సినిమాలకు అలా దూరం.. ఇల్లు, బంగారం అమ్ముకుని బతికా.. నటి ప్రగతి ఎమోషనల్
ఇప్పుడంటే తల్లి, అక్క, వదిన, పెద్దమ్మ వంటి పాత్రలను సీనియర్ హీరోయిన్లు పోషిస్తున్నారు కానీ.. ఒకప్పుడు తెలుగునాట ఈ పాత్రలకు సెపరేట్‌గా ఓ బ్యాచ్ ఉండేది. సుధ, హేమ, సురేఖ వాణి తదితరులు ఈ పాత్రలను పోషించేవారు. ఈ కోవలోకే వస్తారు ప్రగతి. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో మెరిసిపోయే ప్రగతి చాలా చిన్న వయసులోనే క్యారెక్టర్ రోల్స్ మొదలుపెట్టారు. తనకంటే పెద్దనటులకు తల్లిగా, అక్కగా, అత్తగా నటించడానికి ఏమాత్రం సంకోచించేవారు కాదు. ఎన్నో విలక్షణ పాత్రలతో వందలాది చిత్రాల్లో నటిగా మంచి గుర్తింపుప తెచ్చుకున్నారు ప్రగతి.
కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో ప్రతి అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. పవర్ లిఫ్టర్‌గా కనిపించి అభిమానులకు షాకిచ్చారు. 40+ వయసులో మహిళ అయ్యుండి ఎంతో కష్టమైన ఈ రంగంలో నిలదొక్కుకోవడమే కాదు.. భారతదేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నో పతకాలు సాధించారు. సంకల్పం, పట్టుదల ఉంటే వయసు అనేది ఒక నెంబర్ మాత్రమేనని ప్రగతి నిరూపిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పోటీలలో పతకాలు సాధించిన ప్రగతి.. గతేడాది టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో నాలుగు పతకాలు కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. దాంతో ప్రగతి పేరు చిత్ర సీమలో మారుమోగుతోంది. పవర్ లిఫ్టింగ్‌లో ఉంటూనే తనకెంతో ఇష్టమైన నటన వైపు రీ ఎంట్రీ ఇచ్చారు ప్రగతి. తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాలలో నటిస్తున్నారు. అయితే ఆమె సినిమాలను ఎందుకు వదిలేశారు? పవర్ లిఫ్టర్‌గా ప్రయాణం ఎలా సాగింది అన్న దానిపై ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రగతి. ఈ వివరాల్లోకి వెళితే..

పవర్ లిఫ్టర్‌గా నాకు మించిన కూలీ పని చేశా. బాడీ పెయిన్స్ ఉంటాయి.. రెండున్నర గంటల్లో చేయాల్సిన వర్కవుట్.. మూడున్నర గంటలు పడితే ఒళ్లు నొప్పులు ఉంటాయి. రాత్రి నిద్రపట్టదు. ఎన్నోసార్లు ఏడ్చా.. అవసరమా నీకు అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. పోటీలకు టైం దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రెజర్ ఎక్కువగా అనిపిస్తుంది. కానీ పర్సనల్ లైఫ్‌కి స్పేస్ ఉండదు. ఫ్రెండ్స్‌తో టైం ఎక్కువ స్పెండ్ చేయలేం. సాయంత్రం 3 గంటల పాటు వర్కవుట్స్ చేయడానికి రోజంతా ఇంట్లోనే ఉండాలి. ఏదైనా పని పెట్టుకుంటే సాయంత్రం ఒక్కోసారి వర్కవుట్స్ స్కిప్ కొట్టేస్తా. అందుకే మ్యాగ్జిమమ్ బయటి పనులు పెట్టుకోను అని ప్రగతి తెలిపారు.
ఏడాదిన్నర పాటు నేను ఎలాంటి సినిమాలు, వేరే పనిచేయలేదు. నాకు వచ్చే క్యారెక్టర్స్ నచ్చలేదు. నేను వర్కవుట్‌కి వెళ్లి బయటకు వచ్చేటప్పుడు ఒక సంతృప్తి ఉంటుంది. ఏంటో జయించేశాను అన్న ఫీలింగ్ ఉంటది. వర్కవుట్ వల్ల ఏదో ఒక బెనిఫిట్ సాధించి ఉంటాను అనిపిస్తుంది. అలాంటి సంతృప్తే నాకు సినిమాలోనూ కావాలని ఆశపడ్డాను. ఎక్కడో అది మిస్ అయ్యింది. నేను షూటింగ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అది లేదు. నేను చేసిన 200 సినిమాలలో మంచి క్యారెక్టర్స్ ఓ పాతిక మించి ఉండవు. ఒక ఏడాదిలో 26 సినిమాలలో నటించిన రోజులున్నాయి. నాకు అప్పట్లో అంత ఆలోచన లేదు.. 24 ఏళ్లకే తల్లిగా నటించాను. అంత వర్క్ ఒకేసారి వచ్చేసరికి ఆనందించా.. ఆ టైంలో డబ్బులు కూడా అవసరమని ప్రగతి తెలిపారు.
వయసు, అనుభవం పెరిగేకొద్ది.. కొన్ని క్యారెక్టర్స్‌కు నన్నేందుకు తీసుకోవడం లేదనే ఆలోచన మొదలైంది. ఆ తర్వాత రెండు మూడేళ్లు గ్యాప్ తీసుకుని సినిమాలు వదిలేశాను. ఏదైనా క్యారెక్టర్ నాకు ఇచ్చినప్పుడు దాని గురించి హోంవర్క్ చేస్తాను, 100 శాతం ఇవ్వడానికే ప్రయత్నిస్తా. 100 మందిలో ఉన్నా నా మీదకి అటెన్షన్ తెచ్చుకోగలను అన్న నమ్మకం ఉంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఆర్ధిక భద్రతను, అనుభవాన్ని, పేరును తెచ్చాయి. కానీ ఇకపై చేసే సినిమాలు నాకు సంతృప్తిని ఇచ్చేలా ఉంటేనే చేయాలని డిసైడ్ అయ్యా. పవర్ లిఫ్టింగ్ విషయంలో చాలా మంది నన్ను తప్పుబట్టారు అని ప్రగతి గుర్తుచేసుకున్నారు.
నా ఒళ్లు, నేను కష్టపడుతున్నా, నా ఇష్టం. నీకు ఈ వయసులో అవసరమా? ఏదైనా విరిగింది అంటే ఏంటీ పరిస్ధితి అని భయపెట్టేవారు. రిస్క్ తీసుకోకుంటే జీవితం ఎందుకు. పవర్ లిఫ్టింగ్‌కు సిద్ధం కావడానికి నేనే డబ్బులు పెట్టాలి. ఇది చాలా ఖరీదైన వ్యవహారం. దానికి సప్లిమెంట్స్ కావాలి, ప్రోటీన్ డైట్ తీసుకోవాలి.. ఆర్ధికంగా చాలా ఇబ్బందిపడ్డా. ఈ రెండేళ్లలో నాకు వేరే అదనపు ఆదాయం లేదు. లగ్జరీ జీవితంలో నేను లేను. ఏదైతే అది అయిందని కూర్చొని తినే పరిస్ధితి కాదు. అయినా కానీ నేను రిస్క్ చేసి ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్నా.. బంగారం అమ్ముకునో, ఇల్లు అమ్ముకునో, అప్పలు చేసుకునో నిలబడ్డాను తప్పించి ఇష్టం లేని పని చేయలేదు అని ప్రగతి తెలిపారు.


Click it and Unblock the Notifications











