ఫస్ట్ జీతం 2000.. పెట్రోల్ కోసం 160 రూపాయలు.. ఆ లెక్కలను నమ్మేవారు కాదు.. హీరో సిద్దార్థ్
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఫేమ్ హీరో సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం టక్కర్. కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సిద్దార్థ్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
టక్కర్ చిత్రం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంగా సాగుతుంది. హీరో, హీరోయిన్ మధ్య ఘర్షణ, హీరో, విలన్ మధ్య ఘర్షణ, అహం, వయస్సు, డబ్బు ఇలా అనేక ఘర్షణలు ఉంటాయి. హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్ షిప్‌లో చాలా షేడ్స్ ఉంటాయి. డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్న హీరో కిడ్నాపర్‌గా మారేలా పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. కొడుకు, తల్లి మధ్య సాగే కీలకమైన డైలాగ్ సినిమా సారాంశాన్ని తెలుపుతుంది. హీరో నగరానికి రాగానే దిగజారిపోతున్న పరిస్థితులను చూస్తాడు. పాత్ర తీరు, పరిస్థితుల కారణంగా గూండాలతో ఎలా పోరాటం చేశారనే విషయమే ఈ సినిమా కథ అని సిద్దార్థ్ చెప్పారు.

ప్రస్తుత జనరేషన్‌లో డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువగా కనిపిస్తున్నది. సెలబ్రిటీల విపరీత సంపాదన అందరికీ తెలిసిందే. అయితే డబ్బు కంటే ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా పెంపకం నేర్పింది. డబ్బు కంటే.. సంగీతం, ఇతర విషయాలలో నేను ఆనందాన్ని వెతుక్కుంటాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో కేవలం 2000 రూపాయల జీతం అందుకొన్నాను. పెట్రోల్ అలవెన్స్ కోసం 160 రూపాయలు ఇచ్చే వారు. దానికి లెక్కలు కూడా చెప్పాల్సి వచ్చేది. బిల్లు ఇవ్వకుంటే ఆ లెక్కను నమ్మే వారు కాదు అని తన కష్టాలను సిద్దార్థ్ వివరించారు.
డబ్బు వస్తే, దానితోపాటు కొన్ని అలవాట్లు కూడా వస్తాయనే అపోహ అందరికి ఉండేది. కానీ నా విషయంలో అది జరగలేదు. నేను సాధారణ విషయాలలో ఆనందం, సంతృప్తిని వెతుక్కొంటాను. నేను కోరుకున్నప్పుడల్లా ప్రశాంతంగా నిద్రపోతాను. కాలేజీ రోజుల్లో నాటి పాత దుస్తులనే ఇప్పటికీ ధరిస్తున్నాను. టక్కర్‌లో నేను పోషించిన పాత్ర కూడా నా జీవితానికి దగ్గరగా ఉంటుంది అని సిద్దార్థ్ తెలిపారు.
లవ్ స్టోరీస్ అనేవి ఒక ఎమోషనల్ ప్రయాణం. ఒక్కసారి లవ్ స్టోరీ చేసి హిట్టుకొడితే.. ఆ హీరోను అదే జోనర్‌కు పరిమితం చేస్తారు. బొమ్మరిలు, కొన్ని సినిమాల తర్వాత నేను లవ్ స్టోరీలు చేయకూడదని అనుకొన్నాను. నువ్వొస్తానంటే వద్దంటానా? లాంటి సినిమాలు చేసిన తర్వాత అలాంటి కథలే వచ్చాయి. అయితే వాటి కంటే మంచి కథలు వస్తే చేయాలని చాలా స్టోరీలను రిజెక్ట్ చేశాను అని సిద్దార్థ్ చెప్పారు.

బొమ్మరిల్లు సినిమా తర్వాత నేను భాస్కర్ చాలా సార్లు మాట్లాడుకొన్నాం. బొమ్మరిల్లు 2 తీయాలంటే.. మా కాంబినేషన్‌లో వచ్చే కథ బొమ్మరిల్లు కంటే మంచిగా ఉండాలి. బొమ్మరిల్లు సినిమాకు నా హృదయంలో ఎప్పుడూ స్థానం ఉంటుంది. బొమ్మరిల్లులో ఒక డెప్త్ ఉంటుంది. ఆ డెప్త్‌ను అందించే కథ రావాలి. అప్పుడే బొమ్మరిల్లు 2 సినిమా ఉంటుంది. బొమ్మరిల్లు మ్యాజిక్ సీక్వెల్‌లో కూడా క్రియేట్ చేయాలి అని సిద్దార్థ్ అన్నారు.


Click it and Unblock the Notifications











