Razakar ‘రజాకార్ల దురాగతాలు కళ్లకు కట్టినట్టు.. ఆ తప్పు చేస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతా’
తెలంగాణ చరిత్రలో చెరపలేని రక్తపు మరక రజాకార్ల దురాగతం. తెలంగాణ మహిళలు, ప్రజలపై విచక్షణారాహిత్యంగా జరిపిన దాడులు, ప్రేరిపించిన హింస ఇప్పటికీ చీకటి రోజులను తలపిస్తుంది. అలాంటి దురాగతాలు, రజకార్లు సాగించిన దుర్మార్గాలు, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం రజాకార్. సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై గూడురు నారాయణరెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే నటించిన ఈ సినిమా మార్చి 15వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు యాటా సత్యనారాయణ మాట్లాడుతూ..
బాల్యం నుంచి నాకు సినిమాలంటే పిచ్చి. ఆర్కా మీడియాలో ఎన్నో ప్రేమ కథలు పట్టుకుని తిరిగా. హారర్ కథలతో రాసుకొని సినిమా చేయాలని అనుకొన్నాను. కానీ అన్నీ మధ్యలో ఆగిపోయాయి. దర్శకుడిగా మరుగున పడి ఉన్న సంఘటనలతో మంచి కథ చెప్పాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలో నిర్మాతతో నాకు 10 ఏళ్లుగా పరిచయం ఉంది. ఆయనకు మంచి సినిమా తీయాలనే కోరిక ఉండేది. ఆ సమయంలో రజకార్ల దురాగతాలపై సినిమా చేద్దామనే చర్చ వచ్చింది. అలా రజకార్ సినిమా మొదలైంది అని యాటా సత్యనారాయణ చెప్పారు.

తెలంగాణ చరిత్రలో జరిగిన వాస్తవ సంఘటనలు చూపించాను. ఈ సినిమా నిర్మాత పొలిటిషియన్ కాబట్టి ఈ సినిమాను వివాదానికి కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా రిలీజ్ తర్వాత మేము ఏం చెప్పామనేది మీకే అర్ధం అవుతుంది. గతంలో మాభూమి లాంటి గొప్ప కథను చెప్పారు. మరోసారి చేసిన అలాంటి ప్రయత్నమే రజాకర్. ఈ సినిమా చేసే అదృష్టం నాకు వచ్చింది అని తెలిపారు.
రజాకర్ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు దాదాపు సంతృప్తిని వ్యక్తం చేశారు. 16 విషయాల్లో క్లారిటీ అడిగితే వాస్తవాలతో చూపించాను. మితిమీరిన హింస ఉందని కొన్ని కట్స్ చెప్పారు. ఈ సినిమా తీసిన ఉద్దేశం వేరు. రాఘవేంద్రరావు వద్ద పనిచేసిన అనుభవంతో ఈ సినిమాను సులభంగా పూర్తి చేశాను. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వకూడదని నేను కోరాను అని అన్నారు.

స్వాతంత్ర్యం ఆగస్టు 15న వచ్చిందని అందరూ భావిస్తారు. కానీ అది నిజం కాదు. తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందో తెలియానే ఈ సినిమా చేశాను. రజాకార్ వ్యవస్థ సాగించిన దురాగతాలను తెరపై కళ్లకు కట్టినట్టు చూపించాను. ఓ ఊరు, ప్రదేశాన్ని బేస్ చేసుకొని కథ రాయలేదు. 1947 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు జరిగిన అరాచకాలను చూపించాను. కర్ణాటక, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు కూడా కథలో కనిపిస్తాయి అని సత్యనారాయణ చెప్పారు.
గేయ రయిత సుద్దాల అశోక్ తేజ రెండు పాటలు అద్బుతంగా రాశారు. భారతీ భారతీ పాటకు బీజేపీ సంబంధమే లేదు. భారతీ అంటే నా అమ్మ. నా మాతృభూమి. మా కష్టాలను భారతమాతకు చెబుతున్నట్టు ఆ పాట ఉంటుంది. నేను చరిత్రను తప్పుగా చూపించడం లేదు. ఒకవేళ ఆ తప్పు చేస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతాను. తెలియన చరిత్రను చెప్పాలనే రజాకార్ సినిమా తీశాను అని యాటా సత్యనారాయణ అన్నారు.


Click it and Unblock the Notifications











