాటలే ఉంటాయి. అదే విషయాన్ని నేను ఆడియో ఫంక్షన్‌లో చెప్పాను. నటనలో డ్యాన్సులు ఓ భాగమే. కానీ డ్యాన్స్‌లో నటన ఓ భాగం కాదు అనేది నేను బలంగా నమ్ముతాను.

టిపికల్ ఎన్టీఆర్ మూవీ కాదు
టిపికల్ ఎన్టీఆర్ సినిమా అంటే ఏంటి? ఎన్టీఆర్ అంటే ఫైట్లు, సీరియస్‌గా ఉండాలా? కెరీర్‌లో నేను కొన్ని తప్పులు చేశాను అందుకే ఆ ట్యాగ్ లైన్ వచ్చింది. నాన్నకు ప్రేమతో టిపికల్ ఎన్టీఆర్ సినిమా అంటే ఒకే. ఎన్టీఆర్ సినిమా అంటే నలుగురు ఎంజాయ్ చేయడం కోసం కాదు. అందరూ చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా.

పెనిమిటి పాట షూట్ గురించి
అరవింద సమేతలో పెనుమటి పాట నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది. నాన్న చనిపోయిన తర్వాత ఆ పాటను షూట్ చేశాం. అలా జరగడం చాలా యాదృచ్చికం. నా జీవితంలో అలాంటి సంఘటన ఎందుకు జరిగిందో అర్దం కాలేదు. ఆ పాటను షూట్ చేసే సమయంలో మా అమ్మను తలచుకొన్నాను. ఆ పాట విని మా అమ్మ దు:ఖంలో మునిగిపోయింది. అదేదో మాకు జరిగిందని చెప్పడం లేదు. పెనుమటి పాట ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రంలో త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్ అదే.

కథ విన్నప్పుడే మారిపోయాను
సినిమా అంటే బాధ్యత అని భావించే వాళ్లందరూ కలిసి చేసిన సినిమా అరవింద సమేత. అందుకే ఈ సినిమా అంత గొప్ప ఫీలింగ్ కలుగజేసింది. మగవాడి చేతిలో పదునైన ఆయుధం మహిళ అని చెప్పే సినిమా అరవింద సమేత. ఈ సినిమా కథ చెప్పినప్పుడే వ్యక్తిగతంగా, మానసికంగా మారిపోయాను.

మంచి భర్తగా, తండ్రిగా, కొడుకుగా
అరవింద సమేత సినిమాకు బాగా కనెక్ట్ అయ్యాను. ఈ చిత్రంలోని పాత్రలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఈ సినిమాలో నటించిన తర్వాత మంచి భర్తగా మారాను. మంచి తండ్రిగా, మంచి కొడుకుగా నాలో మార్పు చూసుకొన్నాను. ఈ మార్పు నా ఒక్కరికే పరిమిత అవుతుందా లేక సమాజంలోని వ్యక్తుల్లో మార్పు తెస్తుందా అనే విషయాన్ని పరిశీలించడానికి ఎదురుచూస్తున్నాను.

సోషల్ మీడియా మంచి డెవలప్‌మెంట్
సొసైటీలో సోషల్ మీడియా ఓ మంచి డెవలప్‌మెంట్. ఎక్కువ మంది కలిసి కోరుకొన్న అంశం. అనవసరం విషయాలు ముందుకు వచ్చినప్పుడు వాటిని సరైన మార్గంలో చక్కదిద్దాలి. ఎంత మంచి జరుగుతున్నది. ఏ మేరకు చెడు జరుగుతున్నదనే విషయాలను బేరీజు వేసుకోవాలి. ఏ విషయమైనా మనం నిమిత్త మాత్రులం.


Click it and Unblock the Notifications











