Game On తథాస్తు దేవతలు దీవించడం వల్లే.. ఆ కోరిక తీరింది.. నిర్మాత రవి కస్తూరి (ఇంటర్వ్యూ)
గేమింగ్ డ్రామాతో ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం Game On. యువ హీరో, హీరోయిన్లు గీతానంద్, నేహా సోలంకి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ అవుతున్నది. కస్తూరి క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ పై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నిర్మాత రవి కస్తూరి . ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో రవి కస్తూరి మాట్లాడుతూ..
నేను హైదరాబాద్‌లోనే పెరిగాను. ఇక్కడే చదువుకొన్నాను. గీతానంద్ నాకు క్లాస్‌మేట్. మాది టూవీలర్ మీద తిరిగే బ్యాచ్. కాలేజ్ టైమ్‌లోనే సినిమాలంటే నాకు ఇష్టం. ఎప్పటికైనా సినిమా తీయాలనే కోరిక ఉండేది. నేను గీతానంద్ సినిమా చేద్దామని అప్పుడే అనుకొన్నాను. మా కోరికను తథాస్తు దేవతలు విని మమ్మల్ని ఆశీర్వదించడం వల్లే నేను నిర్మాతను అయ్యానని అనుకొంటున్నాను అని రవి కస్తూరి చెప్పారు.

నేను ఆస్ట్రేలియాలో బిజినెస్‌లు చేస్తూ అక్కడే స్థిరపడ్డాను. నేను అక్కడ ఉన్నప్పుడు గీతానంద్, ఆయన సోదరుడు దయానంద్ నాకు ఓ కథ చెప్పారు. స్టోరి బాగా రావడంతో సినిమా తీయాలని అనుకొన్నాం. ఈ ప్రాజెక్టు డిలే కావడానికి కారణం నేను. నేను స్వయంగా అన్ని చూసుకోవాలని అనుకొన్నాను. ఆస్ట్రేలియా, ఇండియా మధ్య తిరగడం వల్ల కొంత లేట్ అయింది అని రవి కస్తూరి తెలిపారు.
గేమ్ ఆన్ చిత్రం సైకాలజికల్ థ్రిల్లర్. రియల్ టైమ్‌లో సాగే స్టోరికి కమర్షియల్, ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించాం. డైరెక్టర్ కూడా నా ఫ్రెండ్ కావడంతో ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. మేము అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కువే అయింది. కానీ క్వాలిటీ కోసం తప్పలేదు. జీవితంలో విఫలమైన యువకుడు సూసైడ్ చేసుకోవాలనుకొన్న సమయంలో అతడి జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమా కథ, గీతానంద్ బాగా నటించాడు. నేహ సోలంకి పాత్ర ఫుల్ గ్లామర్‌తో ట్విస్టులతో సాగుతుంది అని రవి కస్తూరి పేర్కొన్నారు.

రోజా ఫేమ్ మధుబాలది చాలా ఇంట్రెస్టింగ్, ఎమోషనల్ రోల్. ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్‌లా ఉంటుంది. ఆదిత్య మీనన్ పాత్ర కూడా బాగుంటుంది. ఆయన పెర్ఫార్మెన్స్ అందర్నీ కట్టిపడేస్తుంది. శుభలేఖ సుధాకర్ లాంటి మంచి వ్యక్తి నాకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో ప్రతీ పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుంది అని రవి కస్తూరి తెలిపారు.
నవాబ్ గ్యాంగ్స్ మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు కూడా హిట్ అయ్యాయి అని రవి కస్తూరి చెప్పారు. ఈ సినిమా చేయడం వల్ల వచ్చిన అనుభవంతో మరో పది సినిమాలకు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే రెండు కథలు విన్నాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక వాటిని అనౌన్స్ చేస్తాం అని రవి కస్తూరి చెప్పారు.


Click it and Unblock the Notifications











