ప్రస్తుత రాజకీయాలు జైలు, బెయిల్.. వ్యక్తిగత ద్వేషంతో అణిచి వేయొద్దు.. వీకే నరేష్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. ఈ సినిమా ద్వారా పూజ కొల్లూరు అనే మహిళా దర్శకురాలు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
రాజకీయ వ్యంగాస్త్రంగా రూపొందిన ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్, వెంకటేష్ మహా తదితరులు నటించారు.ఈ సినిమా అక్టోబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్‌లో ఏపీ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది.

మార్టిన్ లూథర్ కింగ్ సినిమా కథ: మార్టిన్ లూథర్ కింగ్ సినిమా విషయానికి వస్తే.. ఒక గ్రామంలో చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. అయితే ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచారనేది సినిమా కథ. ఈ సినిమాను గురించి ప్రమోషన్స్‌లో భాగంగా వీకే నరేష్ మాట్లాడుతూ..

సామాజిక సందేశంతో: వెంకటేష్ మహాతో నాకు ఉమా మహేశ్వర ఉగ్రరూపం సినిమాతో పరిచయం జరిగింది. అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతున్నది. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఇది యువ దర్శకుల యుగం. యువ దర్శకులు, రచయితలు నన్ను దృష్టిలో పెట్టుకొని పాత్రలు రాస్తుండటం చాలా ఆనందంగా ఉంది. మార్టిన్ లూథర్ కింగ్ సినిమా విషయానికి వస్తే.. వినోదంతోపాటు సామాజిక సందేశం ఇస్తున్న చిత్రం అని వీకే నరేష్ చెప్పారు.

రిలీజ్‌కు ముందే ప్రీమియర్లు: మార్టిన్ లూథర్ కింగ్ మూవీ రిలీజ్‌కు ముందు ప్రీమియర్స్ మొదలుపెట్టి వైజాగ్‌లో ప్రదర్శించాం. నేను ఫారిన్‌లో ఉండటం మూలంగా హాజరుకాలేదు. కానీ వరంగల్‌లో నేను ప్రీమియర్‌కు హాజరయ్యాను. లేడీస్, యూత్, ఫ్యామిలీస్, ఫ్యాన్స్ నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. సినిమాను బాగా ఎంజాయ్ చేయడంతో ఈ మూవీ గురించి మంచి నమ్మకం ఏర్పడింది అని వీకే నరేష్ తెలిపారు.
కొత్త దర్శకురాలి పరిచయంతో: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మా సినిమా ఎవరినీ ఉద్దేశించి తీసింది కాదు. ఇవ్వాళ జరుగుతున్న సంఘటనలు, పరిస్థితుల వల్ల కామన్ మ్యాన్ ఇబ్బంది పడుతున్నాడు. అన్ని వర్గాలు, కులాలు ప్రత్యేక పరిస్థితుల మధ్య నలుగుతున్నారు. అలాంటి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు రచయితగా వెంకటేష్ మహా, దర్శకత్వం పూజా కొల్లూరు వహించారు అని వీకే నరేష్ వెల్లడించారు.

ఓటు వేసే పరిస్థితి లేదు: తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయాలు, బిజినెస్ ముడిపడి ఉన్నాయి. రాజకీయం బిజినెస్‌గా మారిన పరిస్థితి నుంచి మార్పు రావాలని కోరుకొంటున్నారు. కొంత మంది ఓటర్లు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఒక ఓటు విలువ వినోదభరితంగా సందేశంగా చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే కామన్ మ్యాన్ కింగ్ అవుతాడో అప్పుడు రాజకీయాలకు విలువ పెరుగుతుంది అని వీకే నరేష్ తెలిపారు.

ఒంగోలు నేపథ్యంగా మూవీ: మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో నా క్యారెక్టర్ విషయానికి వస్తే.. ప్రసిడెంట్‌గా వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మే క్యారెక్టర్. నా వయసు కంటే తక్కువ వయసు ఉండే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. మహా క్యారెక్టర్ కూడా బాగుంటుంది. గ్రామాల్లో రాజకీయాలే ఎక్కువ ఉంటాయి. దాని బేస్ చేసుకొని తీసుకొన్న సినిమా. ఒంగోలు నేపథ్యంగా సినిమా కథ సాగుతుంది. యుద్దం చేసినట్టు సినిమా చేశాం. పూజా కొల్లూరు బాగా తీసింది. నా కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్ అని వీకే నరేష్ చెప్పారు.

వ్యక్తిగత కసితో అణిచివేత: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మొత్తం స్వార్ధం, ధనంతో ముడిపడి ఉన్నాయి. ఒక ఎంపీగా పోటీ చేయాలంటే.. 100 కోట్లు, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 50 కోట్లు కావాలి, ఒకప్పుడు ఎమ్మెల్యే కోసం 50 లక్షలు సరిపోయేవి. ఆ డబ్బు అంతా ప్రజల నుంచే లాగేయాల్సిన పరిస్థితి. ఒకరు అధికారం కొల్పోతే మరొకరు జైలుకు.. వాళ్లు అధికారంలోకి వస్తే వీళ్లు జైలుకు వెళ్తారు. జైలు, బెయిల్ మాదిరిగా మారింది. వ్యక్తిగత దూషణలు, కసితో ఒక రాజకీయ పార్టీని గానీ, ఆ నేతను అణిచివేయడం అంటూ జరగకూడదు. భారతదేశంలో ఎమర్జెన్సీ కాలంలో నేతలందరిని జైలులో పెట్టడం జరిగింది. ఆ ఘటన ప్రజాస్వామ్యంలో మచ్చగా మారింది అని వీకే నరేష్ చెప్పారు.


Click it and Unblock the Notifications











