RRR ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్భుతం.. 60 రాత్రులు షూట్ చేశాం.. ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి (ఇంటర్వ్యూ)
బాహుబలి తర్వాత మేము ముగ్గురం కలిసి పనిచేయాలని అనుకొన్నప్పుడు మా ముగ్గురి పేర్లలోని ఒక అక్షరం తీసుకొని RRR అని చిత్రానికి ముందుగా వర్కింగ్ టైటిల్ పెట్టాం. అయితే దాని వాడకం సోషల్ మీడియాలో పెరిగిపోవడం, ఆ టైటిల్ ప్రేక్షకులకు, అభిమానులకు నచ్చడంతో అదే టైటిల్ ఫిక్స్ అయిపోయాం. ఈ సినిమాకు మరో టైటిల్ గురించి ఆలోచించలేదు. కేవలం RRR టైటిల్ అనుకొన్నాం. అభిమానులు, ప్రేక్షకుల సూచనతతో దానినే కొనసాగించాల్సి వచ్చింది అని రాజమౌళి అన్నారు. ఇంకా ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి మాట్లాడుతూ..

రాంచరణ్, తారక్ ఎంపిక గురించి
RRR మూవీలో రాంచరణ్, తారక్‌ను ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం వారి ప్రతిభ, వారికి అభిమానుల్లో ఉన్న క్రేజ్. అంతేకాకుండా వారి మధ్య ఉన్న స్నేహం, బాండింగ్ కూడా ఈ సినిమాలోని భీమ్, రామ్ పాత్రల కోసం ఎంచుకోవడానికి మరో కారణం. ఆ రెండు విషయాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా మారబోతున్నాయి. అయితే RRR సినిమాకు ముందే ఎన్టీఆర్, రాంచరణ్ మధ్య మంచి స్నేహం ఉంది. RRR సినిమాకు తర్వాత వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందనేది తప్పు అని ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు.

తారక్, రాంచరణ్‌ను ఎందుకు ఎంపిక చేశామంటే?
అల్లూరి సీతారామరాజు పాత్రను రాంచరణ్ ఎందుకు ఇచ్చానంటే.. రామ్ పాత్రకు సంబంధించి.. ఎంత కష్టమైన విషయమైనా గుండెల్లో దాచుకొనే స్థిత ప్రజత ఉంటుంది. ఆ విషయం రాంచరణ్‌లో కనిపించింది. కష్టమొచ్చినా, ఆనంద కలిగినా ఎలాంటి పరిస్థితుల్లో కూడా తొణకడు. రాంచరణ్‌లోని క్వాలిటీ రామ్ పాత్రకు కరెక్ట్‌గా సరిపోయింది. అందుకే రామ్ పాత్రను రాంచరణ్‌కు ఇచ్చాను అని రాజమౌళి అన్నారు. ఇక RRR సినిమాలో భీమ్ పాత్రకు ఎన్టీఆర్‌ను ఎందుకు ఎంపిక చేశానంటే.. తారక్ చాలా లైవ్‌గా ఉంటాడు. భీమ్ పాత్ర చాలా అమాయకమైన పాత్ర. తన ఫీలింగ్స్‌ను దాచుకొనే పాత్ర కాదు. ఆ క్వాలిటీ తారక్‌లో ఉండటంతో ఆయనను ఎంపిక చేసుకొన్నాను అని రాజమౌళి తెలిపారు.

మా మధ్య స్నేహానికి నిదర్శనమే..
రాజమౌళి చెప్పినట్టు మా మధ్య ఉన్న స్నేహం కారణంగానే RRR చిత్రంలో నేను, చరణ్ కలిసి నటించడానికి అవకాశం కలిగింది. ప్రతీ ఒక్కరికి ప్లస్, మైనస్ పాయింట్లు ఉంటాయి. మా బలం, బలహీనతలు రాజమౌళికి తెలుసు. అందుకే ఆ పాత్రలను మాకు ఇచ్చారు. RRR సినిమాతో మా మధ్య మరింత బలం పెరిగింది అని ఎన్టీఆర్ అన్నారు.

