నోటా అందుకే ఫ్లాప్ అయింది.. ఆ నేతలకు ఓట్లు వేయొద్దు.. నోటా నొక్కండి.. విజయ్ దేవరకొండ!
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి భారీ హిట్లతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండకు నోటా మూవీ బ్రేక్ వేసింది. కేవలం విజయ్ దేవరకొండకే కాకుండా ప్రేక్షకులకు కూడా పెద్ద ఝలక్ ఇచ్చిందా ఆ సినిమా. నోటా సినిమా అంచనాలకు చేరుకోకపోవడంతో సోషల్ మీడియాలో విజయ్‌ను ట్రోల్ చేశారు. టాక్సీవాలా సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నోటా సినిమా ఫ్లాప్ గురించి వివరించాడు. నోటా ఫ్లాప్ కారణం ఏమిటంటే..

నోటా సినిమా షూటింగ్‌లో
నోటా సినిమా షూటింగ్ సమయంలో మూడు సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాను. ఓ పక్క టాక్సీవాలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, మరో పక్క గీతా గోవిందం షూటింగ్, అలాగే నోటా షూటింగ్‌తో బిజీగా ఉన్నాను. మూడు చిత్రాలు ఒకేసారి కావడంతో జడ్జ్‌మెంట్ లోపించింది. నోటాలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితి నాకు ఎదురైంది.

కథలో ఇంటెన్సిటీ
నోటా సినిమాకు ప్రధాన కారణం కథనే. కథలో ఇంటెన్సిటీ లోపించడం, ఆసక్తికరంగా లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. అందుకే ప్రేక్షకులకు నచ్చలేదు. మరోసారి ఇలాంటి తప్పులు జరుగకుండా జాగ్రత్త పడాలని నిర్ణయం తీసుకొన్నాను. నోటా ఫ్లాప్ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. నిర్మాత లాభాలను వెనుకేసుకున్నాడు.

ఒకేసారి రెండు, మూడు చేయను
ఇక నుంచి ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యాను. దాని వల్ల ఓ సినిమాలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కాబట్టి ఒకేసారి ఒక చిత్రం లేదా రెండు సినిమాలు మాత్రమే చేయాలని అనుకొన్నాను. డియర్ కామ్రేడ్ తర్వాత ఏడాదికి ఒకటే సినిమా చేయాలని అనుకొంటున్నాను అని విజయ్ దేవరకొండ చెప్పాడు.

టాక్సీవాలా తర్వాత గ్యాప్
టాక్సీవాలా తర్వాత మరో సినిమా విడుదలకు చాలా గ్యాప్ ఉంటుంది. డియర్ కామ్రేడ్ చిత్రం వచ్చే ఏడాది జూన్, జూలైలో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. గ్యాప్ అనుకోకుండా వచ్చిందే.. కానీ ప్లాన్ చేసింది కాదు అని విజయ్ దేవరకొండ అన్నారు.

నోటా బటన్ నొక్కండి..
తెలంగాణలో ఎన్నికలు వస్తున్నందున్న నోటా బటన్‌ను చక్కగా ఉపయోగించుకోవాలని విజయ్ దేవరకొండ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటు చాలా విలువైనది. సరైన నాయకుడు లేకపోతే నోటాకు ఓటా వేయాలని సూచించారు. ప్రజల సంక్షేమానికి కట్టుబడనటువంటి నేతలకు, అవినీతిపరులకు ఓట్లు వేయవద్దు. దానివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











