ఆయనతో ఇంకా చేయాలని ఉంది.. అలాంటివి పట్టించుకోను.. సోనాల్ చౌహాన్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తోన్న రూలర్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. జై సింహా వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత మళ్లీ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రానుండటంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బాలయ్య లుక్స్, టీజర్, ట్రైలర్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలయ్యేందుకు సిద్దమైన నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేశారు. ఈ క్రమంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను వెల్లడించింది.

వాటిదే భవిష్యత్తు..
ఇప్పటికే లెజెండ్, డిక్టేటర్ సినిమాలో బాలయ్యతో జంట కట్టిన సోనాల్.. ముచ్చటగా మూడో సారి ఆడిపాడేందుకు సిద్దమైంది. రూలర్ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేస్తూ.. అనేక ఆసక్తికరమైన అంశాలను చెప్పుకొచ్చింది.. ఖచ్చితంగా భవిష్యత్తు డిజిటల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ దేనని తెలిపింది. ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్‌లో ఉండే సౌకర్యం వలన ప్రేక్షకులు వీటిని ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చింది. డిజిటల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ వలన ఎంటర్టైన్మెంట్స్ అనేది మన ఫింగర్ టిప్స్ వరకు అందుబాటులోకి వచ్చేస్తుందని, ఈ మార్పు స్వాగతించదగినదేనని పేర్కొంది.

వెబ్ సిరీస్‌లో ఆసక్తి..
దర్శకులు కె ఎస్ రవి కుమార్ ఫోన్ చేసి పిలిపించి మూవీ కథ చెప్పారని వెల్లడించింది. ఆతర్వాత వెంటనే తాను ఒకే చెప్పడం జరిగిందని తెలిపింది. అప్ కోర్స్ కథ వినకపోయినప్పటికీ ఈ మూవీ వదులుకొనేదానిని కాదని చెప్పుకొచ్చింది. వెబ్ సిరీస్‌లో చేయడానికి తాను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని, హిందీలో ఒక వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నానని తెలిపింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని ఇప్పుడే వాటి గురించేమీ చెప్పలేనని అంది.

అలాంటివి పట్టించుకోను..
సోషల్ మీడియాలో కామెంట్స్ అనేవి సర్వ సాధారణమని తెలిపింది. మనకు తెలిసినవారు కామెంట్ చేసినప్పుడు, లేదా మనకు తెలిసిన వారిపై రూమర్స్ క్రియేట్ చేసినప్పుడు తాను స్పందిస్తానని చెప్పుకొచ్చింది. అంతే కానీ ప్రతి ఒక్కరి కామెంట్స్‌కి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఘాటుగా స్పందించింది. తానేమిటో తన పేరెంట్స్‌కి తెలుసునని అందుకే ఎటువంటి రూమర్స్‌ని సీరియస్‌గా తీసుకోనని కరాకండిగా చెప్పేసింది.

ఆయనతో ఇంకా సినిమాలు చేయాలని ఉంది..
ఈ మూవీలో తన పాత్ర పేరు హారిక అని, తలబిరుసు కలిగిన అమ్మాయి, తనకు నచ్చింది దక్కించుకునే వరకు వదలదని మనస్తత్వమని తెలిపింది. తన పాత్రలో గ్లామర్ , ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలు ఉంటాయని చెప్పుకొచ్చింది. బాలకృష్ణ గారిని కలవక ముందు ఆయనంటే కొంచెం భయం ఉండేదనీ, కానీ ఆయనతో పరిచయం ఏర్పడ్డాక ఆ భయం అంతా పోయిందని చెప్పుకొచ్చింది. ఆయన సెట్స్‌లో చాలా జోవియల్‌గా ఉంటారని, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆయనలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ని మెచ్చుకోవాల్సిందేనని అంది. ఆయనతో ఇంకా చాలా సినిమాలు చేయాలని ఉందంటూ తన మనసులోని కోరికను చెప్పేసింది.


Click it and Unblock the Notifications











