Venky Atluri ఎడ్యుకేషన్ ప్రతీ తల్లిదండ్రులకు ఓ ఎమోషన్.. ధనుష్‌కు కథ చెప్పగానే ఏం చేశారంటే?
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం సార్ '(తెలుగు)/ వాతి (తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. సౌత్ ఇండియన్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను వసూలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి మీడియాతో మాట్లాడుతూ..

ధనుష్‌ను ఎందుకు అనుకొన్నానంటే?
సార్/వాతి సినిమా కోసం 90 దశాబ్దాన్ని నేపథ్యంగా ఎంచుకోవడానికి కారణం ప్రత్యేకంగా ఏమీ లేదు. విద్యా వ్యవస్థలో అప్పటికీ.. ఇప్పటికీ పెద్దగా తేడా లేదు. అవే ఎంట్రన్స్‌లు, మార్కులు గోల ఉంది. తల్లిదండ్రులు కష్టాలు, విద్యా వసతులు ఏమీ మారలేదు. సార్ కథను లాక్‌డౌన్‌లో రాసుకొన్నాను. ఆ సమయంలో కర్ణన్, అసురన్ సినిమాల్లో ధనుష్‌ను చూసిన తర్వాత నా కథకు ఆయనే కరెక్ట్ అని అనుకొన్నాను. ఆయనకు కథ చెప్పగానే.. మూడుసార్లు చప్పట్లు కొట్టి.. డేట్లు ఎప్పుడు కావాలని అడిగారు అని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు.

ఎడ్యుకేషన్ ఓ ఎమోషన్
ఎడ్యుకేషన్ అనేది తల్లిదండ్రులకు ఒక ఎమోషన్. పిల్లల భవిష్యత్ కోసం త్యాగాలు చేసి ఫీజులు కడుతారు. అలాంటి సంఘటనలతో కూడిన సార్ సినిమా తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అవుతుంది. చాలా మంది విద్యార్థులు కూడా విద్య ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు పడే తపన కూడా విద్యార్థలకు తెలుస్తుంది అని వెంకీ అట్లూరి తెలిపారు.

నా తల్లిదండ్రులు కూడా
నా బాల్యంలో కూడా నా తల్లిదండ్రులు.. ముఖ్యంగా నా తల్లి బాగా చదువుకోవాలని ప్రోత్సాహించింది. వారి వల్లే నేను ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత నా దృష్టి సినిమాలపైకి మారింది. సార్ సినిమాలోని సన్నివేశాలు మా పేరెంట్స్‌కు బాగా నచ్చాయి. సినిమా చూసిన తర్వాత భారంతో సినిమా థియేటర్ల నుంచి బయటకు వచ్చారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులది కూడా అదే పరిస్థితి అని వెంకీ అట్లూరి చెప్పారు.

త్రివిక్రమ్ కాంట్రిబ్యూషన్ ఎంతంటే?
సార్ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. ఈ సినిమాకు ఆయన నిర్మాత కూడా కావడంతో స్క్రిప్టు నేరేషన్, డిస్కషన్‌లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఒక నిర్మాత కంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. తండ్రి, కొడుకుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు ఫస్ట్ వెర్షన్‌లో లేకుండే.. ఆయన తన జీవితంలో జరిగిన విషయాలను, కష్టాలను చెప్పారు. దాంతో ఆ సన్నివేశాన్ని బలంగా రాయాలనే ఆలోచన వచ్చింది. ఇలాంటి సానుకూలమైన మార్పులు చాలా కథలో చోటు చేసుకొన్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ గానీ, ఫ్రాంచైజీ గానీ ఉండదు. ఈ సినిమా వరకే కథను నిజాయితీగా చెప్పాం అని వెంకీ అట్లూరి తెలిపారు.

డిగ్నిటి ఆఫ్ లేబర్ గురించి
సార్ సినిమాలో లేబర్ ఆఫ్ డిగ్నిటీని గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైనా సరే.. రోజు ఏదో ఉద్యోగం చేస్తుంటారు. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి 25 వేలు సంపాదిస్తే.. క్యాబ్ డ్రైవర్ 35 వేలు సంపాదిస్తున్నాడు. కానీ క్యాబ్ డ్రైవర్ ఉద్యోగిని చిన్న చూపు చూస్తాం. త్రిపాఠి, ఆయన డ్రైవర్ సీన్ ద్వారా లేబర్ ఆఫ్ డిగ్నిటిని చెప్పాం అని వెంకీ అట్లూరి వివరించారు.

తెలుగు, తమిళంలో భారీ రెస్పాన్స్
సార్ (వాతి) సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తున్నది. తమిళం, తెలుగు వెర్షన్లలో మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు 10 నిమిషాల పాటు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అంతకంటే నా సినిమాకు, నాకు కావాల్సిన గౌరవం ఏముంది. ప్రస్తుతానికి వేరే భాషలో రిలీజ్ చేసే ఆలోచనలేదు. హిందీలో రిలీజ్ చేసినా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకొంటున్నాం అని వెంకీ అట్లూరి చెప్పారు.


Click it and Unblock the Notifications