ఇంటర్వెల్ సీన్ మరిచిపోలేని అనుభూతి
RRR సినిమా షూటింగులో చాలా అనుభూతులు ఉన్నాయి. ప్రతీ రోజు కొత్త విషయం నేర్చుకోవడం, కొత్తగా అల్లరి చేయడం, ఆయనతో తిట్లు తినడం జరిగేంది. ఇలా షూటింగులో మరిచిపోలేని అనుభూతులు కొన్ని అని చెప్పలేం. నాకు బాగా నచ్చిన ఎపిసోడ్ ఏమిటంటే.. ఇంటర్వెల్ ఎపిసోడ్ నాకు బాగా నచ్చిన అంశం. రాజమౌళి దాదాపు 60 రాత్రులు షూట్ చేశారు. మీరు అప్పటి వరకు చూసిన చిత్రం ఒక ఎత్తు.. కథ మొత్తం అక్కడికి వచ్చి ఆగుతుంది. కథ చెప్పినప్పుడే నేను చాలా ఎక్సైటింగ్‌గా ఫీలయ్యాను. ఆ సీన్లను ఎలా తీస్తాడు అనే ఉత్కంఠ నాలో ఉండేది. షూటింగ్ చేస్తుంటే కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేం అని ఎన్టీఆర్ అన్నారు.

రాజమౌళి అంతా చేశారు అంటూ రాంచరణ్
RRR సినిమా కోసం మేము ఎలాంటి వర్క్‌షాప్స్ చేయలేదు. ఎలాంటి కసరత్తులు మాకు చేసే అవకాశం ఇవ్వలేదు. ఈ సినిమా కోసం ఎక్కువ వర్క్‌షాప్స్ చేసింది రాజమౌళి గారే. మేము ఆ పాత్రలను కేవలం అర్ధం చేసుకొన్నాం. ఆ పాత్రల్లో దూరిపోయి.. దర్శకుడు చెప్పినట్టు చేశాం అని రాంచరణ్ తెలిపారు.
Recommended Video


మల్టీ స్టారర్ అంటే లెక్కలేసుకొని తీయడం కాదు
మల్టీస్టారర్ చిత్రమంటే... ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు, ఫ్యాన్స్‌లో కొన్ని ఆందోళనలు సహజంగా ఏర్పడుతాయి. ఏ హీరోకు ఎంత స్పేస్ ఉంది. ఏ హీరో మరో హీరోను ఎక్కువ కొట్టాడు లాంటి విషయాలను నేను పూర్తిగా పట్టించుకోలేదు. సినిమా చూసిన తర్వాత ఇద్దరు హీరోల పాత్రలతో విడదీయలేని అనుబంధం ఏర్పడాలి. అది జరగకపోతే నా కథ ఫెయిల్ అవుతుంది. తెర మీద కథ ప్రారంభమైన తర్వాత వారిద్దరి పాత్రల పరిచయంతో ప్రేక్షకులకు దగ్గరైపోతుంది. లెక్కలేసుకొని చేస్తే సినిమా అది తప్పు అవుతుంది. నా సినిమాలో పాత్ర ఏడిస్తే ప్రేక్షకులు ఏడవాలి. నా పాత్రలు నవ్వితే ప్రేక్షకులు నవ్వాలి. నా పాత్రలకు కోపం వస్తే వారికి కోపం రావాలి. RRR సినిమాలో అలాంటి అంశాలు కనిపిస్తాయి తప్ప హీరోల స్క్రీన్ స్పేస్ ఎంత? ఎన్ని ఫైట్లు అనే విషయాలు కనిపించవు అని రాజమౌళి అన్నారు.


Click it and Unblock the Notifications











