హీరోగా తన రెమ్యూనరేషన్ ఎంతో చెప్పేసిన షకలక శంకర్!
Recommended Video

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన షకలక శంకర్.... తర్వాత పలు చిత్రాల్లోనూ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్ నుండి హీరోగా టర్న్ అయిన వారి జాబితాలో తాజాగా శంకర్ కూడా చేరిపోయారు. శంకర్‌ను హీరోగా, శ్రీధర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శంభో శంకర'. సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం జూన్ 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు.

అందుకే హీరోగా మారాను
కమెడియన్‌గా తనకు సంతృప్తినిచ్చే పాత్రలు రాక పోవడం వల్లనే హీరో అవ్వాలని నిర్ణయించుకున్నానని శంకర్ తెలిపారు. ఆనందో బ్రహ్మ, గీతాంజలి, రాజుగారి గది లాంటి చిత్రాల తర్వాత ఆ స్థాయి పాత్రలు రాలేదన్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని, తమ కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

డబ్బుకోసం హీరో కాలేదు, ఈ సినిమాకు చాలా తక్కువే తీసుకున్నాను
ఎక్కువ డబ్బు సంపాదించడానికి హీరో కాలేదని శంకర్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కమెడియన్‌గా ఉన్నప్పుడు రోజుకి రూ. 30 వేల నుండి 40 వేలు తీసుకునేవాడిని. `శంభోశంకర` సినిమాకు 50 రోజులు పనిచేశాను. రోజుకు సగటున 13 వేలు మాత్రమే తీసుకున్నాను అని శంకర్ తెలిపారు.

నచ్చని పని చేయలేను
ఈ సినిమా వల్ల నాకు వచ్చిన డబ్బు తక్కువే అయినా పనిచేశాననే తృప్తి దక్కింది. రోజూ బిరియాని తినలేం. అలాగని నచ్చనిది తినలేం. నచ్చిందే తినగలం. అలా నాకు నచ్చని సినిమాలను వదిలేశాను అని శంకర్ తెలిపారు.

అడుక్కోవడానికి సిగ్గు పడటం ఎందుకు?
ఈ సినిమా కథ దిల్ రాజు, త్రివిక్రమ్, రవితేజలకు వినిపించి నా సినిమాకు నిర్మాతగా ఉండాలని అడిగాను. అందులో తప్పుందని భావించడం లేదు. సినిమా చేయడం అంటే పది మందికి అన్నం పెట్టడమే. ఒక మంచి పని చేయడానికి అడుక్కోవడానికి సిగ్గు పడటం ఎందుకు? వాళ్లు నాతో సినిమా చేయనని అనలేదు. సమయం పడుతుందని అన్నారు అందుకే వేరే నిర్మాతతో చేశాను అని శంకర్ తెలిపారు.

డ్రైవర్ రాముడు సినిమా ఆగిపోయింది
నేను హీరోగా స్టార్ట్ చేసిన `డ్రైవర్ రాముడు`లో ఓ సాంగ్.. ఓ ఫైట్ చిత్రీకరించారు. తర్వాత ఏమైందో తెలియదు సినిమా ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో నాకు కూడా తెలియదు.

హీరో పాత్రలే కాదు, కమెడియన్ పాత్రలు కూడా చేస్తాను
‘శంభో శంకర'లో హీరోగా చేశాను కాబట్టే ఇకపై హీరోగా మాత్రమే సినిమాలు చేస్తాను అనుకోవద్దు. నచ్చిన పాత్రలు వస్తే హీరోగా, కమెడియన్‌గా చేస్తూ వెళతాను. ప్లాన్స్ ఏమీ లేవు. నచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్లిపోవడమే. త్వరలో రాబోతున్న నాగచైతన్య ‘సవ్యసాచి'లో నటించాను అని శంకర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











