ఆ పరిస్థితుల్లో హౌజ్ అరెస్ట్ చేశారు.. అల్లు అర్జున్‌తో ఆఫర్.. ప్రియా వారియర్
ఒకేసారి కన్ను గీటి దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకొన్న ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా లవర్స్ డే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. షూటింగ్ సమయంలోనే సోషల్ మీడియా క్వీన్‌గా మారిన ప్రియా వారియర్ తన చిత్రం లవర్స్ డే సినిమా గురించి, వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించారు. ప్రియా వారియర్ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

లవర్స్ డే చిత్రం గురించి
లవర్స్ డే చిత్రం పాఠశాలస్థాయిలో ఉండే స్వచ్ఛమైన ప్రేమ కథ. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ప్రేక్షకులను బాల్యంలోకి తీసుకెళ్లి ఓ మధురమైన ఫీలింగ్ కలుగ జేస్తుంది. యూత్‌కు ఫీల్ గుడ్ మూమెంట్స్ కలుగజేస్తాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చక్కగా వినోదించే సినిమాగా లవర్స్ డే ఉంటుంది.

అనూహ్యమైన క్రేజ్‌తో
కన్ను గీటిన సీన్‌తో సినిమాపై అనూహ్యమైన క్రేజ్ పెరిగింది. నాకు ఊహించిన పాపులారిటీ లభించింది. ఒక సమయంలో నాకు, నా కుటుంబానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మీడియా, అభిమానులు, సాధారణ జనం నా ఇంటి వద్దకు భారీగా వచ్చేవారు. దాంతో నా కుటుంబ సభ్యులు నన్ను హౌజ్ అరెస్ట్ చేశారు. నన్ను బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు.

రూమర్లకు అలవాటు పడ్డాను
ఇంటర్నెట్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన తర్వాత నన్ను బోర్డింగ్ స్కూల్‌లో పెట్టలేదు. నా గురించి వచ్చిన చాలా వార్తలన్నీ రూమర్లే. వాటిని నేను గానీ, నా కుటుంబం గానీ పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత గాసిప్స్, రూమర్లు అలవాటైపోయాయి. నాపై వచ్చే ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానేశాను.

అల్లు అర్జున్‌తో అవకాశం
మలయాళంలో ఓరు ఆడార్ లవ్ చిత్రం షూటింగ్ జరుగుతుండగానే తెలుగులో అల్లు అర్జున్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను చేయలేకపోయాను. అందుకు కొంత బాధగానే ఉంది. టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లే వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు నేను అంగీకరించలేదు.

అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా
అల్లు అర్జున్ తన కుమారుడితో కలిసి చేసిన షూట్ సీన్ నాకు బాగా నచ్చింది. లవర్స్ డే ఫంక్షన్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తున్నారనే వార్త నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మా సినిమా యూనిట్ అల్లు అర్జున్‌ను ఎప్పుడెప్పుడూ కలుస్తామా అని ఎదురుచూస్తున్నారు. నాకు అల్లు అర్జున్ కలువాలనే ఆతృత మొదలైంది అని ప్రియా వారియర్ చెప్పారు.


Click it and Unblock the Notifications











